సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Happy Birthday: అంతర్జాతీయంగా అలరిస్తోన్న రాజమౌళి

ABN, Publish Date - Oct 10 , 2025 | 01:07 PM

దర్శక ధీరుడు రాజమౌళి పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా సినిమా రంగానికి చెందిన వారంతా రాజమౌళికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. మహేశ్ బాబు సైతం వన్ అండ్ ఓన్లీ రాజమౌళి అంటూ ఆయన్ని అభినందించాడు.

Rajamouli - Mahesh Babu

తెలుగునాటనే కాదు యావద్భారతంలోనూ తన కంటూ ఓ స్పెషల్ క్రేజ్ సంపాదించారు దర్శకధీర రాజమౌళి (Rajamouli). ఇంటర్నేషనల్ ఎరీనాలోనూ రాజమౌళి తన ముద్ర వేసుకున్నారు. అంతటి క్రేజ్ ఉన్న రాజమౌళి నేడు (అక్టోబర్ 10న) బర్త్ డే చేసుకున్నారు. దాంతో ఆయన సహచర దర్శకులు, నిర్మాతలు ముఖ్యంగా నటీనటులు, సాంకేతిక నిపుణులు రాజమౌళికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజమౌళి తెరకెక్కించిన 'ట్రిపుల్ ఆర్' మూవీ హీరోలు జూనియర్ ఎన్టీఆర్ (Jr Ntr), రామ్ చరణ్ (Ramcharan) తో పాటు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్న మహేశ్ బాబు సైతం రాజమౌళికి తనదైన రీతిలో బర్త్ డే విషెస్ తెలిపాడు.

ప్రస్తుతం ఎక్కడ చూసినా భారతీయ సినిమా అభిమానుల నోట రాజమౌళి మాటే వినిపిస్తోంది. ఒక సినిమానే ఏళ్ళ తరబడి తీసినా, సంవత్సరాల పొడుగునా తన చిత్రాల గురించే మాట్లాడుకొనేలా చేస్తున్నారు రాజమౌళి. ప్రస్తుతం ఎక్కడ చూసినా మహేశ్ బాబుతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న సినిమా గురించిన చర్చే సాగుతోంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రాజమౌళి చేస్తోన్న మ్యాజిక్ హాలీవుడ్ వారిని సైతం ఆకర్షించింది. ఈ నేపథ్యంలోనే తన 'బాహుబలి సిరీస్, ట్రిపుల్ ఆర్'తో అంతర్జాతీయంగా అలరించారు రాజమౌళి. అంతే కాదు అందని ద్రాక్షపండులా ఉన్న ఆస్కార్ ను సైతం ఓ తెలుగు సినిమాతో సాధించిన ఘనత కూడా రాజమౌళి సొంతమని చెప్పక తప్పదు. 'ట్రిపుల్ ఆర్'లో కీరవాణి బాణీలకు, చంద్రబోస్ రాసిన 'నాటు నాటు' సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అందుకున్న సంగతి తెలిసిందే. రాజమౌళి చూపిన బాటలో పయనించాలని పలువురు భారతదేశ దిగ్దర్శకులు సైతం ప్రయత్నిస్తూ ఉండడం విశేషంగా మారింది.


ఇప్పటి దాకా రాజమౌళి సరిగా డజన్ సినిమాలు తెరకెక్కించారు. తొలి సినిమా 'స్టూడెంట్ నంబర్ వన్'తో మంచి మార్కులు సంపాదించిన రాజమౌళి రెండో చిత్రం 'సింహాద్రి'తో బ్లాక్ బస్టర్ హిట్ పట్టేశారు. మూడో మూవీ 'సై'తో మునుపటిలా మురిపించలేకపోయారు. అయితే ఆ తరువాత 'ఛత్రపతి'తో ప్రభాస్ కు, 'విక్రమార్కుడు'తో రవితేజకు, 'మగధీర'తో రామ్ చరణ్ కు మరపురాని విజయాలను అందించారు రాజమౌళి. ఇక తన తొలి సినిమా హీరో యన్టీఆర్ తో 'యమదొంగ' తీసి హ్యాట్రిక్ పట్టేశారు. ఈ సినిమా నుంచే రాజమౌళి టెక్నాలజీతో ట్రావెల్ చేయడం మొదలెట్టారు. 'ఈగ'లో యానిమేటెడ్ కేరెక్టర్ తోనే బంపర్ హిట్ కొట్టేయడం ఈ నాటికీ విశేషమే. 'బాహుబలి' సిరీస్ తో రాజమౌళి చేసిన రచ్చ గురించి చెప్పక్కర్లేదు. 'బాహుబలి-1'తో తెలుగువారికి తొలి జాతీయ ఉత్తమ చిత్రం అవార్డును అందించారు. ఆ పై 'బాహుబలి-2'తో వెయ్యి కోట్ల క్లబ్ కు శ్రీకారం చుట్టిన ఘనతనూ సొంతం చేసుకున్నారు రాజమౌళి. ఎటు చూసినా రాజమౌళి సక్సెస్ రేటుతో సరితూగే డైరెక్టర్ మరొకరు కానరావడం లేదు.


ఎంతో ఘనమైన చరిత్ర గల రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించడం మరింత విశేషంగా మారింది. ఈ సినిమా మరో రెండేళ్ళకు వెలుగు చూస్తుందని ఫ్యాన్స్ ఫిక్సయ్యారు. అయినా ఈ చిత్రానికి సంబంధించిన ఏ అంశాన్నైనా జనం ఆసక్తిగా వింటూ ఉండడం విశేషం. ఈ చిత్రం టైటిల్ పై ఇప్పటికే పలు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. 'వారణాసి, జెన్ 63, మహరాజ్, గ్లోబ్ ట్రాటర్' అన్న టైటిల్స్ విశేషంగా వినిపిస్తున్నాయి. అయితే నవంబర్ 16వ తేదీన అత్యంత భారీగా జరిగే ఓ వేడుకలో మహేశ్ తో రాజమౌళి తీస్తోన్న సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ చేయనున్నారట. అందుకోసం నిర్మాత డాక్టర్ కె.యల్. నారాయణ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ప్రియాంక చోప్రా నాయికగా నటిస్తోన్న ఈ సినిమాను 120కి పైగా దేశాల్లో రిలీజ్ చేస్తారనీ విశేషంగా వినిపిస్తోంది. ఆ సినిమా వచ్చే లోపు అభిమానులను అలరించేందుకు 'బాహుబలి- ది ఎపిక్' ను అక్టోబర్ 31న రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీతో రాజమౌళి మళ్ళీ ఏ మ్యాజిక్ చేస్తారో అని ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. చూద్దాం ఏమవుతుందో.

Updated Date - Oct 10 , 2025 | 01:07 PM