సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

HHVM Pre Release event: ఇష్టపడి చేశా.. మీకు నచ్చిందా.. బద్దలు కొట్టేయండి.. 

ABN, Publish Date - Jul 21 , 2025 | 11:41 PM

భీమ్లానాయక్‌ విడుదల సమయంలో అందరి సినిమాల టికెట్‌లు వందల్లో ఉంటే పవన్‌ కల్యాణ్‌ సినిమా టికెట్‌ రేటు పది, పదిహేను రూపాయలు ఉంది. అదే రేటులో ప్రేక్షకులు సినిమాలు చూసి ఆదరించారు. అయితే అప్పుడు నేను ఒకటే చెప్పా.. ‘మనల్ని ఎవడ్రా ఆపేది’

ఇది డ్యామ్‌ గట్స్‌కి సంబంధించిన విషయం

సినిమా, రాజకీయం పడ్డాను.. లేచాను..

వయసు పెరిగిందేమో కానీ చేవ తగ్గలేదు..

అప్పుడు.. ఇప్పుడు గుండెల్లో అభిమానులే ఉన్నారు..

త్రివిక్రమ్‌ నా ఆత్మ బంధువు..

బంధాలకి ప్రాధాన్యత ఇచ్చా.. డబ్బుకి కాదు..

అప్పుడు పంతంతో చూసారు.. ఇప్పుడు దాని సత్తా చూస్తారు 

(Harihara Veeramallu Pre release Event)

'భీమ్లానాయక్‌ విడుదల సమయంలో అందరి సినిమాల టికెట్‌లు వందల్లో ఉంటే పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) సినిమా టికెట్‌ రేటు పది, పదిహేను రూపాయలు ఉంది. అదే రేటులో ప్రేక్షకులు సినిమాలు చూసి ఆదరించారు. అయితే అప్పుడు నేను ఒకటే చెప్పా.. ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అని. ఇది డబ్బు కోసమో.. రికార్డులు కోసమో కాదు.. ధైౖర్యం కోసం.. సాహసం కోసం.. న్యాయం కోసం. న్యాయం కోసం నిలబడ్డాం. ఇది డ్యామ్‌ గట్స్‌కి సంబంధించిన విషయం’ అని నటుడు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన పీరియాడిక్‌ యాక్షన్‌ మూవీ ‘హరి హర వీరమల్లు’. క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకులు. నిధీ అగర్వాల్‌ కథానాయిక. ఏఎం రత్నం నిర్మించారు. ఈ నెల 24న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ–రిలీజ్‌ వేడుక జరిగింది.

పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ 'పవన్‌కల్యాణ్‌ ఎప్పుడూ రికార్డుల కోసం ప్రయత్నం చేయలేదు. వాటి కోసం సినిమా చేయలేదు. డబ్బు వెనక ఎప్పుడూ పడలేదు. సగటు మనిషిగా బతుకుదామన్న ఆలోచన తప్ప నేనేమీ కోరుకోలేదు. నేను ఇక్కడ ఈ స్థాయిలో నిలబడటానికి అభిమానులే కారణం. సినిమాల్లో పడ్డాను.. లేచాను.. రాజకీయాల్లో పడి లేచినా, అప్పుడు నా అభిమానులు నా వెన్నంటే ఉన్నారు. నా దగ్గర ఆయుధాల్లేవు, గుండాలు లేరు. గుండెల్లో అభిమానులే ఉన్నారు’’ అని అభిమానులను ఉద్దేశించా మాట్లాడారు పవన్‌.

నచ్చితే బద్దలు కొట్టేయండి..

‘హరి హర వీరమల్లు’ ఆసక్తికర కథ. చరిత్ర చూసుకుంటే భారతదేశం ఎవరిపైనా దాడి చేయలేదు. మనపైనే అందరూ దాడి చేశారు. మన పుస్తకాల్లో అక్బర్‌, షాజహాన్‌, ఔరంగజేబులు గొప్ప అంటూ చెప్పారు. విజయనగర సామ్రాజ్యం గొప్పతనం గురించి చెప్పలేదు. ఔరంగజేబు చేసిన దుర్మార్గాలను చెప్పలేదు. అప్పట్లో హిందువుగా బతకాలంటే పన్ను కట్టాల్సి వచ్చేది. అలాంటి సమయంలో ‘ఛత్రపతి’ శివాజీ ధైర్యంగా పోరాటం చేశారు. అలా ధర్మం కోసం పోరాటం చేసిన ఒక కల్పిత పాత్రే ‘హరిహర వీరమల్లు’. ఏపీలోని కొల్లూరులో కోహినూర్‌ వజ్రం దొరికింది. అది అలా అలా చేతులు మారి లండన్‌ మ్యూజియంలో ఉంది. క్రిష్‌ చెప్పిన ఆ కథ నాకు నచ్చింది. అందుకే ఈ సినిమా కోసం ది బెస్ట్‌ ఎఫర్ట్‌ పెట్టాను. నిర్మాత రత్నంగారు నలిగిపోకూడదని కష్టామైనా, సమయంలో లేకపోయినా ఈ సినిమా చేశా. మీకోసం కాస్త కాలు కదిపి డ్యాన్స్‌లు కూడా చేశాను. రాజకీయాల్లోకి వచ్చాక రియల్‌ లైఫ్‌ గుండాలు, రౌడీలను ఎదుర్కొన్నా. అదే సినిమాటిక్‌గా చేయడానికి కష్టపడాల్సి వచ్చింది. అప్పట్లో నేర్చుకున్న మార్షల్‌ ఆర్ట్స్‌ తదితర అంశాలపై నాకున్న అవగాహనతో క్లైమాక్స్‌ 18 నిమిషాలకు యాక్షన్‌ కొరియోగ్రఫీ చేశా. ఈ మూవీ ఎన్ని కోట్లు కలెక్ట్‌ చేస్తుందో చెప్పలేను. మీరు కోరుకునే సక్సెస్‌ నేనూ కోరుకుంటున్నా. మీ నచ్చితే బాక్సాఫీస్‌ బద్దలు కొట్టేయండి. మీరే నా బలం. మీరే నా ధైర్యం ఈ గుండె మీకోసమే కొట్టుకుంటుంది. మీ కష్టాలను తీర్చడానికి కొట్టుకుంటుంది’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.


కష్టాల్లో నాతో సినిమా తీసింది త్రివిక్రమే..

'చిత్ర పరిశ్రమకు వచ్చి దాదాపు 30 ఏళ్లు అవుతోంది. వయసు పెరిగిందేమో కానీ, గుండెల్లో చేవ మాత్రం చావలేదు. ‘జానీ’ సినిమా ఫెయిల్‌ అయినా అభిమానులు నన్ను వదల్లేదు. ఆ రోజు నుంచి ఈ రోజుకి నా వెనకే ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో అన్ని బంధాలు డబ్బుతో ముడిపడి ఉంటాయి. అందుకే ఆ రోజు నా రెమ్యునరేషన్‌ తిరిగిచ్చేశాను. నేనెప్పుడూ బంధాలకే ప్రాధాన్యం ఇచ్చాను. మంచి పేరుంది.. ప్రధాని నుంచి అందరూ తెలుసు. కానీ దాని వల్ల డబ్బులు రావు. పార్టీ నడపాలంటే డబ్బు కావాలి. అందుకు నాకున్న మార్గం సినిమా చేయడమే. అందుకే సినిమాను వదల్లేదు. మిమ్మల్ని ఆనందింపజేయాలనే ఈ మూవీ చేశా. పవన్‌ ఎప్పుడూ రీమేక్‌లు చేస్తాడని తిట్టుకుంటూ ఉంటారు. అయితే నా వెనకాల పెద్ద దర్శకులు లేరు. వీడితో ఓ రీమేక్‌ చేస్తే డబ్బులొస్తాయి.. పనైపోతుంది... సేఫ్‌ జోన్‌లో ఉండొచ్చు అనుకున్నవాళ్లే ఎక్కువ. అయితే అప్పట్లో నేను చేసిన పాపం ఒక్క ఫ్లాప్‌ సినిమా ఇవ్వడం. దాంతో మళ్లీ సినిమాపై నాకు గ్రిప్‌ దొరకలేదు. ఎవరైన సక్సెస్‌ ఉన్న హీరో వెనక పడతారు. కానీ ఆ సమయంలో నాకు అండగా నిలిచిన వ్యక్తి మిత్రుడు, ఆత్మ బంధువు త్రివిక్రమ్‌గారు. నేను కష్టాల్లో ఉన్నా నాతో ‘జల్సా’ సినిమా చేసి మంచి హిట్‌ ఇచ్చాడు. ‘గబ్బర్‌సింగ్‌’ సినిమా సమయంలో ఒక హిట్‌ ఇవ్వమని మహబూబ్‌నగర్‌కి చెందిన ఓ అభిమాని అడిగారు. నా కోసం హిట్‌ కోరుకోలేదు. కానీ అభిమానుల కోసం హిట్‌ కోరుకున్నా. హరీశ్‌ శంకర్‌ వల్ల గబ్బర్‌సింగ్‌తో హిట్‌ వచ్చింది. హరిహర వీరమల్లు కూడా చాలా క్లిష్టమైన సమయంలో చేశా. ఈ ఈవెంట్‌ చాలా గ్రాండ్‌గా వేలాది మంది అభిమానుల సమక్షంలో జరపాలని ప్లాన్‌ చేశాం. కానీ వర్షాలు, ఇతరత్ర కారణాలు ఉన్నాయి. ఇలాంటి వేడుక చేసుకోవాలంటే చాలా ఒత్తిడి ఉంటుంది. ఈ కార్యక్రమానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, పోలీసుశాఖ వారికి ధన్యవాదాలు. నేను రాజకీయాల్లోకి వచ్చాక మంచి స్నేహితుడిని సంపాదించుకున్నా. ఆయనే కర్ణాటక మంత్రి ఈశ్వర్‌ ఖండ్రే. కర్ణాటక నుంచి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు.

కీరవాణి ఊపిరి పోశారు.

‘కొత్త కథలు చేసే అవకాశం ఉన్నా, అది పోతే టీమ్‌ అంతా ఇబ్బంది పడతాం. అందుకే రీమేక్‌లు చేశా. ఎప్పటికైనా మంచి సినిమా చేయాలని కోరుకున్నా. సరిగ్గా ఆ సమయంలోనే క్రిష్‌ ఈ కథ చెప్పారు. ఇక ‘నాటు నాటు’ పాటతో ప్రపంచాన్ని ఉర్రూతలూంచారు కీరవాణి. ఆయన మ్యూజిక్‌ వింటే నాకు ఎంతో ఉత్సాహం వచ్చేది. సినిమా చేయగలమా లేదా అని నిరుత్సాం, నీరసం కలిగిన ప్రతిసారీ కీరవాణిగారి సంగీతం మాకు బలాన్ని చేకూర్చింది. కీరవాణి మ్యూజిక్‌ లేకపోతే ‘హరి హర వీరమల్లు’ లేదు. గత నెల రోజులుగా నిధీ అగర్వాల్‌ ఎన్నో ప్రచార కార్యక్రమాలు చేస్తూ సినిమాను మోస్తుంది. ఆమెను చూసి సిగ్గు తెచ్చుకుని ఈ రోజు ప్రెస్‌ మీట్‌ పెట్టా. మరో రెండు రోజులపాటు సినిమాను ప్రమోట్‌ చేస్తా’ అని అన్నారు.

Updated Date - Jul 22 , 2025 | 12:32 AM