సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

NTR: శ్రీరామునిగా 'అన్న' అరుదైన చరిత్ర

ABN, Publish Date - Sep 15 , 2025 | 08:02 PM

తెలుగు తెరపైనే కాదు, యావద్భారతంలోనూ శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రలు అనగానే మహానటుడు నటరత్నయన్టీఆర్ గుర్తుకు రాకమానరు. శ్రీరామ పాత్రలో ఆయన నటించిన 'సంపూర్ణ రామాయణం', 'లవకుశ' వంటి చిత్రాలు ఉత్తరాదిన సైతం అనువాదమై ఎంతగానో అలరించాయి.

తెలుగు తెరపైనే కాదు, యావద్భారతంలోనూ శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రలు అనగానే మహానటుడు నటరత్నయన్టీఆర్ గుర్తుకు రాకమానరు. శ్రీరామ పాత్రలో ఆయన నటించిన 'సంపూర్ణ రామాయణం', 'లవకుశ' (Lavakusa) వంటి చిత్రాలు ఉత్తరాదిన సైతం అనువాదమై ఎంతగానో అలరించాయి. అందువల్ల ఎందరో ఉత్తరాది నిర్మాతలు యన్టీఆర్ తో పౌరాణికాలు రూపొందించాలని ఆశించారు. తన పౌరాణికాలు దక్షిణాదివారికే చెందాలని ఆశించిన యన్టీఆర్ వారి కోరికను సున్నితంగా తిరస్కరించారు. బి.ఆర్.చోప్రా (BR Chopra) తన 'మహాభారత్' మెగా టీవీ సీరియల్ రూపొందించే సమయంలో యన్టీఆర్ నే సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే.

యన్టీఆర్ పేరులోనే 'తారకరామ' నామం ఉంది. ఇక అభినయ రామునిగా రామారావు పలు చిత్రాలలో అలరించారు. తొలిసారి శ్రీరామ పాత్రలో యన్టీఆర్ కనిపించిన చిత్రం 'చరణదాసి' (1956) (Charanadasi). ఈ సినిమా తమిళంలోనూ ఏకకాలంలో రూపొందింది. అందులో యన్టీఆర్ పోషించిన పాత్రను జెమినీ గణేశన్ ధరించారు. అయినప్పటికీ తెలుగు ప్రాబల్యం ఉన్న తమిళనేలపైని పలు కేంద్రాలలో 'చరణదాసి'ని రిలీజ్ చేశారు. ఈ సినిమా చూసిన వారు ఇందులో శ్రీరామ పాత్రలో యన్టీఆర్ అంత బాగా, జెమినీ గణేశన్ కనిపించలేదని అన్నారు. ఆ మాట విశేషంగా పనిచేసింది. అప్పటి దాకా శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రలను సాంఘిక చిత్రాల్లోనే స్పెషల్ అప్పియరెన్స్ లో కనిపించిన యన్టీఆర్ 'మాయాబజార్' (1957) (Mayabazar)తో పూర్తి స్థాయి పౌరాణికంలో నటించారు. నిజానికి 'మాయాబజార్'లో మహాభారతంలోని పాత్రలు కనిపిస్తాయే కానీ, అసలైన భారతంలో శశిరేఖ- అభిమన్యు ప్రేమకథ లేనే లేదు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొంది ఘనవిజయం సాధించింది. రెండు చిత్రాల్లోనూ శ్రీకృష్ణ పాత్రలో యన్టీఆర్ కనిపించారు. దాంతో శ్రీరామునిగా యన్టీఆర్, సీత పాత్రలో పద్మిని నటించగా తమిళంలో నేరుగా 'సంపూర్ణ రామాయణం' (Sampoorna Ramayanam) చిత్రం రూపొందింది. కె.సోము దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఎమ్.ఏ.వేణు నిర్మించారు. ఈ సినిమాకు కేవీ మహదేవన్ సంగీతం సమకూర్చారు. ఇందులో భరతుని పాత్రలో శివాజీ గణేశన్ నటించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన సమయంలోనిదే ఇక్కడ కనిపిస్తోన్న స్టిల్ ! 1958 ఏప్రిల్ 14న విడుదలై విజయఢంకా మోగించింది. మద్రాసులో ఈ చిత్రం డైరెక్టుగా 264 రోజులు ప్రదర్శితమైంది. ఈ సినిమాను తరువాత తెలుగులో 'సంపూర్ణ రామాయణం'గానే అనువదించగా, తెలుగునాట కూడా మంచి ఆదరణ చూరగొంది. 1960లో 'రామాయణ్' పేరుతో హిందీలో డబ్ చేశారు.


శ్రీరామునిగా యన్టీఆర్ నటించిన తొలి పౌరాణిక చిత్రంగా తమిళ 'సంపూర్ణ రామాయణం' నిలచింది. తరువాత తెలుగువారి తొలి రంగుల చిత్రం 'లవకుశ' (1963) (Lavakusa)లోనూ యన్టీఆర్ శ్రీరామ పాత్రలో మెప్పించారు. ఈ చిత్రం తమిళ వర్షన్ లోనూ శ్రీరామునిగా యన్టీఆర్ నటించారు. అలా తమిళ నేలపైనా యన్టీఆర్ శ్రీరామునిగా జేజేలు అందుకున్నారు. 1964లో మహానటుడు చిత్తూరు నాగయ్య నిర్మించి, నటించి, దర్శకత్వం వహించిన 'రామదాసు' (Ramadasu) చిత్రంలో శ్రీరామునిగా యన్టీఆర్, లక్ష్మణునిగా శివాజీ గణేశన్ ఓ పాటలో కనిపించారు. "శ్రీకృష్ణావతారం,శ్రీకృష్ణ సత్య, శ్రీకృష్ణాంజనేయ యుద్ధం, శ్రీరామాంజనేయ యుద్ధం, శ్రీరామపట్టాభిషేకం"వంటి పౌరాణికాల్లోనూ, "సి.ఐ.డి., ఉమ్మడి కుటుంబం, చిట్టిచెల్లెలు, అడవిరాముడు" తదితర సాంఘిక చిత్రాల్లోనూ శ్రీరామ పాత్రలో అలరించారు యన్టీఆర్.

శ్రీరామునిగా యన్టీఆర్ నటించిన 'లవకుశ' 1963 మార్చి 29న విడుదలై విజయఢంకా మోగించింది. 60కి పైగా కేంద్రాలలో శతదినోత్సవాలు, 18కి పైగా కేంద్రాలలో రజతోత్సవాలు డైరెక్టుగా చూసిన ఈ సినిమా హైదరాబాద్ లో ఒకే థియేటర్ లో 200 రోజులకు పైగా ప్రదర్శితమయింది. ఇక హైదరాబాద్ లోనే 450 రోజులు ప్రదర్శితమై తెలుగువారి తొలి వజ్రోత్సవ చిత్రంగా నిలచింది. ఈ నాటికీ తెలుగు పౌరాణిక చిత్రాలలో ఇంతటి ఘనవిజయం సాధించిన సినిమా మరోటి కానరాదు. ఇక యన్టీఆర్ శ్రీరామ పాత్ర పోషించిన పౌరాణిక చిత్రాలలో 'శ్రీకృష్ణాంజనేయ యుద్ధం' మినహా అన్నీ శతదినోత్సవాలు చూసినవే! శ్రీరామునిగా యన్టీఆర్ కనిపించిన సాంఘికాలు కూడా అన్నీ వందరోజులు చూశాయి. అందులో 'అడవిరాముడు' 1977 ఏప్రిల్ 28న విడుదలై 35 కేంద్రాలలో శతదినోత్సవం, 16 కేంద్రాలలో రజతోత్సవం, 4 కేంద్రాలలో స్వర్ణోత్సవం చూసింది. ఇలా శ్రీరామ పాత్రలో యన్టీఆర్ నెలకొల్పిన రికార్డు చెక్కుచెదరక నేటికీ నిలచే ఉండడం విశేషం!

Updated Date - Sep 15 , 2025 | 08:03 PM