Tammudu: ఎ సర్టిఫికెట్ కోసం దిల్ రాజు పట్టు పట్టాడా...
ABN, Publish Date - Jun 28 , 2025 | 02:34 PM
నితిన్ తాజా చిత్రం తమ్ముడుకు సెన్సార్ బోర్డ్ ఎ సర్టిఫికెట్ ఇవ్వడంపై పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పించాలనుకునే దిల్ రాజు ఈ సినిమా విషయంలో ఎందుకు రాజీ పడి ఉంటారనే చర్చ ఫిల్మ్ నగర్ లో జరుగుతోంది.
ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు (Dil Raju) ప్రొడ్యూస్ చేసిన సినిమాలు వీలైనంత వరకూ కుటుంబ సమేతంగా చూసేవే ఉంటాయి. వాటిలో వినోదానికి పెద్ద పీట వేస్తుంటారు. యాక్షన్ సన్నివేశాలు ఉన్న అవి మోతాదుకు మించి ఉండవు. అసలు 'దిల్' రాజుకు ఉన్న గుడ్ విల్ 'ఫ్యామిలీ ఆడియెన్స్ చూసే సినిమాలు తీసే నిర్మాత' అని. కానీ అలాంటి 'దిల్' రాజు తన తాజా చిత్రం 'తమ్ముడు' (Tammudu) విషయంలో ఓ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. తన చిత్రానికి 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చినా ఫర్వాలేదని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. ఇటీవల నితిన్ హీరోగా, శ్రీరామ్ వేణు తెరకెక్కించిన 'తమ్ముడు' మూవీ సెన్సార్ జరిగింది. ఈ సినిమాకు సి.బి.ఎఫ్.సి. బృందం 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చింది.
'తమ్ముడు' ప్రధానంగా సిస్టర్ సెంటిమెంట్ మూవీ అని అందరూ అనుకుంటున్నారు. అమెరికాలో ఉంటున్న లయ (Laya)ను అక్క పాత్రకు ఎంపిక చేసి ప్రత్యేకంగా ఆమెను పిలిపించి, ఈ పాత్రను కట్టబెట్టారు. అక్కా, తమ్ముళ్ళ సెంటిమెంట్ ఈ సినిమాలో ప్రధానాంశమే అయినా దాన్ని మించిన కథ ఏదో ఉందని తెలుస్తోంది. కొన్ని గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ ఎపిసోడ్స్ ఇందులో ఉన్నాయని దిల్ రాజు ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో తెలిపారు కూడా! ఆ రకంగా ఇందులో యాక్షన్ సీన్స్ మరో లెవల్ లో ఉంటాయని అంటున్నారు. బహుశా సెన్సార్ సభ్యులు సైతం అందుకే ఈ సినిమాకు 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చి ఉండొచ్చు. మితి మీరిన హింస, శృంగార సన్నివేశాలు, పిల్లలను టార్గెట్ చేసి తీసే హింసాత్మక సన్నివేశాలకు సెన్సార్ సభ్యులు ఖచ్చితంగా అభ్యంతరం వ్యక్తం చేస్తారు. అటువంటి సినిమాలకు సహజంగా 'ఎ' సర్టిఫికెట్ ఇస్తారు.
'తమ్ముడు' సినిమాలో మితిమీరిన శృంగార సన్నివేశాలు ఉండటానికి ఆస్కారం లేదు. హీరో మేనకోడలకు సంబంధించిన అభ్యంతరకర సన్నివేశాలు కానీ హింసాత్మక సన్నివేశాలు కానీ ఉండే ఆస్కారం ఉంది. ఒకవేళ ఆ సన్నివేశాల తీవ్రతను తగ్గించడానికి సదరు దర్శక నిర్మాతలు అంగీకరిస్తే... సెన్సార్ సభ్యులు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చేవారేమో! కానీ 'తమ్ముడు' విషయంలో సినిమా థీమ్ డైల్యూట్ అవుతుందనే కారణంగా ఇటు 'దిల్' రాజు, అటు డైరెక్టర్ శ్రీరామ్ వేణు 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చినా పర్వాలేదు, వాటిని తొలగించడానికి ససేమిరా అన్నట్టు తెలుస్తోంది. నిజానికి 'దిల్' రాజు తన చిత్రాలకు 'ఎ' సర్టిఫికెట్ తీసుకోవడానికి అంగీకరించరు. ఏదో రకంగా సీబీఎఫ్సీ సభ్యులను కన్వెన్స్ చేసి లేదా అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగించి 'యు/ఎ' సర్టిఫికెటే పొందుతారని చెబుతుంటారు. అలాంటిది 'దిల్' రాజు 'తమ్ముడు' విషయంలో మాత్రం రాజీపడి 'ఎ' సర్టిఫికెట్ ను తీసుకున్నారంటే ఆశ్చర్యంగా ఉందని సినీజనం చెబుతున్నారు.
Also Read: Rashmika Mandanna: విజయ్ పోస్ట్‌కు.. ఎంత క్యూట్‌గా బదులిచ్చిందో...
Also Read: Ileana DCruz: ఇలియానా.. రెండో బిడ్డ.. పేరు ఇదే