Manchu Manoj: ‘మోహన రాగ మ్యూజిక్’ పేరుతో సంగీత రంగంలోకి..
ABN, Publish Date - Nov 22 , 2025 | 01:53 PM
'కొత్త ప్రయాణం ఆరంభం’ అంటూ తాజాగా మంచు మనోజ్ పెట్టిన పోస్ట్ అందరినీ ఆకర్షించింది. కొత్త సినిమానా, బిజినెస్ ప్లానా? ఏం చేయబోతున్నారనే చర్చ మొదలైంది.
'కొత్త ప్రయాణం ఆరంభం’ అంటూ తాజాగా మంచు మనోజ్ (Manchu Manoj) పెట్టిన పోస్ట్ అందరినీ ఆకర్షించింది. కొత్త సినిమానా, బిజినెస్ ప్లానా? ఏం చేయబోతున్నారనే చర్చ మొదలైంది. ఇలాంటి ప్రశ్నలకు సమాధానమిచ్చారు మనోజ్. ఆయన కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. ఆ వివరాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘మోహన రాగ మ్యూజిక్’ (Mohana Raga music) పేరుతో సంగీత సంస్థను ప్రారంభించినట్లు ప్రకటించారు. ‘లోకల్ హార్ట్స్, గ్లోబల్ బీట్స్’ అనే క్యాప్షన్‌తో ఈ విషయాన్ని తెలిపారు. సంగీతం అంటే ఎంతో ఇష్టమని ఆయన తెలిపారు.
‘మోహన రాగ మ్యూజిక్’ అనేది కొత్త ఆలోచనలు, భావోద్వేగాలను కలిపే వేదిక. ఈ కంపెనీతో మంచు మనోజ్ ఒక కొత్త సృజనాత్మక అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటం, ప్రయోగాత్మక సంగీతాన్ని ప్రోత్సహించటం..భారతీయ, అంతర్జాతీయ ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా సరికొత్త సంగీతాన్ని రూపొందించటమే దీని ప్రధాన లక్ష్యం. ఈ పేరుకీ ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. తండ్రీ కొడుకులిద్దరికీ అత్యంత ఇష్టమైన రాగం - మోహన రాగం. ఒరిజినల్ సింగిల్స్, కొలాబ్రేషన్స్, కొత్తరకమైన మ్యూజిక్ ప్రాజెక్ట్స్ ఈ లేబల్ నుంచి రాబోతున్నాయి. మోహన రాగ మ్యూజిక్ కంపెనీతో జరగబోయే అతి పెద్ద ఇంటర్నేషనల్ కొలాబ్రేషన్ గురించి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
కెరీర్ ప్రారంభం నుంచి మనోజ్ జీవితంలో సంగీతం అనేది ఓ అంతర్భాగంగా ఉంటోంది. ‘పోటుగాడు’ సినిమాలో ‘ప్యార్ మే పడిపోయానే..’ పాటను పాడి ప్రేక్షకులను మెప్పించారు. కోవిడ్ సమయంలో అందరినీ ఉత్తేజరపరిచేలా ‘అంతా బాగుంటాంరా’ పాటను విడుదల చేశారు. ‘మిస్టర్ నూకయ్య’ చిత్రంలో ‘పిస్తా పిస్తా.. ’ పాటతో పాటు ‘నేను మీకు తెలుసా’ సినిమాలో ‘ఎన్నో ఎన్నో., ‘మిస్టర్ నూకయ్య’ సినిమాలో ‘ప్రాణం పోయే బాధ..’ పాటలకు సాహిత్యాన్ని అందించారు. హృదయానికి హత్తుకునేలా, భావోద్వేగంతో కూడుకున్న, విలక్షణమైన గాత్రం ఆయనలోని సహజమైన సంగీత ప్రతిభను తెలియజేస్తోంది. తెరపై పాటలు పాడటం, రాయటం వంటి సంగీత సంబంధమైన విషయాలే కాదు.. తెర వెనుక ఎన్నో విశేషమైన సేవలను అందించారు. మనోజ్ తన సినీ ప్రయాణంలో తండ్రి డా.మంచు మోహన్ బాబు, అన్నయ్య మంచు విష్ణు, సోదరి లక్ష్మి మంచు చిత్రాలకు సంగీత విభాగంలో వర్క్ చేయటంతో పాటు వారి చిత్రాలకు యాక్షన్ సన్నివేశాలను డైరెక్ట్ కూడా చేశారు. తన కుటుంబ సభ్యులు నటించిన ఎన్నో చిత్రాలకు ఆయన పాటలను పాడారు. అంతర్జాతీయ స్థాయిలో తన గుర్తింపును పెంచుకుంటూ మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు రాజమణితో కలిసి హాలీవుడ్ సినిమా ‘బాస్మతి బ్లూస్’కు సంగీతాన్ని అందించారు. ఈ మూవీలో కెప్టెన్ మార్వెల్ పాత్ర పోషించిన బ్రీ లార్సన్ ఇందులో ప్రధాన పాత్రలో నటించారు.
మంచు మనోజ్ కొంత విరామం తర్వాత వినూత్న కథలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. ఇటీవల భైరవం’, ‘మిరాయ్’ చిత్రాలతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ‘వాట్ ది ఫిష్’ సినిమా చేస్తున్నారు. వరుణ్ కోరుకొండ దర్శకత్వం వహిస్తున్నారు.