Telugu Film Industry: సీఎం రేవంత్ రెడ్డితో.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ భేటి
ABN, Publish Date - Sep 17 , 2025 | 11:27 PM
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డి తో భేటీ అయ్యారు. సినిమా కార్మికులకు శిక్షణ, హెల్త్ ఇన్సూరెన్స్, చిన్న సినిమాలకు సహాయం, హైదరాబాద్‌ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లే చర్యలపై చర్చించారు.
హైదరాబాద్, జూబ్లీహిల్స్ నివాసం లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు కానుమిల్లి, అలాగే వివిధ సినీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. సినిమా కార్మికులకు అవసరమైన సదుపాయాలు, శిక్షణలపై చర్చించి, ప్రభుత్వ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. చిన్న సినిమా నిర్మాతలకు కూడా ప్రత్యేకంగా సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
సినిమా కార్మికులను విస్మరించవద్దని, వారి నైపుణ్యాలను పెంచేందుకు నిర్మాతలు ముందుకు రావాలని కోరారు. సమ్మెలకు వెళ్లడం వల్ల రెండు వైపులా నష్టమే జరిగే అవకాశం ఉన్నందున, సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకునేలా అందరూ కలిసి పని చేయాలని సూచించారు. “సమస్యను సమస్యగానే చూస్తాను… వ్యక్తిగత పరిచయాలను పక్కన పెట్టి పరిష్కారం దిశగా ముందుకు వెళ్తాం” అని స్పష్టంగా తెలిపారు.
సినిమా కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్ అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సినీ కళాకారులకు గద్దర్ అవార్డులను అందించినట్లు పేర్కొంటూ, గత 10 ఏళ్లలో సినీ కార్మికులతో సమావేశం జరపని ప్రభుత్వాలపై పరోక్షంగా విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూ, అదే సమయంలో కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.
అనంతరం సినీ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. గతంలో ముఖ్యమంత్రులు తమను ఇలా ఎప్పుడు పిలిచి మాట్లాడలేదని పేర్కొన్నారు. ఈ సమావేశం తమకు ఎవతో ఉత్సాహాన్ని కలిగిందని, ప్రభుత్వం తమ సమస్యలను విని స్పందించడం ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు.
ఈ సమావేశం అనంతరం, తెలుగు సినిమా పరిశ్రమలో కార్మికుల నైపుణ్యాభివృద్ధికి, శిక్షణకు, ఆరోగ్య భద్రతకు, ఆర్థిక సహకారానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని సంకేతాలు అందుతున్నాయి. తెలంగాణ సినీ రంగానికి కొత్త ఊపునివ్వడమే కాక, హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి చిత్ర నిర్మాణ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఇది మొదటి అడుగు కానుంది.