Mohan Babu: మోహన్ బాబును అరెస్ట్ చెయ్యొద్దు.. సుప్రీం
ABN , Publish Date - Jan 09 , 2025 | 12:03 PM
Mohan Babu: తన వయసు 78 ఏళ్లని, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నానని అందుచేత తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
సినీనటుడు, దర్శక, నిర్మాత మంచు మోహన్‌బాబు (Manchu Mohanbabu)కు సుప్రీంకోర్టు (Supreme Court)లో ఊరట లభించింది. ముందస్తు బెయిల్ (Bail) పై విచారణ జరుగుతోందని, ఆ విచారణ ముగిసేంతవరకు మోహన్‌బాబును అరెస్ట్ చేయవద్దని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసుపై ముందస్తు బెయిల్ (Anticipatory bail) మంజూరుకు తెలంగాణ హైకోర్టు (Telangana High Court) నిరాకరించింది. దీంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై గురువారం జస్టిస్ సుధాంశు థులియా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో మోహన్‌బాబు ముందస్తు బెయిల్‌పై విచారణ పూర్తయ్యే వరకు ఆయనను అరెస్టు చేయవద్దంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
కాగా, మంచు మోహన్ బాబు బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. జర్నలిస్ట్ పై దాడి కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ మెహన్ బాబు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తన వయసు 78 ఏళ్లని, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నానని అందుచేత తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలో సుప్రీం కోర్టు నుంచి తనకు సానుకూల తీర్పు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆయన అనుకున్నట్టుగానే గురువారం విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
కాగా మోహన్ బాబు జర్నలిస్టుపై దాడి చేయడం వల్ల ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో హత్యాయత్నం ఆరోపణలపై మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా కోర్టు ఆదేశాల ఉల్లంఘన.. గత నెల డిసెంబర్ 24న పోలీసుల ముందు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ ఆదేశాలను ఆయన పాటించలేదు. ఈ క్రమంలో మోహన్ బాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. దీంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించారు.
మంచు ఫ్యామిలీలో ఇటీవల వరసగా కీలక పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మోహన్ బాబు చిన్న కుమారుడు, హీరో మంచు మనోజ్ వ్యవహార శైలితో.. ఆ కుటుంబంలో వివాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో మంచు మోహన్ బాబు వర్సెస్ మంచు మనోజ్ అన్నట్లుగా పరిస్థితి మారింది. మోహన్ బాబు మంచు మనోజ్ వివాదంలో ఇప్పటికే మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని.. దర్యాప్తు చేస్తున్నామని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. మోహన్ బాబు అరెస్ట్ విషయంలో ఎక్కడ ఆలస్యం లేదని సీపీ స్పష్టం చేశారు. ఆయన వద్ద మెడికల్ రిపోర్ట్ తీసుకోవాలని చెప్పారు. మోహన్ బాబుకు నోటీస్ ఇచ్చామని.. గత నెల డిసెంబర్24 వ తేదీ వరకు సమయం అడిగారని తెలిపారు. 24 వ తేదీ వరకు తెలంగాణ హైకోర్టు కూడా మోహన్ బాబుకు మినహాయింపు ఇచ్చిందని తెలిపారు. ఆ తర్వాత కూడా ఆయన రాలేదన్నారు. రాచకొండ పరిధిలో మోహన్ బాబుకు ఎలాంటి గన్ లైసెన్స్ లేవని తేల్చిచెప్పారు.