Gulabi: మూడు పదుల 'గులాబి'
ABN , Publish Date - Nov 03 , 2025 | 09:00 PM
డైరెక్టర్ కృష్ణవంశీ (Krishna Vamsi) తొలి చిత్రం 'గులాబి' (Gulabi) 30 ఏళ్ళ క్రితం నవంబర్ 3వ తేదీన జనం ముందు నిలచింది. ఈ చిత్రాన్ని అమితాబ్ బచ్చన్ కార్పోరేషన్ లిమిటెడ్ (ఏబీసీయల్) (ABCL)తో కలసి రామ్ గోపాల్ వర్మ నిర్మించారు.
Gulabi: డైరెక్టర్ కృష్ణవంశీ (Krishna Vamsi) తొలి చిత్రం 'గులాబి' (Gulabi) 30 ఏళ్ళ క్రితం నవంబర్ 3వ తేదీన జనం ముందు నిలచింది. ఈ చిత్రాన్ని అమితాబ్ బచ్చన్ కార్పోరేషన్ లిమిటెడ్ (ఏబీసీయల్) (ABCL)తో కలసి రామ్ గోపాల్ వర్మ నిర్మించారు. జె.డి.చక్రవర్తి (JD Chakravarthi), మహేశ్వరి (Maheswari) జంటగా నటించిన ఈ చిత్రం పలువురికి మంచిపేరు సంపాదించి పెట్టింది. 1990లో హీరో సల్మాన్ ఖాన్ రాసిన 'బాఘీ', 1994లో కమల్ హాసన్ కథ రాసిన 'మహానది'లోని ప్రధానాంశమే 'గులాబి'లోనూ తొంగి చూసింది. అమాయకపు అమ్మాయిలను మోసం చేసి, కిడ్నాప్ చేసి వేశ్యావాటికల్లో బలవంతంగా తోసేయడం, తరువాత వేరే ప్రాంతాలకు వారిని ఎగుమతి చేయడం ఈ చిత్రాల్లోని ప్రధానాంశం. అయితే 'గులాబి' చిత్రాన్ని ఓ ఫ్రెష్ మూవీలా కృష్ణవంశీ తీర్చిదిద్దిన తీరు అలరిస్తుంది.
1995 నవంబర్ 3వ తేదీన విడుదలైన 'గులాబి' చిత్రం యువతను విశేషంగా ఆకట్టుకుంది. ముప్పై ఏళ్ళ క్రితం యూత్ కు కావలసిన అంశాలన్నీ 'గులాబి'లో పుష్కలంగా చొప్పించారు కృష్ణవంశీ. దాంతో 'గులాబి' విశేషాదరణ చూరగొంది. లోకల్ లాంగ్వేజ్ ను బాగా ఉపయోగించుకున్నారు. అందువల్ల 'గులాబి'లోని డైలాగ్స్ పట్టేశాయి. హీరోను హీరోయిన్ 'ఒరే చందూ...' అంటూ సంబోధించడం, 'అంత సీన్ లేదమ్మా...' అనే డైలాగ్ భలేగా పాపులర్ అయ్యాయి. ఈ సినిమాతో జేడీ చక్రవర్తికి హీరోగా మంచి గుర్తింపు లభించింది. మహేశ్వరికి నాయికగా మరింత పేరు దక్కింది.
అప్పటి దాకా విలన్ రోల్స్, లేదా విలన్ హెంచ్ మెన్ లో ఒకరిగా కనిపించిన చలపతిరావు ఇమేజ్ ను 'గులాబి' మార్చి వేసింది. ఇందులో హీరోయిన్ తండ్రిగా చలపతిరావు నటించడం, ఈ సినిమా విజయం సాధించడంతో ఆ పై అనేక చిత్రాలలో చలపతిరావు హీరోలకు, హీరోయిన్స్ కు తండ్రిగా కనిపించారు. బ్రహ్మాజీ నమ్మించి మోసం చేసే పాత్రలో నటించగా, చంద్రమోహన్ హీరో తండ్రిగా అభినయించారు. ఈ సినిమా విజయంతో ఇందులో నటించిన చాలామందికి మంచిపేరు లభించింది. వారిలో పలువురు కృష్ణవంశీ సినిమాల్లో అడపాదడపా దర్శనమిస్తూనే సాగారు.
ఈ చిత్రానికి సంభాషణలు రాసిన నడిమింటి నరసింగరావుకు, ఈ సినిమాతోనే మ్యూజిక్ డైరెక్టర్ అయిన శశిప్రీతమ్ కు మంచి గుర్తింపు లభించింది.. అంతకు ముందే రామ్ గోపాల్ వర్మ తొలిసినిమా 'శివ'లో 'బాటనీ పాఠముంది... మేటనీ ఆట ఉంది...' అంటూ పాట రాసి యూత్ ను ఉర్రూతలూగించిన సీతారామశాస్త్రి ఇందులోని ఐదు పాటలనూ పలికించారు. 'ఈ వేళలో నీవు...' అంటూ సునీత పాడిన పాట ఆమెకు గాయనిగా మంచి గుర్తింపును సంపాదించిపెట్టింది. 'మేఘాలలో తేలిపొమ్మంది...' అంటూ సాగే బైక్ సాంగ్ కుర్రకారును సీట్లలో కుదురుగా కూర్చోనివ్వలేదు. అలాగే 'క్లాస్ రూమ్ లో తపస్సు చేయుట వేస్ట్ రా గురూ...' అనే పాట అప్పటి కాలేజ్ స్టూడెంట్స్ ను కట్టిపడేసింది. క్లాస్ లకు బంక్ కొట్టి సినిమాలకు వెళ్ళేవాళ్ళందరూ ఈ పాట కోసమే అన్నట్టు 'గులాబి' ఆడే థియేటర్లకు పరుగులు తీశారు. ఈ సినిమాలో బైక్ సాంగ్ చిత్రీకరణ చూసి అక్కినేని నాగార్జున ఎంతగానో మెచ్చుకున్నారు. వెంటనే కృష్ణవంశీకి ఛాన్స్ ఇచ్చారు నాగార్జున. తత్ఫలితంగా రూపొందిన చిత్రమే 'నిన్నే పెళ్ళాడతా'. నాగ్ సొంతగా నిర్మించి నటించిన 'నిన్నే పెళ్ళాడతా' 1996 బిగ్ హిట్స్ లో ఒకటిగా నిలచింది. ఆ తరువాత కృష్ణవంశీ ప్రయోగాలు చేసుకుంటూ ముందుకు సాగారు. 'క్రియేటివ్ డైరెక్టర్' కృష్ణవంశీ అనే పేరు సంపాదించారు. 'గులాబి' సినిమాతో బెస్ట్ ఫస్ట్ ఫిలిమ్ ఆఫ్ ఏ డైరెక్టర్ గా నంది అవార్డును సొంతం చేసుకున్నారు కృష్ణవంశీ.
Meenakshi Chaudhary: కుర్ర హీరోలనే కాదు సీనియర్ హీరోలను కూడా వదలడం లేదుగా
Alia Bhatt: ఏప్రిల్ కు వెళ్ళిపోయిన 'ఆల్ఫా'