Akkineni Nagarjuna: 'కుబేర' డబ్బింగ్ పూర్తిచేసిన నాగార్జున..
ABN, Publish Date - Jun 07 , 2025 | 09:46 PM
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కుబేర(Kuberaa).
Akkineni Nagarjuna: కింగ్ అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) మొదటి నుంచి ప్రయోగాలు చేస్తూ ట్రెండ్ సృష్టిస్తూ ఉంటాడు. ఈసారి హీరోగా కాకుండా సపోర్టింగ్ రోల్ లో కనిపించి కొత్త ప్రయోగం చేస్తున్నాడు. టాలీవుడ్ సీనియర్ హీరోలు ఇప్పటివరకు వేరే హీరో సినిమాల్లో క్యామియో చేశారు కానీ, సపోర్టింగ్ రోల్ లో చేయలేదు. మొదటిసారి కింగ్ కుబేర సినిమాలో సపోర్టింగ్ రోల్ లో నటిస్తున్నాడు.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కుబేర(Kuberaa). శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జూన్ 20 న కుబేర ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు.
తాజాగా అక్కినేని నాగార్జున కుబేర డబ్బింగ్ ను ఫినిష్ చేశాడు. గత మూడు రోజుల నుంచి నాగార్జున.. తన చిన్న కొడుకు అఖిల్ పెళ్లి వేడుకలో బిజీగా ఉన్నాడు. జూన్ 6 న అఖిల్ - జైనబ్ ల వివాహం జరిగింది. ఇక పెళ్లి జరిగిన తరువాతి రోజునే నాగ్.. డబ్బింగ్ స్టూడియోకు వచ్చి తన పాత్రకు డబ్బింగ్ పూర్తిచేశాడు. ఈ సందర్భంగా డబ్బింగ్ స్టూడియోలో నాగార్జున, శేఖర్ కమ్ముల, నిర్మాత పుష్కర్ రామోహన్ కలసి మాట్లాడుతున్న ఫోటోలని మేకర్స్ షేర్ చేశారు.
కుబేర సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. హీరో ధనుష్ అయినా.. తెలుగువారందరూ నాగ్ కోసమే ఈ సినిమా చూడడానికి ఎదురుచూస్తున్నారు. ఇక జూన్ 20 వరకు పెద్ద సినిమాలు ఏమి లేవు. అది కూడా కుబేరకు కలిసి రానుంది. మళ్ళీ జూన్ 27 న కన్నప్ప వచ్చేవరకు కుబేరను టచ్ చేసేవారు లేరు. ఈ సినిమా కనుక మంచి టాక్ తెచ్చుకుంటే.. వారం రోజుల్లో భారీ కలక్షన్స్ అందుకోవచ్చు. మరి కుబేరతో నాగ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.