Satya: సత్య హీరోగా.. 'మత్తు వదలరా' దర్శకుడి సినిమా

ABN , Publish Date - Oct 28 , 2025 | 03:54 PM

కమెడియన్ సత్య హీరోగా మారిపోతున్నాడు. 'మత్తు వదలరా' ఫేమ్ రితేష్‌ రానా దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో సత్య హీరోగా నటించనున్నాడు. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.

చిత్రసీమలో ఎవరికి ఎప్పుడు ఏ విధంగా బ్రేక్ వస్తుందో చెప్పలేం. సక్సెస్ అవుతాయని అనుకున్న సినిమా పరాజయం పాలు కావడం, పెద్దగా ఆడవని అనుకున్న సినిమాలూ సూపర్ డూపర్ హిట్ కావడం ఇక్కడ కామన్. అలానే ఆర్టిస్టులనూ కొన్ని సినిమాలు ఓవర్ నైట్ స్టార్స్ ను చేస్తుంటాయి. వన్ మూవీ వండర్ మాదిరి ఆ ఒక్క సినిమాతోనూ కొందరు పది పన్నెండు చిత్రాలలో అవకాశాలు పొందేస్తుంటారు. అయితే ఇలా ఇబ్బడి ముబ్బడిగా అవకాశాలు వచ్చినా... ప్రతిభ, దానితో పాటు కొంత అదృష్టం ఉన్నవాళ్ళే సినిమా రంగంలో నిలబడగలుగుతారు. విషయానికి వస్తే... తెలుగులో కమెడియన్స్ చాలామంది హీరోలుగా మారారు. కానీ అదృష్టం కలిసి రాక వారిలో కొందరు ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టుగా తిరిగి కమెడియన్లు గా మారిపోయారు. ఇక కమెడియన్ గా పేరు తెచ్చుకుని... ఇప్పుడు టాప్ మోస్ట్ విలన్ గా సౌతిండియాలో బిజీగా ఉంటున్నాడు సునీల్ (Sunil). అతనితో పాటు తెలుగు సినిమా రంగంలో కమెడియన్స్ గా రాణించిన మరికొందరు కూడా హీరోలుగా నిలదొక్కుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అలానే మరి కొందరిని హీరో పాత్రలు వెతుక్కుంటూ వెళుతున్నాయి. తాజాగా ఆ ఛాన్స్ ను కమెడియన్ సత్య (Satya) అందుకున్నాడు. నిజానికి ఇప్పుడు సత్య పలు ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నాడు. రామ్ చరణ్‌ 'పెద్ది'తో పాటు అతని చేతిలో పది, పన్నెడు పైగా సినిమాలు ఉన్నాయి.


రితేష్ రానా (Ritesh Rana) దర్శకత్వం వహించిన 'మత్తు వదలరా' 'మత్తు వదలరా 2', 'హ్యాపీ బర్త్ డే' చిత్రాలలో సత్య కీలక పాత్రలు పోషించాడు. ఈ సినిమాల్లో అతను దాదాపు హీరోతో సమానమైన పాత్రలే చేశాడు. అయితే... సత్య సోలో హీరోగా ఇప్పుడు రితేష్‌ రానా ఓ మూవీని ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. సత్య మార్క్ వినోదంతో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తుందట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే వస్తుందని అంటున్నారు. మరి హీరోగా సత్య ఏమేరకు మెప్పిస్తాడు అనేది చూడాలి.

Also Read: The Family Man Season 3: తివారీ.. మళ్లీ ఫ్యామిలీతో వచ్చేస్తున్నాడు

Also Read: Fauzi: 'ఫౌజీ' యంగ్ ప్రభాస్‌గా.. సుధీర్ బాబు చిన్న కొడుకు!

Updated Date - Oct 28 , 2025 | 04:18 PM