Breaking: తెల్లారితే థియేటర్లలోకి.. రిలీజ్ ఆపేసి ఓటీటీలోకి భారీ చిత్రం! షాక్‌లో ఇండస్ట్రీ
ABN , Publish Date - May 08 , 2025 | 12:24 PM
బాలీవుడ్‌లో ఓ చిత్రం మరో రోజులో థియేటర్లలో విడుదల కావాల్సి ఉండగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడీ విషయం దేశవ్యాప్తంగా సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
బాలీవుడ్‌లో ఓ చిత్ర మరో రోజులో థియేటర్లలో విడుదల కావాల్సి ఉండగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడీ విషయం దేశవ్యాప్తంగా సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. స్త్రీ, స్త్రీ2, ముంజ్యా, ఛావా అంటూ భారీ బ్లాక్‌బస్టర్ చిత్రాలతో బాలీవుడ్‌ను షేక్ చేస్తోన్న నిర్మాణ సంస్థ మాడొక్ ఫిలింస్ (Maddock Films). తాజాగా ఈ సంస్థ నుంచి రాజ్ కుమార్ రావు (Rajkummar Rao), వామికా గబ్బి (Wamiqa Gabbi) హీరోయిన్‌గా హిందీలో రూపొందిన చిత్రం భూల్ చుక్ మాఫ్ (Bhool Chuk Maaf). అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రేపు (మే9) శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు రెడీ అయింది. ఈమేరకు అన్ని ఏర్పాట్లు సైతం పూర్తయ్యాయి కూడా. ఈ పూట గడిస్తే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రాన్ని విడుదల చేయడం ఆపేసి వచ్చే వారం డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేస్తున్నామంటూ మేకర్స్ ప్రకటించి ఒక్కసారిగా బాలీవుడ్‌ను ఖంగు తినేలా చేశారు.
ఫుల్ లెంగ్త్ కామెడీ లవ్, ఫ్యామిలీ, జానర్‌లో వస్తోన్న ఈ మూవీ టీజర్, ట్రైలర్, పాటలు ఇప్పటికే రిలీజై ఓ ఊపు ఊపాయి. తర్వాత విడుదల తేదీని ప్రకటించి రిలీజ్‌కు రెండు మూడు నెలల సమయం ఉండగానే ప్రచారం ప్రారంభించారు. మూవీ రిలీజ్ దగ్గర పడుతున్న కొద్ది హీరో, హీరోయిన్లు కూడా ఓ రేంజ్‌లో హంగామా చేసి సినిమా థియేటర్లకు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు అనుకునేంతగా పబ్లిసిటీ చేశారు. ఈక్రమంలో సినిమాపై మంచి అంచనాలను ఏర్పడి ప్రపంచమంతా బిజినెస్ అదిరిపోయేలా జరిగింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీగానే జరిగాయి. మరో వారం రోజుల్లో, నాలుగు రోజుల్లో మీ ముందుకు సినిమా అంటూ బుధవారం రాత్రి వరకు సోషల్ మీడియాలో పోస్టులు సైతం పెట్టారు.
తీరా తెల్లారితే థియేటర్లలోకి సినిమా వస్తుందనుకుంటున్న సమయంలో ఉన్నట్టుండి మేకర్స్ సోషల్‌మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేసి సినిమాను థియేటర్లలో విడుదల చేయడం లేదంటూ ప్రకటించి సంచలనం సృష్టించారు. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, యుద్ద వాతావరణం ఉన్న నేపథ్యంలో ప్రజల క్షేమం కాంక్షించి మా మూవీని థియేటర్లకు తీసుకు రాలేక పోతున్నాం మే 16న డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదల చేస్తున్నాం క్షమించండి అంటూ పోస్టు పెట్టారు. ఇప్పుడు ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుండగా ఇతర సినమా మేకర్స్ కూడా ఇలాగే తమ చిత్రాలు వాయిదా వేసుకుంటారా, కేంద్రం లాక్‌డౌన్ ఏమైనా పెడుతుందా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మాడొక్ ఫిలింస్ ఉన్నఫలంగా తీసుకున్న ఈనిర్ణయంతో చాలా సినిమాల మేకర్స్ ఇప్పుడు తమ తమ సినిమాల విషయంలో సందిగ్దంలో పడ్డారు.