NTR: ప్రశ్నల సుడిగుండంలో ఎన్టీఆర్..
ABN , Publish Date - Aug 23 , 2025 | 07:59 PM
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) ప్రస్తుతం ప్రశ్నల సుడిగుండంలో చిక్కుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు చాలా రూమర్స్ ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతున్నాయి.
NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) ప్రస్తుతం ప్రశ్నల సుడిగుండంలో చిక్కుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు చాలా రూమర్స్ ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పటివరకు ఎన్టీఆర్ వాటిపై స్పందించింది లేదు. ట్రోల్స్ ను కంట్రోల్ చేసింది లేదు. అసలు ఇప్పటివరకు ఎన్టీఆర్ బయట కనిపించింది కూడా లేదు. ఎన్టీఆర్ విషయంలో అసలేం జరుగుతుంది. ఈ ప్రశ్నలన్నింటికీ ఎన్టీఆర్ ఇచ్చే సమాధానం ఏంటి.. ? దీని గురించే సోషల్ మీడియా అభిమానులు చర్చించుకుంటున్నారు. అసలు ఆ ప్రశ్నలు ఏంటి..? ఎన్టీఆర్ సమాధానం ఏంటి.. ? తెలుసుకుందాం.
గత కొన్నిరోజులుగా ఎన్టీఆర్ కు లక్ కలిసిరావడం లేదు అంటే నిజమే అనిపిస్తుందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. దేవర సినిమాతో రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేసి ఇండస్ట్రీని షేక్ చేసిన ఎన్టీఆర్ వార్ 2 తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టి ఘోర పరాజయాన్ని అందుకున్నాడు. కాలర్ ఎగరేసి మరీ అభిమానులకు హామీ ఇచ్చిన ఎన్టీఆర్.. ప్రేక్షకులను కాలర్ ఎత్తనివ్వకుండా చేశాడు. ఇలా చేయడం ఎన్టీఆర్ కు ఇదేమి మొదటిసారి కాదు. అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఎన్టీఆర్ కాలర్ ఎత్తి మరీ తన అభిమానులను తల దించుకోనివ్వను అని చెప్పాడు. కానీ అక్కడ కూడా మాటను నిలబెట్టుకోలేకపోయాడు.
ఎన్టీఆర్ ఇలా మాట నిలబెట్టుకోకపోవడంతో.. అతని సినిమాలపై అభిమానులు నమ్మకాన్ని కోల్పోతున్నారు. ప్రస్తుతం అందరి చూపు డ్రాగన్ మీదనే ఉంది. ఆ సినిమాకు కూడా ఎన్టీఆర్ ఈ రేంజ్ గా చెప్తే.. ప్రేక్షకులు నమ్ముతారా అనే అనుమానం కూడా లేకపోలేదు. ఇక దీన్ని పక్కన పెడితే.. ఈ మధ్య జరిగిన టీడీపీ ఎమ్మెల్యే వివాదం ఎంత సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెల్సిందే. తనను అంత పెద్ద మాట అన్నా కూడా ఎన్టీఆర్ నోరు మెదపలేదు. కనీసం నందమూరి కుటుంబం నుంచి ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వలేదు. ఇక ఎన్టీఆర్ ఇప్పుడప్పుడే రాజకీయాల్లోకి రావాలనుకోవడం లేదు కాబట్టి ఇలాంటి విషయాలపై స్పందిస్తే అది ఇంకా పెద్ద వివాదంగా మారొచ్చు అనే ఆలోచనతో ఎన్టీఆర్ స్పందించకపోవచ్చు. కానీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊరుకోలేదు. ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టి కడిగిపడేశారు. ఆ ప్రెస్ మీట్ అయినా ఎందుకు పెట్టారు అని అడిగాడట కానీ,సపోర్ట్ చేయలేదని టాక్. ఎందుకు ఎన్టీఆర్ ఇలా చేస్తున్నాడు అనేది ప్రస్తుతం ఫ్యాన్స్ లో ఉన్న పెద్ద ప్రశ్న.
ఇక వీటితో పాటు అభిమానులను కలవరపెడుతున్న ప్రశ్న.. ఎన్టీఆర్ ఆరోగ్యానికి ఏమైంది..? మునుపెన్నడూ లేనివిధంగా ఎన్టీఆర్ బరువు తగ్గి కనిపించాడు. క్యారెక్టర్ కోసం బరువు తగ్గినా ముఖంలో ఎప్పుడు ఆ కళ పోలేదు. కానీ, ఈసారి మాత్రం ముఖం పీక్కుపోయింది. అసలు తారకేనా అనే అనుమానం వచ్చింది అంటే అతిశయోక్తి కాదు. సడెన్ గా చూసి పేషేంట్ అనుకున్నారు. డ్రాగన్ కోసం తగ్గుతున్నాడు అనుకున్నా.. ముఖం మొత్తం లోతుగా పోయి కనిపిస్తుంటే అది క్యారెక్టర్ కోసం అని ఎలా అనుకుంటామని ఫ్యాన్స్ భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తారక్ ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడా.. ? అని అనుమానిస్తున్నారు.
ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎన్టీఆర్ బాలీవుడ్ కెరీర్. వార్ 2 రిజల్ట్ చూసాక.. తారక్ ఆలోచనలు మారిపోయినట్లు తెలుస్తోంది. వార్ 2 ముందు వరకు YRF లో సోలో హీరోగా ఒక సినిమా చేయడానికి బాగా ఉత్సాహం చూపినట్లు బాలీవుడ్ మీడియా కోడై కూసింది. వార్ 2 తరువాత వెంటనే ఈ సినిమాను మొదలు పెట్టాలని అనుకున్నారు. కానీ, సినిమా రిజల్ట్ చూసాక.. ఎన్టీఆర్.. YRF ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టాడని అంటున్నారు. అలా ఒక్క సినిమాతోనే ఎన్టీఆర్ బాలీవుడ్ కెరీర్ ప్రశ్నార్ధకంగా మారింది.
ఎన్టీఆర్ చుట్టూ ఇన్ని ప్రశ్నలు ఉన్నా.. ప్రస్తుతం ఆయన నుంచి వచ్చే సమాధానం కేవలం మౌనం మాత్రమే. కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుంది అన్న చందానా ఎన్టీఆర్ వీటి గురించి ఆలోచించకుండా అయితే షూటింగ్.. లేకపోతే ఫ్యామిలీతో వెకేషన్స్ తిరుగుతూ లైఫ్ ను హ్యాపీగా గడుపుతున్నాడు. ఈ ప్రశ్నలు అన్నింటికి ఎన్టీఆర్ మౌనమే సమాధానం. నిజం చెప్పాలంటే అదే బెస్ట్ డెసిషన్ అని కూడా చెప్పొచ్చు. లేనిపోని వివాదాలు తలకు రుద్దుకొని ట్రోల్ అవ్వడం కన్నా సైలెంట్ గా పక్కకు తప్పుకుంటే.. కాలమే వాటిని ఆపేస్తుంది. ఈ విషయంలో మాత్రం ఎన్టీఆర్ మంచి నిర్ణయమే తీసుకున్నాడు అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఈ ప్రశ్నలకు సమాధానంగా ఎన్టీఆర్ డ్రాగన్ తో సక్సెస్ అందుకొని అప్పుడు నోరు విప్పుతాడేమో చూడాలి.
Arjun Das: అర్జున్ దాస్ ప్రేమలో ఐశ్వర్య లక్ష్మి
Mayasabha - Ormax: ఓర్మాక్స్ లో రికార్డు సృష్టించిన తొలి తెలుగు సిరీస్‌గా..