Nandamuri Balakrishn - Krish: మరోమారు క్రేజీ కాంబో...
ABN, Publish Date - Jul 25 , 2025 | 03:13 PM
నందమూరి నటసింహం బాలకృష్ణతో డైరెక్టర్ క్రిష్ మరోమారు జోడీ కట్టబోతున్నారు. ఈ వార్త ఫిలిమ్ నగర్ లో భలేగా హల్ చల్ చేస్తోంది. ఈ సారి బాలయ్యను క్రిష్ ఏ తీరున తెరపై చూపిస్తారో అని ఫ్యాన్స్ లో ఆసక్తి కలుగుతోంది.
బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఇప్పటికి మూడు సినిమాలు రూపొందాయి. వీరిద్దరి కాంబోలో వచ్చిన తొలి చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఘనవిజయం సాధించింది. తరువాత తన తండ్రి నటరత్న యన్టీఆర్ బయోపిక్ ను క్రిష్ దర్శకత్వంలో నిర్మించి నటించారు బాలయ్య. ఆ సినిమా రెండు భాగాలుగా రూపొందింది. మొదటి భాగం 'యన్టీఆర్ -కథానాయకుడు', రెండో భాగం 'యన్టీఆర్ - మహానాయకుడు'గా విడుదలయ్యాయి. అయితే ఈ రెండు చిత్రాలు అంతగా అలరించలేదు. అయినా 'గౌతమీపుత్ర శాతకర్ణి' వంటి చారిత్రక అంశాన్ని క్రిష్ నడిపిన తీరు జనాన్ని ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే క్రిష్ తో మరోమారు వర్క్ చేయడానికి బాలయ్య కూడా రెడీ అన్నట్టు తెలుస్తోంది.
బాలకృష్ణతో క్రిష్ తెరకెక్కించబోయే తాజా చిత్రం ఎలా ఉండబోతోంది అన్న అంశంపై అప్పుడే చర్చ సాగుతోంది. గతంలో బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన 'ఆదిత్య 369' అప్పట్లో సైన్స్ ఫిక్షన్ మూవీస్ లో క్లాసిక్ గా నిలచింది. అందులో శ్రీకృష్ణ దేవరాయలు, కృష్ణ కుమార్ అనే రెండు పాత్రలను రక్తి కట్టించారు బాలకృష్ణ. ఆ సినిమాకు సీక్వెల్ గా 'ఆదిత్య 999' అనే కథను రూపొందించారని తెలుస్తోంది. ఈ చిత్రకథ రూపకల్పనలో సింగీతం కూడా పనిచేశారని సమాచారం. ఆ కథనే ఇప్పుడు క్రిష్ డైరెక్ట్ చేయబోతున్నారనీ వినిపిస్తోంది.
ప్రస్తుతం బాలకృష్ణ 'అఖండ-2' పూర్తి కాగానే వెంటనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాలో నటించడానికి అంగీకరించారు. ఈ చిత్రానికి సమాంతరంగానే 'ఆదిత్య 999' మూవీని కూడా రూపొందించాలనే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా 'ఆదిత్య 369'లాగే పీరియడ్ డ్రామాను మిక్స్ చేసి సైన్స్ ఫిక్షన్ గా రూపొందిస్తారా? లేక మైథలాజికల్ టచ్ తో సోషియో ఫాంటసీగా తెరకెక్కిస్తారా? అని సినీజనం చర్చించుకుంటున్నారు. క్రిష్ కూడా తన 'ఘాటీ' చిత్రం రిలీజ్ చేసే పనిలో ఉన్నారు. అది కాగానే బాలయ్యతో క్రిష్ తదుపరి చిత్రంపై ఓ క్లారిటీ వస్తుందని అంటున్నారు. మరి ఈ సారైనా బాలయ్యకు క్రిష్ అదిరిపోయే హిట్ అందిస్తారేమో చూడాలి.
Also Read: Mutyala Muggu: 50 వసంతాలైన సినీ వాకిలి ముంగిట చెరిగిపోని 'ముత్యాల ముగ్గు'
Also Read: Rajya Sabha Member: రాజ్యసభ సభ్యునిగా కమల్ హాసన్...