Miss Terious: వారం ఆలస్యంగా జనం ముందుకు
ABN, Publish Date - Dec 14 , 2025 | 09:28 AM
'అఖండ 2' కారణంగా వాయిదా పడిన 'మిస్ స్టీరియస్' మూవీ డిసెంబర్ 19న విడుదల కాబోతోంది. బిగ్ బాస్ ఫేమ్ రోహిత్, నాగభూషణం మనవడు అబిద్ భూషణ్ ఇందులో కీలక పాత్రలు పోషించారు.
ప్రముఖ నటుడు నాగభూషణం మనవడు అబిద్ భూషణ్, బిగ్ బాస్ ఫేమ్ రోహిత్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'మిస్ స్టీరియస్' (MissTerious). మహి కోమటిరెడ్డి (Mahi Komatireddy) దర్శకత్వంలో జయ్ వల్లందాస్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 12న విడుదల కావాల్సింది. కానీ 'అఖండ 2' కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఇప్పుడీ సినిమా డిసెంబర్ 19న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు.
ఈ సందర్బంగా దర్శకుడు మహి మాట్లాడుతూ, 'కొత్త స్క్రీన్ ప్లే తో పూర్తిగా సస్పెన్స్ తో వున్న ఈ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకుడిని ఆద్యంతం ఒక కొత్త అనుభూతికి లోను చేస్తుందనే నమ్మకం ఉంది. మా సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన మాకు శుభాకాంక్షలు తెలియచేసిన బ్రహ్మానందం గారికి ధన్యవాదాలు' అని అన్నారు. నిర్మాత జయ్ వల్లందాస్ మాట్లాడుతూ, 'సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం. టీజర్ అందరికీ నచ్చడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో రోహిత్ (Rohit), అబిద్ భూషణ్ (Abid Bhushan) తో పాటు మేఘన రాజపుట్ (Meghna Rajput), రియా కపూర్ (Riya Kapoor), కన్నడ నటుడు బాలరాజ్ వాడి, శ్రీనివాస్ భోగిరెడ్డి, ఆకునూరి గౌతమ్, జబర్దస్త్ రాజమౌళి, జబర్దస్త్ నవీన్, లక్కీ ఇతర కీలక పాత్రలు పోషించారు' అని చెప్పారు. ఈ సినిమాకు ఎం.ఎల్. రాజా సంగీతం అందించారు.