YVS Chowdary: ఎన్టీఆర్ మూవీ ఓపెనింగ్ కు సర్వం సిద్థం
ABN, Publish Date - May 08 , 2025 | 01:16 PM
ప్రముఖ దర్శకుడు వైవియస్ చౌదరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమా మే 12న ప్రారంభం కాబోతోంది. యలమంచిలి గీత నిర్మించే ఈ సినిమా ద్వారా నందమూరి జానకిరామ్ కొడుకు ఎన్టీఆర్ హీరోగా పరిచయం అవుతున్నాడు.
నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Ramarao) కొత్త సినిమా షూటింగ్ మే 12న మొదలు కాబోతోంది. అడండాగండి... ఇది యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) కొత్త సినిమా కాదు... ఆయన అన్న జానకిరామ్ కొడుకు ఎన్టీఆర్ సినిమా ఓపెనింగ్! నటరత్న నందమూరి తారక రామారావు తనయుడు హరికృష్ణ (Harikrishna) తన కొడుకుకు ఎన్టీఆర్ అని పేరు పెట్టినట్టే... ఆయన కొడుకు జానకిరామ్ తన కొడుక్కి తాతయ్య ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నారు. ఇప్పుడీ కుర్ర ఎన్టీఆర్ ను హీరోగా పరిచయం చేస్తూ ప్రముఖ దర్శకుడు వైవియస్ చౌదరి ఓ సినిమా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ప్రకటన ఎప్పుడో వచ్చింది. అలానే ఫస్ట్ దర్శన్ అంటూ హీరో, హీరోయిన్ల వివరాలు తెలియచేస్తూ ప్రెస్ మీట్స్ కూడా పెట్టారు.
ఈ సినిమాతోనే ఎన్టీఆర్ సరసన వీణారావు హీరోయిన్ గా నటిస్తోంది. కూచిపూడి నర్తకి అయిన తెలుగమ్మాయి వీణారావుకు కూడా ఇదే మొదటి సినిమా. ఇప్పటికే ఎన్టీఆర్ తనయులు హరికృష్ణ, బాలకృష్ణతో సినిమాలు తెరకెక్కించిన వైవియస్ చౌదరి ఈ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించే పనిలో ఉన్నారు. ఈ చిత్రానికి ఆయన భార్య యలమంచిలి గీత నిర్మాతగా వ్యవహరిస్తోంది. రమేశ్ అత్తిలి సహ నిర్మాత.
ఆస్కార్ విజేతలు ఎం.ఎం. కీరవాణి (MM Keeravani), చంద్రబోస్ (Chandra Bose) సంగీత, సాహిత్యాలను ఈ సినిమాకు సమకూర్చబోతున్నారు. ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు. మే 12న అంగరంగ వైభవంగా ఈ సినిమా ప్రారంభోత్సవం ఉంటుందని, ప్రత్యేక అతిథులు ఎవరనేది త్వరలోనే తెలియచేస్తానని వైవియస్ చౌదరి చెబుతున్నారు. సహజంగా వైవియస్ చౌదరి తన సినిమాకు సంబంధించిన ప్రతి అకేషన్ ను ఎన్టీఆర్ సినిమాలతో ముడిపెట్టే చేస్తున్నారు. ఆ రకంగా చూసుకుంటే... నటరత్న నందమూరి తారకరామారావు నటించిన 'తోడు నీడ' సినిమా విడుదలై మే 12వ తేదీకి 60 యేళ్లు పూర్తి కాబోతోంది.
Also Read: Breaking: తెల్లారితే థియేటర్లలోకి.. రిలీజ్ ఆపేసి ఓటీటీలోకి భారీ చిత్రం! షాక్‌లో ఇండస్ట్రీ
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి