MSVPG: చిరు- వెంకీ స్టెప్ వేస్తే .. టాలీవుడ్ అదరడం ఖాయమే
ABN, Publish Date - Dec 02 , 2025 | 04:19 PM
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), విక్టరీ వెంకటేశ్ (Venkatesh) అనేక సార్లు సంక్రాంతి బరిలో బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డారు. ఇద్దరికీ పొంగల్ సీజన్ భలేగా కలసి వచ్చింది.
MSVPG: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), విక్టరీ వెంకటేశ్ (Venkatesh) అనేక సార్లు సంక్రాంతి బరిలో బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డారు. ఇద్దరికీ పొంగల్ సీజన్ భలేగా కలసి వచ్చింది. అలాంటి ఈ ఇద్దరు హీరోలు ఒకే సినిమాలో కలసి నటిస్తే ఎలా ఉంటుంది? ఆ చిత్రం సంక్రాంతికే రానుందంటే ఇక వేరే చెప్పాలా? అభిమానుల ఆనందం అంబరాన్ని అంటుతుంది. సగటు ప్రేక్షకుల సంబరం మరింతగా సాగుతుంది. వెరసి నిర్మాతలకు మెగాస్టార్, విక్టరీ కాంబో లాభాలు సంపాదించి పెడుతుందని సినీజనం అంటున్నారు. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న 'మన శంకరవరప్రసాద్ గారు (Mana Shankara Varaprasad Garu)' సినిమాలో వెంకటేశ్ ఓ కీలక పాత్ర ధరిస్తున్నారు. చిరంజీవి, వెంకటేశ్ పై ఓ స్పెషల్ సాంగ్ సైతం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలోనే 'మెగా-విక్టరీ మాస్ సాంగ్ అంటూ ఓ గ్లింప్స్ ను డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.
చిరంజీవి, వెంకటేశ్ మధ్య మంచి స్నేహబంధం ఉంది. వెంకటేశ్ తండ్రి డి.రామానాయుడు నిర్మించిన 'సంఘర్షణ'లో చిరంజీవి హీరోగా నటించారు. అప్పటి నుంచీ చిరంజీవిని 'రాజా' అంటూ ఆప్యాయంగా పిలిచేవారు రామానాయుడు. తరువాతి రోజుల్లో 'రాజా' టైటిల్ తో రూపొందిన సినిమాలో వెంకటేశ్ హీరోగా నటించి ఓ బిగ్ హిట్ ను పట్టేశారు. అప్పట్లో 'నా టైటిల్ నువ్వు కొట్టేశావ్.' అంటూ చిరంజీవి, వెంకటేశ్ తో సరదాగా అంటూండేవారు. అలాగే వెంకటేశ్ హీరోగా రూపొందిన 'త్రిమూర్తులు' సినిమాలో ఓ పాటలో నాటి టాలీవుడ్ టాప్ స్టార్స్ శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ, నాగార్జున అందరూ ఓ పాటలో కనిపించారు. అదే పాటలో చిరంజీవి సైతం స్పెషల్ గా అలరించడం విశేషం. అప్పట్లో కేవలం ఓ పాటలో మాత్రమే కలసి కనిపించిన చిరంజీవి, వెంకటేశ్ ఇప్పుడు 'మన శంకరవరప్రసాద్ గారు'లో పూర్తి స్థాయిలో నటిస్తూ ఉండడం విశేషం!
ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న చిరంజీవి, వెంకటేశ్ పాట ఎలా ఉంటుందో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఎవరికి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తారు అన్న దానిపైనా చర్చ సాగుతోంది. అయితే గ్లింప్స్ చూశాక, వెంకటేశ్ కు కూడా మంచి ప్రాధాన్యమిచ్చినట్టు తెలుస్తోంది. ఈ గ్లింప్స్ లో ముందుగా కుడివైపు నుండి వెంకటేశ్ కనిపిస్తారు - వెంటనే ఎడమవైపు నుండి చిరంజీవి వస్తారు. ఇద్దరూ ఒకరిభుజంపై ఒకరు చేయివేసుకొని వెళ్తూ 'థమ్సప్' అంటూ విక్టరీ సింబల్ చూపించడం గ్లింప్స్ లోని ప్రత్యేకత.. సంక్రాంతి కానుకగా రానున్న 'మన శంకరవరప్రసాద్ గారు'లో నయనతార నాయికగా నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో స్వరకల్పనలో ఇప్పటికే 'మీసాల పిల్లా...' అంటూ సాగే సాంగ్ విశేషంగా ఆకట్టుకుంటోంది. మరి చిరంజీవి- వెంకటేశ్ కాంబోలో తెరకెక్కే సాంగ్ ఏ తీరున తెరకెక్కుతోందో? ఆ పాట వచ్చాక ఏ రీతిన ఆకట్టుకుంటుందో చూడాలి..