Nagarjuna: అనుమతి లేకుండా.. నాగార్జున పేరు ఎవరూ వాడొద్దు! హైకోర్టు కీలక తీర్పు
ABN , Publish Date - Oct 01 , 2025 | 11:33 AM
అక్కినేని నాగార్జున అనుమతి లేకుండా పేరు, ఫోటో, స్వరం వాడకూడదని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
తెలుగు సినీ పరిశ్రమలో అగ్రనటుడిగా గుర్తింపు పొందిన అక్కినేని నాగార్జున (Nagarjuna) ఇటీవల ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తన పేరు, ఫోటో, స్వరం లేదా రూపాన్ని తన అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించవద్దని ఆయన పిటీషన్‌లో కోరారు. ప్రస్తుతం సోషల్ మీడియా, ఆన్‌లైన్ వేదికలు, ప్రకటనల్లో ప్రముఖుల పేర్లు, ఫోటోలు విస్తృతంగా వాడుకలోకి వస్తున్నాయి. చాలా సార్లు ఇవి మోసపూరిత ప్రకటనల్లో లేదా తప్పుదారి పట్టించే విధంగా ఉపయోగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తన పర్సనాలిటీ హక్కులు (Personality Rights) రక్షించుకోవాలనే ఉద్దేశంతో నాగార్జున కోర్టును ఆశ్రయించారు.ఇలాంటి కేసుల్లో.. గతంలో అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ వంటి బాలీవుడ్ ప్రముఖులు కూడా కోర్టును ఆశ్రయించగా.. అప్పట్లో ఢిల్లీ హైకోర్టు వారు వేసిన పిటీషన్‌లపై తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చింది.
తాజాగా నాగార్జున పిటీషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ తేజస్ కారియా, వ్యక్తిగత హక్కుల ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత హక్కులు, వినియోగదారుల హక్కులు, డిజిటల్ వాణిజ్య స్వేచ్ఛ ఈ మూడింటి మధ్య సమతుల్యం అవసరమని ఆయన స్పష్టం చేశారు. తరువాత కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ.. నాగార్జున అనుమతి లేకుండా ఆయన పేరు, స్వరం, రూపం వాణిజ్య ప్రకటనలకు వాడకూడదని ఆదేశించింది. ముఖ్యంగా ఏఐ, జెనరేటివ్ ఏఐ, మెషిన్ లెర్నింగ్, డీప్‌ఫేక్ టెక్నాలజీల దుర్వినియోగంపై కోర్టు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టంచేసింది.
నాగార్జున పిటీషన్‌పై తాజాగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు భవిష్యత్తులో ప్రముఖుల వ్యక్తిగత హక్కుల పరిరక్షణలో మైలురాయిగా నిలుస్తాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ తీర్పుతో డిజిటల్ యుగంలో పెరుగుతున్న నకిలీ ప్రకటనలు, ఫేక్ ప్రమోషన్లు, వ్యక్తిగత హక్కుల దుర్వినియోగంపై మరోసారి చర్చ మొదలైంది.