Manchu Vishnu vs Manchu Manoj: అన్న అలా.. తమ్ముడిలా! సినిమా వేదికల పైకి.. మంచు వార్
ABN, Publish Date - May 19 , 2025 | 02:55 PM
మంచు ఫ్యామిలీలో గత సంవత్సర కాలంగా ఘర్షణలు, వివాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే.
మంచు ఫ్యామిలీలో గత సంవత్సర కాలంగా ఘర్షణలు, వివాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. తర్వాత కోర్టు , పోలీసుల జోక్యంతో ఆ వ్యవహారం కాస్త వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. అయినప్పటికీ నివురుగప్పిన నిప్పులా, ఆరని రావణ కాష్టంలా లోలోన ఈ వ్యవహారం కొనసాగుతూ వస్తూ ఇప్పుడు ఇంటి గొడవ కాస్త సినిమా వేదికలపైకి వచ్చి చేరింది. మనోజ్ (Manchu Manoj) ప్రధాన పాత్రలో నటించిన భైరవం (Bhairavam) మే30న, మంచు విష్ణు (Manchu Vishnu) నటించిన కన్నప్ప (Kannappa) జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ క్రమంలో వారి సినిమాల విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్దీ మంచు సోదరులు ఇద్దరు విష్ణు, మనోజ్‌లు తమ సినిమా ప్రమోషన్స్ లో ఒకరికిపై మరొకరు పంచ్‌లు వేసుకుంటూ, విమర్శలు చేసుకుంటూ మీడియాకు సరిపోను సరుకు ఇస్తూనే ఉన్నారు. దీంతో విష్ణు, మనోజ్‌ల మాటలు విన్న నెటిజన్లు వీరి ఫ్యామిలీ సమస్యలు ఇంకా ఎన్నాళ్లు సీరియల్‌గా సాగుతాయో.. వీటికి ఎప్పుడు తెర పడుతుందో అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇటీవల కన్నప్ప సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ఓ ఇంటర్యూలో విష్ణు, మనోజ్‌ను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటర్యూలో హీరో ప్రభాస్ గురించి మాట్లాడిన విష్ణు.. తాను ప్రభాస్ ఎప్పటికీ సోదరులమని, రక్తం పంచుకుని పుట్టినవాళ్లే ఈ రోజు నా పతనాన్ని కోరేటప్పుడు.. ప్రభాస్ నేను రక్తం పంచుకుని పుట్టలేదు కానీ నా మంచి కోరి, నా సక్సెస్ కోరుతున్నాడు. ఎన్ని జన్మలకైనా నేను అతడికి రుణపడి ఉంటానని విష్ణు చెప్పుకొచ్చాడు. అదేవిధంగా మోహన్ బాబు గురించి విష్ణు మాట్లాడుతూ. మా నాన్న ఆనందమే నాకు ముఖ్యం. దాని కోసం ఏదైనా చేస్తాను. ఆయన సంతోషంగా లేకపోతే నాకు ఏది అక్కర్లేదు. ఆయనకు చెడ్డ పేరు తీసుకొచ్చినరోజు నేను బతికున్నా చచ్చినట్లే. ఆ రోజు ఎప్పటికీ తీసుకురాను. ఆయన పేరు నిలబెట్టడానికే ప్రయత్నిస్తాను. కానీ చెడగొట్టేలా ఎప్పుడు చేయనంటూ విష్ణు తన కుటుంబ సమస్యలపై పరోక్షంగా ప్రస్తావించాడు.
తాజాగా భైరవం చిత్ర ట్రైలర్ లాంఛ్ వేడుకలో మంచు మనోజ్ సైతం ఎమోషనల్ అయ్యాడు. శివుడిని శివయ్యా అని పిలిస్తే రాడు.. ఆయన్ని మనసారా తలచుకుంటే మీ అందరి రూపంలో వస్తాడంటూ విష్ణు పై పంచ్ వేశాడు కుటుంబ గొడవలపై మనోజ్ మాట్లాడుతూ..ఈ మధ్య కాలంలో ఎన్నో జరిగాయి. ఎన్నో చూశాను. కట్టుబట్టలతో రోడ్డు మీదకు తెచ్చారు. నేను ఊరు వెళ్లొచ్చేసరికి నా పిల్లల వస్తువులతో సహా అన్నీ రోడ్డు మీద పెట్టారు. బయటకు వెళ్లడానికి కార్లు లేకుండా తీసుకెళ్లిపోయారు. కానీ నాకు ఆ శివుడు ఫ్యాన్స్ రూపంలో వచ్చాడు. వాళ్లు ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. నాకు ఎవరి మీద కోపం రావడం లేదు. అది నా బలహీనతో.. వారి బలమో అర్థం కావట్లేదని, నా కట్టె కాలేవరకూ నేను మోహన్ బాబు కుమారుడినేనన్నారు. చిన్నప్పటి నుంచి నీతి, న్యాయం వైపు నిలబడేలా పెంచారు. ఇప్పుడు తాను అదే పని చేస్తుంటే తప్పు అంటున్నారంటూ మనోజ్ ఎమోషనల్ అయ్యాడు.