Mohan Babu: మోహన్ బాబు 50 ఏళ్ల సినీవేడుక.. తరలి వచ్చిన తారాలోకం
ABN, Publish Date - Nov 23 , 2025 | 06:52 AM
నటప్రపూర్ణ మోహన్ బాబు నవంబర్ 22తో నటునిగా యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా మోహన్ బాబుకు విషెస్ చెబుతూ, విలక్షణంగా సాగిన ఆయన నటజీవితాన్ని మననం చేసుకుందాం.
నటప్రపూర్ణ మోహన్ బాబు నవంబర్ 22తో నటునిగా యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా శనివారం రాత్రి హైదరాబాద్‌లో నిర్వహించిన వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్, గోపీచంద్, శ్రీకాంత్, నాచురల్ స్టార్ నాని, అల్లు అరవింద్, శ్రీను వైట్ల వంటి ప్రముఖులు హజరయ్యారు.
మోహన్ బాబు (Mohan Babu) నటజీవితాన్ని పరిశీలిస్తే ఉవ్వెత్తున ఎగసి, ఉస్సూరుమని కూలే సముద్రపు కెరటాలు గుర్తుకు వస్తాయి. అయితే సముద్ర మధ్యంలో గంభీరంగా ఉండే వాతావరణంలా మోహన్ బాబు వ్యక్తిత్వం కనిపిస్తుంది. 500 పైచిలుకు చిత్రాల్లో నటించిన మోహన్ బాబు హీరోగా, విలన్ గా, కమెడియన్ గా, కేరెక్టర్ యాక్టర్ గా జనాన్ని అలరించారు. శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకంపై అనేక విజయవంతమైన చిత్రాలు నిర్మించి తన అభిరుచిని చాటుకున్నారు మోహన్ బాబు. భారతదేశంలో అత్యధిక చిత్రాలు నిర్మించిన నటనిర్మాతగా ఆయన ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. కొంతకాలం రాజకీయాల్లోనూ సాగారు - రాజ్యసభ సభ్యునిగానూ ఉన్నారు. ఇక శ్రీవిద్యానికేతన్ స్థాపించి కులమతభేదాలకు అతీతంగా తన విద్యాసంస్థను ఉన్నతంగా తీర్చిదిద్దారు మోహన్ బాబు. తెలుగు చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న మోహన్ బాబు బాటలోనే ఆయన పిల్లలు లక్ష్మీ ప్రసన్న, విష్ణు, మనోజ్ నటనలో అడుగుపెట్టారు. నవంబర్ 22తో నటునిగా మోహన్ బాబు యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నారు. ఈ నాటికీ తన దరికి చేరిన పాత్రల్లో అలరించడానికి సిద్ధంగా ఉన్నారాయన. కొందరు యంగ్ హీరోస్ మూవీస్ లో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
మోహన్ బాబు అసలు పేరు భక్త వత్సలం... చిత్రసీమలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పలువురు దర్శకుల వద్ద పనిచేయక ముందు ఓ స్కూల్ లో ఫిజికల్ డైరెక్టర్ గానూ ఉన్నారు భక్తవత్సలం... ఆయన పేరును మోహన్ బాబుగా మార్చి నటునిగా జనం ముందు నిలిపింది దర్శకరత్న దాసరి నారాయణరావు. అంతకు ముందు కొన్ని చిత్రాల్లో బిట్ రోల్స్ లో కనిపించారు భక్త వత్సలం. అయితే మోహన్ బాబుగా జనం ముందు నిలచి, వారి మనసులు గెలిచింది మాత్రం దాసరి 'స్వర్గం- నరకం'తోనే అని చెప్పాలి. 'స్వర్గం-నరకం' చిత్రం 1975 నవంబర్ 22న విడుదలయింది. ఈ సినిమాలో నెగటివ్ టచ్ తో కనిపించి, తరువాత పాజిటివ్ గా మారే పాత్రలో మోహన్ బాబు నటించారు. ఆయనకు జోడీగా అన్నపూర్ణ కనిపించారు. ఈ సినిమా మంచి విజయం సాధించి, ఇందులో నటించిన మోహన్ బాబు, ఈశ్వరరావు, ఫటాఫట్ జయలక్ష్మి, అన్నపూర్ణకు గుర్తింపు తీసుకు వచ్చింది.
'స్వర్గం-నరకం' టైటిల్ కు తగ్గట్టుగానే మోహన్ బాబు నటజీవితం కొన్నిసార్లు స్వర్గంలోని సౌఖ్యాలతో, కొన్నిసార్లు నరకం లాంటి సమస్యలతో సాగింది. అయితే అన్నిటినీ చిరునవ్వుతో గెలుస్తూ సాగారు మోహన్ బాబు... దాసరి 'కేటుగాడు' సినిమాతో హీరోగా పరిచయమైన మోహన్ బాబు తరువాత కొన్ని చిత్రాల్లో కథానాయకునిగా అలరించారు... ఆ పై నిర్మాతగా మారి కూతురు పేరిట శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ నెలకొల్పి 40కి పైగా చిత్రాలు నిర్మించారు... పరాజయాలు పలుకరించిన తరుణంలో మళ్ళీ విలన్ గా, కామెడీ విలన్ గా మురిపించారు. 'అల్లుడుగారు' ఘనవిజయంతో స్టార్ హీరోగా సాగారు... 'అసెంబ్లీ రౌడీ, బ్రహ్మ, రౌడీగారి పెళ్ళాం, మేజర్ చంద్రకాంత్' వంటి సూపర్ హిట్స్ నిర్మించారు... అన్నిటినీ మించి 'పెదరాయుడు'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు మోహన్ బాబు. ఆ సినిమా వసూళ్ళ వర్షం కురిపించింది... దాంతో 'కలెక్షన్ కింగ్' గా జనం మదిలో నిలిచారు... నవంబర్ 22న మోహన్ బాబు యాభై ఏళ్ళ నటజీవిత ఉత్సవం సాగనుంది... రాబోయే రోజుల్లోనూ మోహన్ బాబు మరింతగా అలరిస్తారని ఆశిద్దాం.