Priyanka Mohan: తణుకు కపర్దేశ్వర స్వామిని దర్శించుకున్న.. ప్రియాంక మోహన్
ABN, Publish Date - Nov 24 , 2025 | 05:12 PM
ప్రముఖ నటి ఓజీ ఫేమ్ ప్రియాంక మోహన్ తణుకులోని స్వయంభూ కపర్దేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
ప్రముఖ సినీ నటి ప్రియాంక మోహన్ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు (Tanuku) పట్టణంలోని స్వయంభూ కపర్దేశ్వర స్వామి (Kapardheswara Temple) వారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ప్రియాంకను పూజారులు స్వాగతించి ప్రత్యేకంగా ఆశీర్వదించారు.
అంతకు ముందు ఆమె పట్టణానికి చెందిన ప్రముఖ జ్యోతిష్యులు డా. భమిడి అఖిల్, ఘనాపాటి భమిడి సీతారామ కృష్ణావధానులను వారి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం వారి ఆతిథ్యంలో ఆలయానికి చేరుకుని స్వామివారి దర్శనం చేసుకున్నారు.
ప్రియాంక మోహన్ రాకతో ఆలయం పరిసరాల్లో సందడి నెలకొంది. భక్తులు, అభిమానులు ఆమెను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అభిమానులతో ఫోటోలు దిగుతూ కాసేపు మాట్లాడిన ప్రియాంక, అందరి ప్రేమకు కృతజ్ఞతలు తెలిపింది.
ఇదిలాఉంటే గతంలోనూ చాలామంది సినీ తారలు ఈ ఆలయాన్ని, జ్యోతిష్యులను కలుసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందులో నిధి ఆగర్వాల్, డైరెక్టర్ హరీశ్ శంకర్ (Harish Shankar) వంటి సెలబ్రిటీలు ఉండడం విశేషం.