Netflix: నెట్ ఫ్లిక్స్ లో స్కిప్ అడల్ట్ బటన్.. నిజమా
ABN, Publish Date - Nov 21 , 2025 | 11:55 AM
కరోనా తరువాత ఓటీటీలు ఏ రేంజ్ లో ప్రాచుర్యం పొందాయో అందరికీ తెల్సిందే. ప్రేక్షకులు థియేటర్ కు రావడం చాలా తగ్గించేశారు.
Netflix: కరోనా తరువాత ఓటీటీలు ఏ రేంజ్ లో ప్రాచుర్యం పొందాయో అందరికీ తెల్సిందే. ప్రేక్షకులు థియేటర్ కు రావడం చాలా తగ్గించేశారు. నెలలో ఓటీటీలో వస్తుంది కదా.. అంత రేటు పెట్టి టికెట్ కొని థియేటర్ కు వెళ్లడం ఎందుకు అని చెప్పేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద OTT ప్లాట్‌ఫామ్‌లలో ఒకటిగా కొనసాగుతోంది నెట్ ఫ్లిక్స్ (Netflix). విదేశాల్లోనే కాదు ఇండియాలో కూడా తమ సత్తా చాటుతుంది. నెట్ ఫ్లిక్స్ ఇంత ఎదగడానికి కారణం ఎక్కువగా అడల్ట్ సీన్స్ ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్ లను తెరకెక్కించడమని చెప్పొచ్చు. అయితే అదే ఇండియాలో ఎక్కువ విమర్శలను తీసుకొచ్చిపెట్టింది.
సాధారణంగా ఓటీటీ అంటే.. కుటుంబంతో కలిసి చూడడానికి తీసుకొచ్చారు. కానీ, కుటుంబం మొత్తం కలిసి నెట్ ఫ్లిక్స్ లో వచ్చే సిరీస్ లను చూడలేరు అని చెప్పొచ్చు. అడల్ట్ సీన్స్, బూతులు.. కుటుంబం ఉన్నప్పుడు చూడడానికి చాలా ఇబ్బందికరంగా మారతాయి. అందుకే ఎక్కువ నెట్ ఫ్లిక్స్ సినిమాలు చూడడానికి చాలామంది సంకోచిస్తారు. అయితే దీనికి తాజాగా నెట్ ఫ్లిక్స్ ఒక పరిష్కారం తీసుకొచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇకనుంచి అడల్ట్ సీన్స్ ను స్కిప్ చేసే ఫీచర్ ను తీసుకొచ్చిందని సమాచారం. రెండు రోజులుగా నెట్ ఫ్లిక్స్ లో అడల్ట్ సీన్స్ వచ్చినప్పుడు.. కింద ప్లే.. స్కిప్ అడల్ట్ సీన్స్ అనే బటన్స్ వస్తాయని, కుటుంబంతో చూసేటప్పుడు ఆ సీన్స్ ను స్కిప్ బటన్ నొక్కితే.. ఆ అడల్ట్ సీన్ వరకు స్కిప్ అయ్యి వస్తుందని చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో అందరూ నిజమే అనుకున్నారు. కానీ, ఇందులో నిజం లేదు. నెట్ ఫ్లిక్స్ లో ఇలాంటి ఫీచర్ లేదు.. సోషల్ మీడియాలో వచ్చేది ఫేక్ అని తెల్సింది. నిజం చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వినియోగదారులు ఈ ఎంపికను తీసుకురావాలని నెట్‌ఫ్లిక్స్‌ను అడుగుతున్నారు. కానీ, వారు పట్టించుకోవడం లేదు. మరి ముందు ముందు ఇలాంటి ఒక ఆప్షన్ తీసుకొస్తుందేమో చూడాలి.