OTT: 'హతవిధి'.. ఆ పెద్ద సినిమాలకు ఓటీటీ కష్టాలు!
ABN, Publish Date - Oct 19 , 2025 | 05:21 PM
టాలీవుడ్‌లో ఓటిటీల ప్రభావం పెరిగిపోతోంది. పెద్ద హీరోల సినిమాలు, సక్సెస్‌ఫుల్ కాంబో ప్రాజెక్టులు కూడా ఇప్పుడు ఓటిటి సంస్థలు చెప్పిన రేటుకే అమ్మకానికి వస్తున్నాయి. నిర్మాతలకు ఇది కొత్త టెన్షన్‌గా మారింది.
ప్రపంచ స్థాయి సినిమాల నిర్మాణం, కలెక్షన్లతో మన దేశంలో ఎంటర్‌టైన్‌మెంట్ రంగాన్ని శాసిస్తున్నది టాలీవుడ్. బాలీవుడ్‌ను మించి భారీ క్యాస్టింగ్, క్వాలిటీ, కంటెంట్‌తో, ప్రోడక్షన్‌తో అగ్ర భాగాన దూసుకెళుతున్నది. తెలుగులో ఓ పెద్ద సినిమా పట్టాలెక్కిందంటే వాటి కోసం ఎదురు చూసే వారి సంఖ్య జాతీయ స్థాయిలో ఓ రేంజ్‌లో ఉంటుంది. అలాంటి ఈ తెలుగు సినిమాకు ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫాంస్ తీసికట్టుగా మారాయి. ఫ్లీజ్ మీ సినిమాలు మాకివ్వండి, మాకే ఇవ్వండి మీరడిగినంత ఇస్తాం, మీరు ఎంతంటే అంత అనే స్థాయి నుంచి మేము ఎంత చెబితే అంత, మీం చెప్పిందే ఫైనల్ లేకుంటే మరిచిపో అనే లెవల్ వరకు వచ్చి ఇక్కడి నిర్మాతలకు కొరుకుడు పడని విధంగా తయారయ్యాయి.
విషయానికి వస్తే.. టాలీవుడ్‌లో సినిమాల రిలీజ్ డేట్‌ల విషయంలో ఓటీటీలదే (OTT Deals) ఫైనల్ డెషిషన్‌గా ప్రస్తుతం వ్యవహారం నడుస్తొంది. ఇన్నాళ్లు తమ సినిమాలకు.. ఓటీటీ యాజమాన్యాలు ఇచ్చే కోట్ల రూపాయలకు ఆశపడి నిర్మాతలు వారు చెప్పిందల్లా చేస్తూ తలాడిస్తూ వస్తున్నారు. అయితే ఓటీటీలు ఇప్పుడు అసలు గేమ్ మొదలుపెట్టాయనే చర్చ ఇండస్ట్రీలో నడుస్తోంది. ప్రస్తుతం.. కొత్త వారితో చేసే సినిమాలకు, చిన్న బడ్జెట్ చిత్రాలకు ఎలాగూ ఓటీటీ డీలింగ్స్ జరగటం లేదు. హిట్ అయ్యాకే వాటిని కొంటున్నారు.. లేదంటే రెవెన్యూ షేరింగ్ పద్దతిలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు అగ్ర హీరోలు నటించే, సక్సెస్ ఫుల్ కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమాలకు అడిగినంత ఇచ్చిన సదరు దిగ్గజ ఓటీటీలు ఇప్పుడు అడిగినంత ఇచ్చి రైట్స్ తీసుకునేందుకు ఆసక్తిని చూపించటం లేదు.
ఇంకా చెప్పాలంటే.. ఈ ఏడాది సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'సంక్రాంతికి వస్తున్నాం' అనే ఫ్యామిలీ మూవీకి రిలీజ్ ముందు వరకు ఓటీటీ డీల్ అవ్వక నిర్మాత దిల్ రాజు టెన్షన్ పడినట్లు ఆపై ఇక్కడ పనవ్వదని.. ముంబైకి వెళ్లి ఆ సినిమా ఓటీటీ డీల్ ను క్లోజ్ జేసుకోవాల్సి వచ్చిందని టాక్ ఉంది. అది కూడా ఆయన ఆశించిన రేటుకు కాకుండా ఓటీటీ చెప్పిన రేటుకే కావడం గమనార్హం. ఇక అదే సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) ప్రస్తుతం తీస్తున్న సినిమాకు కూడా ఇప్పటివరకు ఓటీటీ డీల్ క్లోజ్ అవ్వలేదని న్యూస్ చక్కర్లు కొడుతుంది. నిర్మాతలకు ఓ ఓటీటీ సంస్ద ఏదో నామిమల్‌గా రేట్ ఒకటి చెప్పి.. అంతకయితేనే కొంటామని తేల్చేసిందని, మిగిలిన ఓటీటీలు అది కూడా ఇచ్చే పరిస్దితి కనిపించటం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే సదరు దర్శకుడు తన సినిమాలన్నీ సేమ్ థీమ్‌తో ఉంటున్నాయని.. పైగా ఓ ఛానల్‌లో తాను హోష్ట్ చేస్తున్న ఓ ప్రోగ్రాంలో ఉపయోగించిన సన్నివేశాలను తాను తీస్తున్న సినిమాలోనూ వాడేసినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేగాక.. ఇక సక్సెస్ ఫుల్ కాంబోలో తెరకెక్కతొన్న మరో అగ్ర హీరో సినిమా డిసెంబరులో పాన్ ఇండియా వైడ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. దాని ఓటీటీ రైట్స్ విషయంలోనూ సేమ్ సీన్.. మా రేటుకే కొంటామని సదరు సంస్థలు మొహమాటం లేకుండా చెప్పేప్పినట్లు సమాచారం. ఇలా సదరు నిర్మాతలు అడిగినంత ఇచ్చేది లేదని.. తాము ఫిక్స్ చేసిన రేటుకి ఓకే అంటే రైట్స్ తీసుకుంటామంటూ ఓటీటీ సంస్దలు క్లారిటీగా చెప్పేస్తున్నాయి.
గతంలోలా నిర్మాతలు అడిగినంత ఇచ్చి భారీ, అగ్ర హీరోల చిత్రాలను ఓటీటీలు ఇప్పుడు కొనుగోలు చేయటం లేదు. ఒకవేళ డీల్ క్లోజ్ చేసినా.. వారు చెప్పిన డేట్ కు సినిమా థియేటర్లలో రిలీజ్ కాకుంటే.. నిర్మాతలకు ఓటీటీలు ఫైన్ కూడా వేస్తున్నాయి. మరలా మరో రేటుకు అగ్రిమెంట్ రాయించుకుంటున్నాయి. ఇక కొందరు హీరోలు మాత్రం కోట్లకు కోట్లు రెమ్యూనిరేషన్స్ దండుకుంటున్నారు. కానీ బడ్జెట్ కు తగ్గ బిజినెస్ మాత్రం వారి సినిమాలకు జరగటం లేదు. గోరుచుట్టు మీద రోకలిపోటులా మరోపక్క ట్రంప్ 100 శాతం టారిఫ్ అనేది నిర్మాతలకు మరో అతి పెద్ద షాక్ గా మారింది. రీసెంట్ గా రిలీజై బ్లాక్ బస్టర్ అయిన ఓజీకి ఓవర్సీస్ నుంచి ఒక్క రూపాయి కూడా తిరిగి నిర్మాతకు వచ్చింది లేదని వార్తలు ఉన్నాయి. ఇలాంటి పరిస్దితుల్లో రాబోయే బిగ్ బడ్జెట్ సినిమాల బిజినెస్ ఏంటి , తమ భవితవ్యం ఎంటనే భయం నిర్మాతల్లో నెలకొంది. మరోవైపు రిలీజ్‌కు ముందు ఆ తర్వాత మంచి హైప్ క్రియేట్ చేసిన పుష్ప వంటి ఒకటి రెండు భారీ సినిమాల విషయంలో మాత్రం ఓటీటీలు నిర్మాతలకు సలాం చేస్తున్నాయి.