Nivin Pauly - Abrid Shine: నమ్మకద్రోహం చేశారంటూ నివిన్, అబ్రిడ్ షైన్‌పై కేసు
ABN , Publish Date - Jul 19 , 2025 | 01:17 PM
దర్శకుడు అబ్రిడ్ షైన్‌తో కలిసి మోసం, నమ్మకద్రోహం చేశాడంటూ నిర్మాత పి.ఎస్. షమ్నాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
‘ప్రేమమ్’, ‘యాక్షన్ హీరో బిజు’ (Action Hero biju 2) వంటి హిట్ చిత్రాలతో ప్రేక్షకాదరణ పొందారు మలయాళ నటుడు నివిన్ పౌలీ(Nivin Pauly). ప్రస్తుతం ఆయనపై కేరళలోని తలయోలపరంబు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్శకుడు అబ్రిడ్ షైన్‌తో (Abrid Shine) కలిసి ఆయన మోసం, నమ్మక ద్రోహం చేశాడంటూ నిర్మాత పి.ఎస్. షమ్నాస్ (పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెక్షన్ 406 (నమ్మక ద్రోహం), 420 (మోసం) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నిర్మాత షమ్నాస్ (P S Shamnas) తెలిపిన ప్రకారం, 2022లో విడుదలైన ‘మహావీర్యర్’ చిత్రం నష్టాలు చవిచూడడంతో హీరో నివిన్ రూ. 95 లక్షలు వెనక్కి తిరిగిస్తామని హామీ ఇచ్చాడని, ఇప్పుడు ఆ మాటే లేదని నిర్మాత పేర్కొన్నారు. అంతేకాకుండా తన తదుపరి చిత్రం ‘యాక్షన్ హీరో బిజు 2’లో నిర్మాతగా భాగస్వామ్యం ఇస్తానని మాటిచ్చి తప్పాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అతనిచ్చిన హామీను నమ్మి అక్షరాలా రూ. 1.90 కోట్లు 'యాక్షన్ హీరో బిజు 2'లో పెట్టుబడి పెట్టినట్టు షమ్నాస్ తెలిపారు.
అయితే, నివిన్, దర్శకుడు అబ్రిడ్ షైన్ కలిసి రూ. 5 కోట్లకు దుబాయ్‌కు చెందిన డిస్ట్రిబ్యూషన్ కంపెనీతో రహస్యంగా డీల్ చేసుకున్నారని పేర్కొన్నారు. అయితే ఈ సినిమా నా కంపెనీ ఇండియన్ మూవీ మేకర్స్ పేరుతో తెరకెక్కుతుందనే విషయాన్ని బయటకు రానివ్వకుండా, నివిన్ తన సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్నట్లు చూపించి మరోసారి తనను మోసం చేశాడని షమ్నాస్ ఎప్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. దీనిపై హీరో నివిన్ స్పందించారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో పరిష్కార దశలో ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన వివరాలు ఏమీ బయటకు చెప్పలేము. నిర్మాత చేసిన ఆరోపణలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నివిన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం నివిన్ ఐదు చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘సర్వం మాయ’, డాల్బీ దినేషన్, డియర్ స్టూడెంట్, బేబీ గర్ల్, బెంజ్ చిత్రాల్లో నటిస్తున్నారు.