Nandamuri Balakrishna: బాలయ్యా... మజాకా...

ABN , Publish Date - Jul 05 , 2025 | 05:20 PM

నటసింహ నందమూరి బాలకృష్ణ మరో రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నారు. బాలకృష్ణ డాకూ మహరాజ్ సినిమా 175 రోజులు పూర్తి చేసుకోవడంతో ఓ అరుదైన రికార్డ్ బాలయ్య సొంతమయింది. దాంతో యన్బీకే ఫ్యాన్స్ ఆనందంతో చిందులు వేస్తున్నారు.

బాలకృష్ణ (Balakrishna) కెరీర్ లో పలు అరుదైన రికార్డులు నమోదయ్యాయి. తెలుగు తెరపై మొట్టమొదట వంద కేంద్రాలలో నూరు రోజులు చూసిన చిత్రంగా బాలయ్య 'నరసింహనాయుడు' (Narasimha Naidu) నిలచింది. ఇక పాతిక కోట్లు చూసిన మొదటి సినిమాగా 'సమరసింహారెడ్డి' (Samarasimha Reddy) సాగింది. తెలుగునాట అత్యధిక స్వర్ణోత్సవ చిత్రాల హీరోగానూ బాలయ్య జయకేతనం ఎగురవేశారు. ఇవే కాకుండా బాలయ్య కెరీర్ లో మరెన్నో చెరిగిపోని, తరిగిపోని రికార్డులు ఉన్నాయి. ఆయన నటించిన 'డాకూ మహరాజ్' (Daku Maharaj) సినిమా ఈ యేడాది జనవరి 12వ తేదీన సంక్రాంతికి విడుదలై నూట యాభై కోట్లు సాధించింది. దాంతో 'అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకూ మహరాజ్'తో వరుసగా వంద కోట్లు చూస్తూ వచ్చిన సీనియర్ స్టార్ గా బాలయ్య నిలిచారు. అయితే నవతరానికి సైతం సవాల్ విసరుతూ 'డాకూ మహరాజ్' సినిమా జూలై 5న 175 రోజులు పూర్తి చేసుకోవడం విశేషంగా మారింది. ఈ సినిమాతో వరుసగా నాలుగు చిత్రాలు డైరెక్ట్ గా రజతోత్సవం చూసిన రికార్డును బాలయ్య సొంతం చేసుకున్నారు.


ఒకప్పుడు నటరత్న యన్టీఆర్ సినిమాలు మాత్రమే ఆంధ్ర, సీడెడ్, నైజామ్, ఉత్తరాంధ్ర ఏరియాల్లో ఘనవిజయాలు సాధిస్తూ ఉండేవి. ఇతర హీరోల చిత్రాలు ఎంత ఘనవిజయం సాధించినా, ఏదో ఒక ఏరియాలో సమానమైన సక్సెస్ మిస్ అయ్యేది. ఆ తరువాతి తరం హీరోలు సక్సెస్ ఫుల్ మూవీస్ కొన్ని కేంద్రాలలోనే విజయయాత్రలు చూశాయి. చిరంజీవి, బాలకృష్ణ కాలం వచ్చాక వారి సినిమాలు కూడా అన్ని ఏరియాల్లో విజయోత్సవాలు చూడసాగాయి. కానీ, ప్రస్తుత కాలంలో ఎంత హిట్టయినా వంద రోజులు ఆడడమే గగనమై పోయింది. అలాంటిది 'అఖండ' (Akhanda) మొదలు 'డాకూ మహరాజ్' దాకా బాలకృష్ణ నటించిన నాలుగు చిత్రాలు 180 రోజులకు పైగా ప్రదర్శితమై సరికొత్త రికార్డును నెలకొల్పడం అభిమానులకు ఆనందం పంచుతోంది. ఇలా తమ అభిమాన హీరో సినిమాలను ఆడిస్తూ ఆనందించడం కూడా ఫ్యాన్స్ కు పండగ లాగే అనిపిస్తోంది. ఆ తీరునే ఎంతోమంది ఫ్యాన్స్ పండగలు చేసుకుంటున్నారు. కానీ, బాలయ్య ఫ్యాన్స్ మరింత ప్రత్యేక శ్రద్ధతో తమ హీరో చిత్రాలకు రికార్డులు చేకూరుస్తూ సాగడమే ఇక్కడి విశేషం!


ఒక్క 'వీరసింహారెడ్డి'ని మినహాయిస్తే బాలకృష్ణ నటించిన 'అఖండ, భగవంత్ కేసరి, డాకూ మహరాజ్' మూడు చిత్రాలు చిలుకలూరి పేటలోనే రజతోత్సవాలు చూడడం విశేషం. వీటిలో 'అఖండ', 'భగవంత్ కేసరి' ఆ ఊరిలోని రామకృష్ణలో రజతోత్సవం, ద్విశతదినోత్సవం చూశాయి. కాగా ప్రస్తుతం 'డాకూ మహరాజ్' అదే చిలుకలూరి పేటలోని వెంకటేశ్వరలో 175 రోజులు పూర్తి చేసుకుంది. ఇక 'వీరసింహారెడ్డి' చిత్రం ఆలూరు - ఎస్.ఎల్.ఎన్. థియేటర్ లో 367 రోజులు ప్రదర్శితమయింది. బాలకృష్ణ అభిమానులు తమ హీరో హిట్ టాక్ మూవీస్ ను రన్నింగ్ లో రికార్డులు నెలకొల్పుతూ సాగేలా చేస్తున్నారు. ఇతర అభిమానులు కూడా అదే తీరున పయనిస్తున్నా, రన్నింగ్ లో మాత్రం ఎవరూ బాలకృష్ణ స్థాయి సక్సెస్ ను అందుకోలేక పోవడం గమనార్హం!

Also Read: Abhishek Bachchan: విడాకులు రూమర్స్‌.. అభిషేక్‌ రియాక్షన్‌

Also Read: Fish Venkat: ప్రభాస్ సాయం.. అంతా మోసం

Updated Date - Jul 05 , 2025 | 05:20 PM