Pink Elephant Pictures: నిహారిక సినిమాలో నయన్ సారిక...

ABN , Publish Date - Jun 27 , 2025 | 02:46 PM

నయన్ సారిక కొత్త ప్రాజెక్ట్ కు సైన్ చేసింది. ఈసారి ఆమె సంగీత్ శోభన్ సరసన నటిస్తుండటం విశేషం. ఇప్పటికే మ్యాడ్ హీరో నార్నే నితిన్ సరసన ఆయ్ మూవీలో యాక్ట్ చేసింది నయన్ సారిక.

'మ్యాడ్ (Mad), మ్యాడ్ స్క్వేర్ (Mad Square)' సినిమాల్లో హీరోలుగా నటించారు నార్నే నితిన్ (Narne Nithin), సంగీత్ శోభన్ (Sangeeth Sobhan). అలానే వీరితో పాటు నితిన్ రామ్ కూడా ప్రధాన పాత్రనే పోషించాడు. అయితే ఈ ముగ్గురిలో ఇద్దరు హీరోలను ఎంచక్కా కవర్ చేసేసింది హీరోయిన్ నయన్ సారిక (Nayan Sarika). గత యేడాది నయన్ సారిక 'ఆయ్' (Aay) సినిమాలో నటించింది. అందులో హీరో నార్నే నితిన్. ఇక ఇప్పుడీ ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల (Niharika Konidela) ఓన్ ప్రొడక్షన్ లో హీరోయిన్ గా ఎంపికైంది. ఇందులో సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్నాడు. విశేషం ఏమంటే... ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డ్స్ లో రెండు కీలకమైన కేటగిరిల్లో నిహారిక నిర్మించిన తొలి చిత్రం 'కమిటీ కుర్రోళ్ళు' ఎంపికైంది. అలానే నయన్ సారిక నటించిన 'ఆయ్' మూవీ కూడా ఎంపికైంది. ఇప్పుడు నిహారిక నిర్మిస్తున్న రెండో సినిమాలో నయన్ కు చోటు దక్కడం విశేషం. అతి త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ పొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోంది.


పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక నిర్మిస్తున్న రెండో సినిమాకు మానస శర్మ (Manasa Sharma) దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాల్లో అద్భుతమైన నటన ప్రదర్శించిన సంగీత్ సోలో హీరోగా నటించనున్న తొలి సినిమా ఇదే. ఇది వరకే నిహారిక రూపొందించిన వెబ్ ప్రాజెక్ట్స్‌లో హీరో సంగీత్ శోభన్, డైరెక్టర్ మానస శర్మ భాగమయ్యారు. గతంలో 'ఆయ్, క'లో నటించిన నయన్ సారిక పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నిర్మించిన జీ5 వారి 'హలో వరల్డ్', సోనీ లివ్ వారి 'బెంచ్ లైఫ్' వంటి వెబ్ సిరీస్‌ల్లో ద్వారా తెలుగుకి పరిచయమయ్యింది. ఇంకా ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శీను, సుఖ్వీందర్ సింగ్, అరుణ భిక్షు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.


జీ5తో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ రూపొందించిన వెబ్ సిరీస్ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’కి మానస శర్మ రచయితగా.. సోనీ లివ్ రూపొందించిన ‘బెంచ్ లైఫ్’కి దర్శకురాలిగా పని చేశారు. తాజాగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌ రూపొందించనున్న ఈ సినిమాతో మానస శర్మ ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్‌గా అరంగేట్రం చేస్తున్నారు. ఇక సంగీత్ శోభన్ విషయానికి వస్తే ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’లో ప్రధాన పాత్రలో నటించారు.

Also Read: SJ Suryah: సూర్య హీరోగా.. పాన్ ఇండియా చిత్రం! కిల్ల‌ర్ షురూ...

Also Read: Rashmika Mandanna: ర‌ష్మిక.. ఏంటి ఇంత షాక్ ఇచ్చింది

Updated Date - Jun 27 , 2025 | 02:46 PM