Photo Talks: యస్వీఆర్ - జమున - ఓ పండంటి కాపురం
ABN , Publish Date - Jul 04 , 2025 | 08:31 PM
మహానటుడు యస్వీ రంగారావు (SVR), మహానటి జమున (Jamuna) అనేక చిత్రాలలో కలసి నటించారు. పలు సినిమాల్లో యస్వీఆర్ కూతురుగా జమున అభినయించి ఆకట్టుకున్నారు.
Photo Talks: మహానటుడు యస్వీ రంగారావు (SVR), మహానటి జమున (Jamuna) అనేక చిత్రాలలో కలసి నటించారు. పలు సినిమాల్లో యస్వీఆర్ కూతురుగా జమున అభినయించి ఆకట్టుకున్నారు. ఇక యస్వీఆర్ కు కోడలుగా, మరదలుగా కూడా జమున నటించిన చిత్రాలు కొన్ని ఉన్నాయి. ఏది ఏమైనా యస్వీఆర్ ను జమున ఓ తండ్రిలాగే భావించేవారు. వారిద్దరూ పోటీపడి నటించిన చిత్రాలు కూడా ఉన్నాయి. అలాంటి సినిమాల్లో జయప్రద పిక్చర్స్ నిర్మించిన 'పండంటి కాపురం' మరపురానిది.
ఇక ఈ చిత్రానికి కథను నటుడు, నిర్మాత డాక్టర్ ప్రభాకర్ రెడ్డి (Prabhakar Reddy) సమకూర్చారు. కృష్ణ (Krishna) సమర్పణలో ఆయన పెద్ద తమ్ముడు జి.హనుమంతరావు (G.Hanumantha Rao) నిర్మాతగా 'పండంటి కాపురం' వెలుగు చూసింది. ఈ చిత్రానికి ప్రభాకర్ రెడ్డి మిత్రుడైన లక్ష్మీదీపక్ (Lakshmi Deepak) దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే యస్వీఆర్ చెంతన జమున ఎంతో చనువుగా కూర్చుని ఉన్న ఫోటో ఇక్కడ దర్శనమిస్తోంది. వారి ఇద్దరి వెనక కనిపిస్తున్నది 'పండంటి కాపురం' చిత్ర దర్శకుడు లక్ష్మీదీపక్.
నలుగురు అన్నదమ్ముల కథతో 'పండంటి కాపురం' తెరకెక్కింది. ఇందులో పెద్దవాడు నారాయణరావు పాత్రను యస్వీఆర్ పోషించగా, రెండోవాడు శ్రీనివాసరావు పాత్రలో గుమ్మడి (Gummadi), మూడోవాడు మధు పాత్రలో ప్రభాకర్ రెడ్డి, చిన్నవాడు రవి పాత్రలో కృష్ణ కనిపించారు. ఈ కథలో కీలకమైన పాత్రలు రెండే - ఒకటి నారాయణరావు పాత్ర, మరోటి కథను అసలైన మలుపు తిప్పే రాణీ మాలినీదేవి రోల్. ఆ పాత్రను తొలుత భానుమతితో పోషింపచేయాలను కున్నారు. అదే సమయంలో భానుమతి సొంత చిత్రం 'అంతా మన మంచికే'లో కృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భానుమతితో రాణీ మాలినీ దేవి పాత్ర ధరింప చేయాలని కృష్ణ సోదరులు ఆశించారు. అయితే భానుమతి పలు కండిషన్స్ పెట్టడం వల్ల జమునను ఆ పాత్రకు ఎంపిక చేసుకున్నారు.
'పండంటి కాపురం' కథలో ఆనందంగా సాగుతున్న నలుగురు అన్నదమ్ముల జీవితాలు రాణీ మాలిణీదేవి రాకతో ఛిన్నాభిన్నమవుతాయి. ఈ నలుగురు అన్నదమ్ములలో రెండవవాడైన శ్రీనివాసరావు తన క్లాస్ మేట్ సవితను ప్రేమించి పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. అయితే ఇంటికి వెళ్ళాక చావుబతుకుల్లో ఉన్న అక్క కోసం ఆమె కూతురును పెళ్ళాడవలసి వస్తుంది. సవిత గర్భవతి, ఓ బిడ్డను కంటుంది. ఆ తరువాత తన బిడ్డ ఏమైందో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ బిడ్డను తీసుకు వచ్చి నారాయణ రావు తన కూతురుగా పెంచుతాడు. ఇదంతా తెలియని సవిత - రాణీ మాలినీ దేవిగా వచ్చి, వారి కుటుంబంలో చిచ్చు పెడుతుంది. తన కక్ష తీర్చుకోవాలని ఆశిస్తుంది. అయితే నారాయణరావు వెళ్ళి ఆమెను కలుసుకున్నాక అసలు విషయాలు తెలిసి పశ్చాత్తాపం చెంది మళ్ళీ అన్నదమ్ములు పండంటి కాపురంతో సాగేలా చేస్తుంది. నారాయణరావు వెళ్ళి రాణీ మాలినీదేవికి గతం తెలిపే సన్నివేశం సినిమాలో అతి కీలకమైనది. ఆ సీన్ చిత్రీకరణ సమయంలోనే రంగారావు, జమున గ్యాప్ లో ఇలా ఒకే చెయిర్ లో కూర్చుని ముచ్చటించుకుంటున్నారు. అన్నట్టు 'పండంటి కాపురం' 1972 జూలై 21న విడుదలై విజయఢంకా మోగించింది. ఆ యేడాది బ్లాక్ బస్టర్ గా నిలచింది.
Sreeleela: కిస్సిక్ ని మించి వయ్యారి భామ.. శ్రీలీల అందాలే హైలైట్