Miss Terious: సెన్సార్ కార్యక్రమాలు పూర్తి... విడుదల ఎప్పుడంటే...
ABN, Publish Date - Nov 25 , 2025 | 08:34 PM
బిగ్ బాస్ ఫేమ్ రోహిత్, నాగభూషణం మనవడు అబిద్ భూషణ్ హీరోలుగా నటించిన సినిమా 'మిస్టీరియస్'. మహి కోమటిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
మహి కోమటిరెడ్డి (Mahi Komatireddy) దర్శకత్వం లో జయ్ వల్లందాస్ నిర్మిస్తున్న సినిమా 'మిస్టీరియస్' (Miss Terious). ఇటీవల ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకుంది. ఈ వివరాలను దర్శకుడు మహి కోమటిరెడ్డి వివరిస్తూ, 'బిగ్ బాస్ ఫేమ్ రోహిత్, మేఘనా రాజపుత్, నాగభూషణం గారి మనవడు అబిద్ భూషణ్, రియా కపూర్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. అలానే కన్నడ నటుడు బాలరాజ్ వాడి, శ్రీనివాస్ భోగిరెడ్డి, ఆకునూరి గౌతమ్, జబర్దస్త్ రాజమౌళి, జబర్దస్త్ నవీన్, లక్కీ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. రొటీన్ కు భిన్నంగా పేరుకు తగ్గట్టుగానే మిస్టీరియస్ స్టోరీతో ఈ మూవీ రూపుదిద్దుకుంది. సెన్సార్ సభ్యులు మా సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు' అని చెప్పారు.
నిర్మాణ పరంగా ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించామని, డిసెంబర్ 12వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా 150 థియేటర్లలో విడుదల చేస్తున్నామని నిర్మాత జయ్ వల్లందాస్ చెప్పారు. టీజర్ అందరికీ నచ్చడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని, సినిమా కూడా అందరూ మెచ్చేలా ఉంటుందని సహ నిర్మాతలు ఉషా, శివానీ అన్నారు. ఈ చిత్రానికి ఎం.ఎల్. రాజా సంగీతం సమకూర్చడంతో పాటు పాటల సాహిత్యమూ అందించారు. సినిమాటోగ్రపీ, ఎడిటింగ్ బాధ్యతలను పరవస్తు దేవేంద్ర సూరి (దేవా) నిర్వర్తించారు.