Krishnam Raju: రెబల్ స్టార్.. కృష్ణంరాజు అసలు పేరు తెలుసా!

ABN , Publish Date - Sep 16 , 2025 | 08:57 PM

అసలు పేరు కన్నా కొసరు పేరు మిన్న అన్నట్టుగా ఉంటాయి కొందరు సినిమావాళ్ళ పేర్లు. కన్నవారు పెట్టిన పేరు కాకుండా 'స్క్రీన్ నేమ్' అంటూ వేరేది పెట్టుకొని విశేషఖ్యాతి గడించిన వారు ఎందరో ఉన్నారు.

Krishnam Raju

Krishnam Raju: అసలు పేరు కన్నా కొసరు పేరు మిన్న అన్నట్టుగా ఉంటాయి కొందరు సినిమావాళ్ళ పేర్లు. కన్నవారు పెట్టిన పేరు కాకుండా 'స్క్రీన్ నేమ్' అంటూ వేరేది పెట్టుకొని విశేషఖ్యాతి గడించిన వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో తెలుగునాట ఫస్ట్ స్టార్ హీరో ఎవరంటే శోభన్ బాబు అనే చెప్పాలి. ఆయన అసలు పేరు శోభనాచలపతి రావు. ఆయనను చూసి తరువాతి రోజుల్లో తమ పేర్లను మార్చుకొని మరీ నటించిన వారున్నారు. అదే తీరున సాగాలని 'రెబల్ స్టార్' కృష్ణంరాజు కూడా ఆశించారు. ఆరంభంలో తన పేరును యు.రవికృష్ణగా చెప్పుకున్నారు. ఆ పేరుతోనే ప్రచారం కావాలనీ ఆశించారు. ఆదుర్తి సుబ్బారావు అందరూ కొత్తవారితో 'తేనెమనసులు' రూపొందించే సమయంలో రవికృష్ణ పేరుతోనే ప్రయత్నం చేశారు కృష్ణంరాజు. అయితే అందులో అవకాశం లభించలేదు.


తరువాత కె.ప్రత్యగాత్మ రూపొందించిన 'చిలకా-గోరింకా'తో ఏకంగా కృష్ణకుమారి సరసన హీరోగా నటిస్తూ పరిచయమయ్యారు కృష్ణంరాజు. పేరును మార్చుకోవడం ఎందుకూ అంటూ వెంకట కృష్ణంరాజును 'కృష్ణంరాజు'గా పరిచయం చేశారు ప్రత్యగాత్మ. 'చిలకా-గోరింకా' పరాజయం పాలయింది. దాంతో కృష్ణంరాజు ఆ తరువాత బిట్ రోల్స్ లోనూ, విలన్ గానూ, కేరెక్టర్ యాక్టర్ గానూ సాగారు. తన సొంత చిత్రాలు 'కృష్ణవేణి, భక్త కన్నప్ప, అమరదీపం'తో నటునిగా మంచి గుర్తింపు సంపాదించాక, దాసరి నారాయణ రావు తెరకెక్కించిన 'కటకటాల రుద్రయ్య, రంగూన్ రౌడీ' ఘనవిజయం తరువాత 'రెబల్ స్టార్'గా నిలిచారు. ఆ తరువాత కథ అందరికీ తెలిసిందే.


ఏది ఏమైనా కృష్ణంరాజు తొలుత యు.రవికృష్ణ పేరుతో నటునిగా అవకాశాల కోసం ప్రయత్నించారని కొందరికే తెలుసు. అందుకు నిదర్శనంగానే ఇక్కడ కనిపిస్తోన్న కృష్ణంరాజు మేకప్ స్టిల్స్ నిలిచాయి. వర్ధమాన నటునిగా యు.రవికృష్ణను పరిచయం చేస్తూ అప్పట్లో 'సినిమారంగం'లో ఈ ఫొటోలు వెలుగు చూశాయి.

NTR: డ్రాగన్.. విధ్వంసం కోసం సిద్ధం

Robert Redford: ఆస్కార్ బెస్ట్ డైరెక్టర్ రాబర్ట్ రెడ్ ఫోర్డ్.. ఇక లేరు

Updated Date - Sep 16 , 2025 | 10:13 PM