Sumanth Movie: ఇటు స్ట్రీమింగ్... అటు డబ్బింగ్...
ABN , Publish Date - May 16 , 2025 | 06:22 PM
సుమంత్ హీరోగా నటించిన 'అనగనగా...' చిత్రం ప్రస్తుతం ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆయన నటించిన మరో చిత్రం 'మహేంద్ర గిరి వారాహి' డబ్బింగ్ మొదలైంది.
హీరో సుమంత్ (Sumanth) నటించిన'అనగనగా' (Anaganaga) సినిమా మే 15వ తేదీ నుండి ఈటీవీ విన్ (ETv Win) లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సుమంత్ ను విశేషంగా అభినందిస్తున్నారు. యువ కథానాయకుడు సాయి దుర్గ తేజ్ ఎక్స్ వేదికగా సుమంత్ ను పొగడ్తలతో ముంచెత్తాడు. సుమంత్ నటించిన 'మళ్లీ రావా' (Malli Raava) అంటే తనకెంతో ఇష్టమని, ఇప్పుడు 'అనగనగా' చూసిన తర్వాత సుమంత్ పట్ల మరింత అభిమానం పెరిగిందని తెలిపాడు. సుమంత్ కూడా సాయిదుర్గా తేజ్ కు ధ్యాంక్స్ చెప్పాడు. ప్రస్తుతం మన విద్యావ్యవస్థ తీరు తెన్నుల గురించి చూపిస్తూనే... అందులో రావాల్సిన మార్పులను సైతం దర్శకుడు సన్నీకుమార్ 'అనగనగా'లో చక్కగా చూపించాడు. అలానే ద్వితీయార్థంలో ఫాదర్, సన్ సెంటిమెంట్ సీన్స్ సైతం వీక్షకులను కట్టిపడేస్తున్నాయని అంటున్నారు.
ఈ సినిమాకు వస్తున్న ప్రశంసల జల్లులో తడిసి ముద్దవుతూనే సుమంత్ తన మరో సినిమా 'మహేంద్రగిరి వారాహి' (Mahendragiri Varahi) డబ్బింగ్ పనులను ప్రారంభించాడు. ఈ సినిమాను సంతోష్ జాగర్లపూడి (Santhosh Jagarlapudi) దర్శకత్వంలో మధు కాలిపు నిర్మిస్తున్నారు. ఆయన ఆ మధ్య వచ్చిన 'రంగమార్తాండ' సినిమా నిర్మాత! 'మహేంద్ర గిరి వారాహి' చిత్రంలో సుమంత్ సరసన మీనాక్షి గోస్వామి (Minakshi Goswami) హీరోయిన్ గా నటించగా, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, రాజీవ్ కనకాల, కమల్ కామరాజు, వంశీ చాగంటి, మంజు భార్గవి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. సుమంత్ పాత్ర అన్ని వర్గాలను ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, సోషియో ఫాంటసీ నేపథ్యంలో సూపర్ న్యాచురల్ కథతో ఈ సినిమాను రూపొందించామని దర్శకుడు సంతోష్ జాగర్లపూడి చెప్పారు. మురళీ కథను అందించిన ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారని, మహేంద్రగిరిలో కొలువు దీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని నిర్మాత మధు కాలిపు చెప్పారు. నిజానికి సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన ఈ సినిమా కాస్తంత ఆలస్యం త్వరలో జనం ముందుకు రానుంది.