August Movies: సినిమాలే సినిమాలు.. ఆ రెండింటి మీదనే అందరి గురి
ABN, Publish Date - Aug 01 , 2025 | 06:15 PM
విజయాపజయాలను పక్కన పెడితే.. కరోనా తరువాత నుంచి ఇండస్ట్రీ కొద్దికొద్దిగా కోలుకుంటూ వస్తుంది. ఒకప్పుడు స్టార్ హీరోలు ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే గగనం అనుకునేవారు.
August Movies: విజయాపజయాలను పక్కన పెడితే.. కరోనా తరువాత నుంచి ఇండస్ట్రీ కొద్దికొద్దిగా కోలుకుంటూ వస్తుంది. ఒకప్పుడు స్టార్ హీరోలు ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే గగనం అనుకునేవారు. కానీ, ఇప్పుడు ఏడాదికి రెండు మూడు సినిమాలు రిలీజ్ చేస్తూ ప్రేక్షకులకు సంతోషాన్ని అందిస్తున్నారు. గత రెండేళ్లుగా చిన్న చిన్న సినిమాలే ఎక్కువ విజయాలను అందుకున్నాయి. అంతకుముందులా ప్రేక్షకులు హీరోలను బట్టి సినిమాలకు వెళ్లడం లేదు.. కథ నచ్చితేనే థియేటర్ వైపు చూస్తున్నారు.
ఏదొక విధంగా జూలై కూడా ముగిసింది. ఈ నెలలో పెద్ద, చిన్న అని పక్కనపెడితే.. సినిమాలు ఎక్కువా.. విజయాలు తక్కువ. ఇక ఆగస్టులో కూడా అంతే. సినిమాలు చాలానే ఉన్నాయి. అవేమి చిన్నాచితాకా సినిమాలు కూడా కావు. దాదాపు అరడజనుకు పైగా సినిమాలు ఈ నెలలో అభిమానులను అలరించడానికి కాచుకొని ఉన్నాయి. అందులో రెండు మాత్రం అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సినిమాలు. మరి ఆగస్టు మొదలు.. చివరి వరకు ఏ సినిమాలు ఏఏ డేట్స్ లో వస్తున్నాయో చూద్దాం రండి.
ఆగస్టు 1 న శుభారంభంగా 'సార్ మేడమ్' దిగారు. విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జంటగా పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే తమిళ్ లో తలైవా తలైవి పేరుతో రిలీజ్ అయ్యి మంచి హిట్ అందుకుంది. ఇక్కడ కూడా పాజిటివ్ టాక్ తోనే దూసుకుపోతుంది. దీంతో పాటు ఈ శుక్రవారమే సన్నాఫ్ సర్దార్, ఉసురే, దఢక్ 2, థాంక్యూ డియర్ రిలీజ్ అయ్యాయి.
ఇక ఈ వారం తరువాత ఆగస్టు రెండోవారంలో చెప్పుకోదగ్గ సినిమాలు ఏమి లేవు. కాకపోతే మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా అతడు రీరిలీజ్ రెడీగా ఉంది. ఆగస్టు 9 న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. దానికన్నా ముందు కమెడియన్స్ వైవా హర్ష, ప్రవీణ్ నటించిన బకాసుర రెస్టారెంట్ ఆగస్టు 8 న రిలీజ్ కానుంది. హిందీలో అదేరోజున అందాజ్ 2, హీర్ ఎక్స్ప్రెస్ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.
ఇక ఆగస్టులో అందరి చూపు.. ఆగస్టు 14 మీదనే ఉంది. రెండు బెస్ట్ సినిమాలు అదే రోజున పోటీకి సిద్ధమవుతున్నాయి. అందులో ఒకటి కూలీ కాగా.. రెండోది వార్ 2. సూపర్ స్టార్ రజినీకాంత్ - లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, సౌబిన్, సత్య రాజ్ ఇలా ఇండస్ట్రీ మొత్తం నటిస్తోంది. ముఖ్యంగా అక్కినేని నాగార్జున విలన్ గా నటిస్తుండడంతో తెలుగువారు మరింత ఎక్కువగా ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
ఇక కూలీకి ధీటుగా రంగంలోకి దిగుతుంది వార్ 2. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అటు బాలీవుడ్.. ఇటు టాలీవుడ్ వేయికళ్లతో ఎదురుచూస్తుంది. ఎన్టీఆర్ మొదటి బాలీవుడ్ ఎంట్రీ కావడం ఒక ఎత్తు అయితే.. హృతిక్ - ఎన్టీఆర్ మధ్య వచ్చే క్లైమాక్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ రెండు సినిమాలే ఆగస్టు మొత్తానికి హైలైట్ అని చెప్పొచ్చు.
ఇక కూలీ, వార్ 2 తరువాత వారం అనుపమ పరమేశ్వరన్ నటించిన పరదా రిలీజ్ కు రెడీగా ఉంది. ఆగస్టు 22 న పరదా రిలీజ్ అవుతుండగా.. అదే రోజున మేఘాలు చెప్పిన ప్రేమకథ అనే సినిమా కూడా రిలీజ్ కానుంది. ఇక ఆగస్టు 27 న నారా రోహిత్ నటించిన సుందరకాండ రిలీజు కు రెడీ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ ఈసారి మాస్ జాతరతో వచ్చేలా లేడని సమాచారం. మరి ఈ నెలలో ఏయే సినిమాలు హిట్ అందుకుంటాయో చూడాలి.