సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

NTR Family: శ్రీకృష్ణ పాత్రతో రాజయోగం ఖాయం...

ABN, Publish Date - Jun 25 , 2025 | 11:42 AM

నటరత్న యన్టీఆర్ ను తలచుకోగానే గుర్తుకు వచ్చేది ఆయన ధరించిన శ్రీకృష్ణ పాత్ర. ఆ పాత్రలో అలరించిన నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ కు రాజయోగం కూడా పట్టింది. అదే తీరున జూనియర్ యన్టీఆర్ కూడా శ్రీకృష్ణ పాత్ర పోషించాలన్నది అభిమానుల అభిలాష.

శ్రీకృష్ణ (Srikrishna) పరమాత్మ పాత్రలో విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు యన్టీఆర్ (NTR) అభినయం అనితరసాధ్యంగా సాగింది. ఆయన నటవారసులుగా జనం ముందు నిలచిన హరికృష్ణ (Harikrishna), బాలకృష్ణ (Balakrishna) కూడా శ్రీకృష్ణ పాత్రల్లో కనిపించారు. యన్టీఆర్ మూడో కూతురు భువనేశ్వరి సైతం 'మనుషుల్లో దేవుడు' చిత్రంలో ఓ పాటలో శ్రీకృష్ణునిగా కాసేపు కనిపించారు. ఇలా నందమూరి ఫ్యామిలీలో శ్రీకృష్ణ పాత్ర పోషించిన ఈ నలుగురికీ రాజయోగం పట్టిందని చెప్పవచ్చు. రాజకీయాల్లో యన్టీఆర్ సృష్టించిన చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక హరికృష్ణ తండ్రి ప్రాతినిధ్యం వహించిన హిందూపురం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తరువాత రాజ్యసభ సభ్యునిగానూ సాగారు. కొన్నాళ్ళు ఏపీ ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ గానూ పనిచేశారు హరికృష్ణ. ఇక బాలయ్య విషయానికి వస్తే తండ్రి ప్రాతినిధ్యం వహించిన అదే హిందూపురం నుండి ఆయన వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. భువనేశ్వరి ఇప్పటికే నాలుగుసార్లు ముఖ్యమంత్రి భార్య హోదాలో సాగుతున్నారు. ఇలా ఎలా చూసినా నందమూరి ఫ్యామిలీలో శ్రీకృష్ణ పాత్ర పోషించిన వారికి రాజయోగం పట్టిందని చెప్పవచ్చు. జూనియర్ కు కూడా ఆ అదృష్టం కలగాలంటే ఆయన కూడా ఏదైనా సినిమాలో శ్రీకృష్ణునిగా కనిపిస్తే బాగుంటుందని అభిమానుల అభిలాష!


యన్టీఆర్ వారసులకు కూడా...

ప్రపంచలోనే అత్యధిక సార్లు ఒక పౌరాణిక పాత్రను పాతిక సార్లకు పైగా పోషించి మెప్పించిన రికార్డ్ నటరత్న యన్టీఆర్ సొంతం. ఆ పాత్ర శ్రీకృష్ణ భగవానునిదే అని వేరే చెప్పక్కర్లేదు. ఇక ఆయన తొలి నటవారసునిగా ఎంట్రీ ఇచ్చిన హరికృష్ణ మొట్టమొదట తెరపై కనిపించిందే శ్రీకృష్ణ పాత్రలో.ఆ సినిమా 1967లో విడుదలైన 'శ్రీకృష్ణావతారం'. అందులో బాలకృష్ణునిగానే హరికృష్ణ తొలిసారి తెరపై తళుక్కుమన్నారు. సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ వరుసగా మూడు ఫ్లాపులు చూశాక నాలుగో చిత్రం 'మంగమ్మగారి మనవడు'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.. అందులో ఓ పాటలో ఆయన శ్రీకృష్ణునిగా కనిపించి అలరించారు. అదీ విశేషం. ఆ తరువాత మరికొన్ని సినిమాల్లోనూ బాలయ్య శ్రీకృష్ణ పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. తండ్రి హ్యాట్రిక్ సాధించిన నియోజకవర్గం నుండి తనయుడు కూడా ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ అందుకున్న ఘనతను బాలకృష్ణ సొంతం చేసుకున్నారు. ఇలా ఎటు చూసినా శ్రీకృష్ణ పాత్ర నందమూరి వంశానికి ఓ ఆశీర్వాదంగా భావించవచ్చు.


మరి జూనియర్ ఎప్పుడో!?

జూనియర్ యన్టీఆర్ కూడా తన తండ్రి హరికృష్ణ లాగే తొలి చిత్రం 'బ్రహ్మర్షి విశ్వామిత్ర'లోనే పౌరాణిక పాత్రలో తళుక్కుమన్నారు. జూనియర్ సోలోగా నటించిన మొదటి సినిమా 'రామాయణం' కూడా పౌరాణికమే కావడం విశేషం!. ఆ తరువాత జూనియర్ పౌరాణిక గెటప్ అన్నది 'యమదొంగ'లో యంగ్ యమగా నటించి ఆకట్టుకున్నారు. యంగ్ టైగర్ హీరోగా ఎంట్రీ ఇచ్చి 24 ఏళ్ళవుతోంది. ఇప్పటి దాకా శ్రీకృష్ణ పాత్రలో ఆయన కనిపించలేదు. అలాంటి ఛాన్స్ 'బృందావనం'లో వచ్చినా, అందులో సోషల్ అప్పియరెన్స్ ఇచ్చారే తప్ప మైథలాజికల్ టచ్ తో సాగలేదు. పైగా యన్టీఆర్ తల్లి శాలిని శ్రీకృష్ణుని భక్తురాలు. ఈ మధ్యే యన్టీఆర్ తన కుటుంబంతో కలసి ఉడుపిలో శ్రీకృష్ణ స్వామి దర్శనం కూడా చేసుకున్నారు. ఇంతగా శ్రీకృష్ణునితో అనుబంధం ఉన్నా- ఎందువల్ల యన్టీఆర్ ఇప్పటి దాకా ఆ పాత్రను పోషించలేదో అభిమానులకు అంతు పట్టకుండా ఉంది. టాలీవుడ్ లోనే కాదు ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగిన ఈ సమయంలో యంగ్ టైగర్ తప్పకుండా శ్రీకృష్ణ పాత్ర ధరించి తీరాలని ఫ్యాన్స్ అభిలాష. అదే జరిగితే యంగ్ టైగర్ కు ఇక తిరుగు ఉండదనీ వారు భావిస్తున్నారు. మరి అభిమానుల కోరికను పరిగణనలోకి తీసుకొని యన్టీఆర్ ఏ సినిమాలోనైనా శ్రీకృష్ణ పాత్ర పోషిస్తారేమో చూద్దాం.

Also Read: Mohit Suri: సయారా నుండి వచ్చిన నాలుగో పాట

Also Read: M. S. Viswanathan: సంగీత ప్రియులను అలరించిన స్వర విన్యాసం

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Jun 25 , 2025 | 11:42 AM