Globe Trotter: జక్కన్న ప్లానింగా... మజాకా...
ABN , Publish Date - Nov 13 , 2025 | 05:19 PM
మహేశ్ బాబు - రాజమౌళి చిత్రానికి తొలి భారీ ఈవెంట్ నవంబర్ 14న రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగబోతోంది. ఈ కార్యక్రమం ద్వారా కూడా మేకర్స్ కు కోట్ల రూపాయల లాభం రాబోతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
సినిమా విడుదలకు ముందు ఎవరైనా భారీ ఖర్చుతో పబ్లిసిటీని చేసి... తద్వారా మూవీ మార్కెట్ ను పెంచుకుంటారు. సో... మూవీ బిజినెస్ కు హైప్ రావడానికి పబ్లిసిటీ కోసం కొంత మొత్తం కేటాయించి ఖర్చు చేస్తారు. చిత్రం ఏమంటే... దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) దానికి పూర్తి భిన్నం. ఆయన సినిమాకు చేసే పబ్లిసిటీని కూడా క్యాష్ చేసుకునే మనిషి. మెగ్నమ్ ఓపస్ మూవీ 'బాహుబలి' (Baahubali) ని నిర్మించినప్పుడు ఆయన పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టిందే లేదు. ఆ సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా వందల కోట్ల రూపాయల విలువ చేసే ఫ్రీ పబ్లిసిటీ లభించింది. అప్పుడు పబ్లిసిటీ కోసం పైసా ఖర్చు పెట్టని రాజమౌళి... ఇప్పుడు మహేశ్ బాబు (Maheshbabu) తో చేస్తున్న సినిమా కోసం ఎదురు వసూలు మొదలు పెట్టారు. మహేశ్ బాబు మూవీకి సంబంధించిన గ్రాండ్ ఈవెంట్ 'గ్లోబ్ ట్రాటర్' (Globe Trotter) ను నవంబర్ 14న రామోజీ ఫిల్మ్ సిటీలో జరుపుబోతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచానికి రాజమౌళి ఏం సినిమా చేయబోతున్నారు? ఎలాంటి సినిమా చేయబోతున్నారు? ఇందులోని ప్రధాన తారాగణం, సాంకేతిక నిపుణులు ఎవరెవరూ అనేది తెలియబోతోంది. అయితే ఏ నిర్మాత అయినా ఇలాంటి ఈ ఈవెంట్ ను భారీగా ఖర్చు పెట్టి చేస్తారు. రాజమౌళి అండ్ టీమ్ కూడా అదే పనిచేస్తోంది. ఓ మీడియం మూవీకి అయ్యేంతగా దాదాపు 30 కోట్ల రూపాయలను ఈ ఈవెంట్ కు ఖర్చు చేస్తోంది. అయితే... ఈ ఈవెంట్ ద్వారా మూవీ మేకర్స్ రెట్టింపు లాభం రాబోతోంది. ఈ ఈవెంట్ ను జియో హాట్ స్టార్ లో లైవ్ ఇవ్వబోతున్నారు. ఈ హక్కుల కోసం జియో హాట్ స్టార్ రూ. 50 కోట్లకు పైగా మొత్తాన్ని చెల్లిస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వరల్డ్ వైడ్ తన సినిమాకు సంబంధించిన ప్రచారం జరగడంతోపాటు దాని ద్వారా కూడా రాజమౌళి బృందం కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందుతోందన్న మాట.
రాజమౌళి మాస్టర్ మైండ్ గురించి అవగాహన ఉంది కాబట్టే ప్రముఖ నిర్మాత కె.ఎల్. నారాయణ ఇంతకాలం ఈ క్రేజీ కాంబినేషన్ కోసం వేచి ఉన్నారు. ఆయన నిరీక్షణకు తగ్గట్టుగానే భారీ ప్రతిఫలం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో కాకుండా పాన్ వరల్డ్ స్థాయిలో దీనిని రిలీజ్ చేయబోతున్నారు. దాదాపు వంద దేశాల్లో ఒకేసారి ఈ మూవీ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. సహజంగా తన సినిమా పూర్తి అయిన తర్వాత కానీ ప్రచారం ప్రారంభించని రాజమౌళి... ఈసారి తన పథక రచనను మార్చాడు. మూవీ రెండు, మూడు షెడ్యూల్స్ పూర్తి కాగానే ఓ పెద్ద బ్యాంగ్ తో దీని ప్రచారానికి శ్రీకారం చుడుతున్నాడు. రెండు భాగాలుగా తెరకెక్కబోతున్న ఈ సినిమాను రాజమౌళి గత చిత్రాల మాదిరిగా కాకుండా కాస్తంత వేగంగానే పూర్తి చేసేట్టు కనిపిస్తున్నాడు.

విశేషం ఏమంటే... ఈ సినిమా ఈవెంట్ కు పాపులర్ యాంకర్ సుమ (Suma) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. దీనికి సంబంధించిన ప్రిపరేషన్స్ గట్టిగా జరుగుతున్నాయి. ఎం.ఎం. కీరవాణి, రాజమౌళి అండ్ టీమ్ తో చర్చలు జరుపుతున్న ఫోటోను సోషల్ మీడియాలో సుమ పోస్ట్ చేసింది. అలానే ఈ ఈవెంట్ కు వచ్చేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియచేస్తూ రాజమౌళి గురువారం ఉదయం ఓ వీడియోను విడుదల చేశాడు.
Also Read: Bollywood: కాజోల్ అంత మాట అనేసిందేమిటీ...
Also Read: OTT Hits: ఆర్మాక్స్ మీడియా జాబితాలో ఆ రెండు సినిమాలు..