సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kota Srinivasarao: స్టార్స్ తో కోట అనుభవాలు... అనుబంధాలు...

ABN, Publish Date - Jul 13 , 2025 | 01:34 PM

ఈ నాటికీ టాలీవుడ్ టాప్ స్టార్స్ అనగానే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ నే గుర్తు చేసుకుంటున్నారు సినీ ఫ్యాన్స్. ఈ నలుగురు హీరోలతోనూ కోట శ్రీనివాసరావుకు ప్రత్యేక బంధం ఉంది.

ఈ నాటికీ టాలీవుడ్ టాప్ స్టార్స్ అనగానే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ నే గుర్తు చేసుకుంటున్నారు సినీ ఫ్యాన్స్. ఈ నలుగురు హీరోలతోనూ కోట శ్రీనివాసరావుకు (Kota Srinivasarao) ప్రత్యేక బంధం ఉంది. వారి బ్లాక్ బస్టర్ హిట్స్ లోనూ కోట శ్రీనివాసరావు నటించి అలరించారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ తో తన అనుబంధాన్ని పదే పదే చెప్పుకొనేవారు కోట. 2015లో 'పద్మశ్రీ' అందుకున్న తరువాత కోట ప్రత్యేకంగా టాప్ స్టార్స్ తో తనకున్న అనుభవాలను, అనుబంధాలను పలువురు మీడియా ప్రతినిధులతో పంచుకున్నారు.  (Chiranjeevi, Balakrishna, Venkatesh, Nagarjuna)

చిరంజీవితో చనువు...

మెగాస్టార్ చిరంజీవితో తనకు చనువు ఎక్కువగా ఉందని కోట శ్రీనివాసరావు గుర్తు చేసుకొనేవారు. చిరంజీవి, కోట ఇద్దరూ కె.వాసు దర్శకత్వంలో క్రాంతికుమార్ నిర్మించిన 'ప్రాణం ఖరీదు' (1978)తోనే తొలిసారి తెరపై కనిపించారు. ఆ తరువాత చిరంజీవి టాప్ స్టార్ అయ్యాక కూడా ఆయన తననెంతో అభిమానంగా చూసుకొనేవారని చెప్పేవారు కోట. చిరంజీవితో తాను నటించిన "యముడికి మొగుడు, ఖైదీ నంబర్ 786, రౌడీ అల్లుడు, అల్లుడా మజాకా, బావగారూ బాగున్నారా, అన్నయ్య, ఠాగూర్" చిత్రాలు బిగ్ హిట్స్ గా నిలిచాయని ఆనందంగా గుర్తు చేసుకొనేవారు. చిరంజీవి తమ్ముడు నాగబాబు నిర్మించిన చిత్రాల్లోనూ తనకు మంచి పాత్రలే ఇచ్చి గౌరవించారనీ చెప్పారు. పవన్ కళ్యాణ్ తొలిచిత్రం 'అక్కడ అమ్మాయి- ఇక్కడ అబ్బాయి'లో మెయిన్ లవ్ స్టోరీకి ప్యారలల్ ఓ కామెడీ ట్రాక్ ఉంటుందని ఆ కామెడీ లవ్ స్టోరీలో తాను లవర్ గా నటించడం తలచుకుంటే గిలిగింతలు పెట్టినట్టవుతుందని అనేవారు.

బాలయ్య అంటే భయం...
నటసింహ బాలకృష్ణతో తనకు ఓ ప్రత్యేకమైన బంధం ఉందనీ చెప్పేవారు కోట. బాలయ్య హీరోగా జంధ్యాల తెరకెక్కించిన 'బాబాయ్ -అబ్బాయ్'లో కోట ఓ చిన్న పాత్ర పోషించారు. ఆ తరువాత గుర్తింపు తెచ్చుకోవడానికి పలు పాట్లు పాడుతున్న సమయంలో 'ప్రతిఘటన'లోని కాశయ్య పాత్ర ఆదుకుందని అనేవారు. కాశయ్య పాత్ర కారణంగానే తనకు అప్పట్లో హీరో కృష్ణ వర్గంగా పేరొందిన డాక్టర్ యమ్. ప్రభాకర్ రెడ్డి డైరెక్షన్ లో రూపొందిన 'మండలాధీశుడు'లో యన్టీఆర్ ను పోలిన 'భీమారావు' పాత్ర దక్కిందని, అన్నగారి పాత్రలో సెటైర్ గా నటిస్తే అందరూ మెచ్చుకుంటారని భావించానే కానీ, ఆ మహానటుణ్ణి తక్కువ చేసేంత వాడిని కానని కోట పదే పదే చెప్పేవారు. ఆ సినిమాలో నటించడంవల్ల తెలుగుదేశం వారు తనపై కక్ష కట్టి, వారికి సంబంధించిన సినిమాల్లో అవకాశాల్లేకుండా చేశారనీ, అలాగే బాలయ్య బాబు కూడా దూరం పెట్టారనీ గుర్తు చేసుకొనేవారు. ఓ సారి ఓ హోటల్ లో తాను లిఫ్ట్ ఎక్కబోతూండగా, అదే లిఫ్ట్ లో నుండి బయటకు వచ్చిన బాలయ్య తనపై  'ఛీ...' అంటూ ఉమ్మేశారనీ గుర్తు చేసుకొనేవారు. అందులో ఏ మాత్రం తప్పులేదనీ కోటనే అనేవారు. "ఎందుకంటే యన్టీఆర్ ఎందరికో దైవం... ఆయన సొంతకొడుకు కాబట్టి బాలయ్యకు మరెంతో భక్తిప్రపత్తులున్నాయి. అందువల్ల బాలయ్య కోపగించుకోవడంలో తప్పులేదని భావించాను. అయితే ఎలాగైనా బాలయ్య సినిమాల్లోనూ తాను నటించాలని ఆశించేవాణ్ణి. ఓ మిత్రుని సలహాతో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న యన్టీఆర్ ను ఓ రోజు ఉదయాన్నే కలుసుకొని "సార్... ఏదో పొట్ట కూటి కోసం వేసిన పాత్ర అది... అంతేకానీ, మిమ్మల్ని కిండల్ చేసేంత గొప్పవాణ్ణి కాను..." అని చెప్పాను. అందుకు యన్టీఆర్ "ఆర్టిస్ట్ అన్న తరువాత ఏ పాత్ర వచ్చినా చేయాలి...అందులో మీ తప్పేముంది బ్రదర్..." అన్నారని చెప్పారు కోట. తరువాత బాలయ్య తనను దూరం పెడుతున్న విషయం పెద్దాయనకు చెప్పడంతో, 'నో...నో... వీ ఆర్ ఆర్టిస్ట్స్... వీ ఆర్ ఫ్యామిలీ..." అని అన్నారని గుర్తుచేసుకొనేవారు. యన్టీఆర్ బాలయ్యకు చెప్పడం వల్లే తరువాతి రోజుల్లో ఆయన హీరోగా నటించిన చిత్రాల్లో అవకాశాలు వచ్చాయనీ తెలిపారు కోట. ఆ తరువాత నుంచీ బాలయ్య ఎంతో బాగా చూసుకొనేవారని, నిజం చెప్పాలంటే ఆయనది చిన్నపిల్లాడి మనస్తత్వం అని అనేవారు కోట. ఏదేమైనా బాలయ్య అంటే తనకు భయమనీ చెప్పేవారు. బాలకృష్ణ హీరోగా రూపొందిన "వంశానికొక్కడు, పెద్దన్నయ్య, సమరసింహారెడ్డి, సింహా" వంటి బ్లాక్ బస్టర్స్ లో కోట కీలక పాత్రలు ధరించారు. బాలయ్య సోదరులు నిర్మించిన "పెద్దన్నయ్య, గొప్పింటల్లుడు" చిత్రాల్లోనూ కోట నటించారు. ఆ సమయంలో బాలయ్య, ఆయన తమ్ముడు రామకృష్ణ తననెంతో గౌరవంగా చూసుకొనేవారనీ కోట చెప్పేవారు.



మా 'శివ'... నాగార్జున...
కింగ్ నాగార్జున కెరీర్ లో బంపర్ హిట్స్ గా నిలచిన చిత్రాలలో నటించడం ఓ అదృష్టంగా భావించేవారు కోట. అంతకు ముందు కొన్ని చిత్రాలలో నాగ్ తో కలసి నటించినా, టాలీవుడ్ లోనే ఓ కొత్త ట్రెండ్ సృష్టించిన 'శివ'లో నటించడం తనకెంతో ఆనందం కలిగించిందని అనేవారు కోట. 'శివ' తరువాత నాగ్ ను కొన్ని పరాజయాలు పలకరించాయని ఆ పై వచ్చిన బంపర్ హిట్ 'ప్రెసిడెంట్ గారి పెళ్ళాం'లోనూ దూపం వేసే నాదముని పాత్ర తనకు మంచిపేరు సంపాదించి పెట్టిందనీ చెప్పేవారు. ఇక నాగ్ డ్యుయల్ రోల్ పోషించిన సూపర్ డూపర్ హిట్ మూవీ 'హలో...బ్రదర్'లో ఎస్ఐ తాడి మట్టయ్య పాత్ర ఓ మరపురాని అనుభూతిని కలిగించిందనీ అనేవారు కోట. నటునిగా నాగార్జునకు ఎనలేని కీర్తిని సంపాదించి పెట్టిన 'అన్నమయ్య'లో మంత్రిగా నటించానని, నాగ్ కెరీర్ లోనే బిగ్ హిట్ గా నిలచిన 'నువ్వు వస్తావని'లోనూ కీలక పాత్ర పోషించాననీ గుర్తుచేసుకొనేవారు కోట.

వెంకటేశ్ తో అవార్డులు... రివార్డులు...
విక్టరీ వెంకటేశ్ తో తనకు మరింత ప్రత్యేక బంధం ఉందనేవారు కోట. వెంకటేశ్ ఫస్ట్ బంపర్ హిట్ మూవీ 'బొబ్బిలి రాజా'లోనూ, తరువాత వెంకీ మంచి పేరు సంపాదించి పెట్టిన 'శత్రువు'లోనూ కోట ధరించిన పాత్రలు  ఎంతో పేరు సంపాదించి పెట్టాయి. 'శత్రువు'లో కోట పోషించిన వెంకటరత్నం పాత్ర ఆయనపై ప్రశంసల జల్లులు కురిపించింది. ఇక 'గణేశ్'లో వెంకటేశ్ హీరోగా, కోట విలన్ గా పోటీ పడి నటించారు. 'గణేశ్'తో కోటకు బెస్ట్ విలన్ గా నంది అవార్డు అందుకున్నారు. ఇదే చిత్రంతో వెంకటేశ్ కూడా బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డు సొంతం చేసుకోవడం విశేషం! ఇక వెంకటేశ్ తండ్రిగా కోట నటించిన 'ఇంట్లో ఇల్లాలు - వంటింట్లో ప్రియురాలు' సినిమా కోటకు నటునిగా మంచి మార్కులే పోగేసింది. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో తన నటన ఎంతో సంతృప్తి నిచ్చిందని, ఆ సీన్ లో హీరోకంటే తనకే ఎక్కువ డైలాగ్స్ ఉన్నాయని, అందుకు వెంకటేశ్ ప్రోత్సాహం కూడా కారణమని గుర్తు చేసుకొని ఆనందించేవారు కోట.

తరువాతి తరం టాప్ స్టార్స్ అయిన పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, జూ.యన్టీఆర్, రవితేజ, అల్లు అర్జున్, రామ్ చరణ్ సినిమాల్లోనూ కోట మరపురాని పాత్రలు ధరించి ఆకట్టుకున్నారు.
 

Updated Date - Jul 13 , 2025 | 01:46 PM