Kodama Simham: ‘కొదమ సింహం’ రీరిలీజ్
ABN, Publish Date - Nov 05 , 2025 | 05:49 PM
మెగా అభిమానులకు మరో బిగ్ సర్ ప్రైజ్! నవంబర్ నెల చిరు మేనియాతో ఊగబోతోంది. ఆయన కెరీర్ లో చెప్పుకోదగ్గ విజయాన్ని అందుకున్న 'కొదమ సింహం' రీ-రిలీజ్ కు రెడీ అవుతోంది.
టాలీవుడ్ లో ప్రస్తుతం రీ-రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా పాత బ్లాక్ బస్టర్ చిత్రాలను మళ్లీ తెరపైకి తీసుకొచ్చి, 4కె రీమాస్టరింగ్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతున్నారు మేకర్స్. ఇప్పటికే నైంటీస్ లోని పలు హిట్ మూవీస్ ఈ బాటపట్టగా.. తాజాగా ఈ కోవలోనే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ) నటించిన 'కొదమసింహం' రాబోతోంది. 1990లలో వచ్చిన ఈ సినిమాలో చిరంజీవి కౌబోయ్ గా నటించాడు.
'కొదమ సింహం' (Kodama Simham) సినిమాకి చిరు కెరీర్ లో ప్రత్యేక స్థానముంది. ఆయన కెరీర్ లో ఇది ఒక్కటే కౌబాయ్ థీమ్‌తో వచ్చిన చిత్రం ఇది. బ్రిటిష్ ఆర్కాట్ రాజ్య నేపథ్యంలో సాగే ఈ కథ, సాహసం, హాస్యం, యాక్షన్ మేళవింపుగా వచ్చి అప్పటి ప్రేక్షకులను ఆకట్టుకుంది. 1990 ఆగస్టు 9న విడుదలైన ఈ సినిమా, అదే సమయంలో ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ (Jagadeka Veerudu Athiloka Sundari ) హవా నడుస్తున్నప్పటికీ, మంచి వసూళ్లను సాధించుకుంది. ఇప్పుడు మళ్లీ విడుదలకు రెడీ అవుతోంది.
నవంబర్ 21న 'కొదమ సింహం' 4 కె రిజల్యూషన్, 5.1 సరౌండ్ సౌండ్‌తో క్లియర్ ప్రింట్ తో థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా విశేషాల సంగతికి వస్తే.. రమా ఫిల్మ్స్ బ్యానర్‌పై కైకాల నాగేశ్వరరావు నిర్మించగా, కైకాల సత్యనారాయణ సమర్పించారు. కథను విజయేంద్ర ప్రసాద్, శివశక్తి దత్తా అందించగా, పరుచూరి బ్రదర్స్ స్క్రీన్‌ప్లే, సత్యానంద్ సంభాషణలు రాశారు. రాజ్ - కోటి స్వరపరచిన సంగీతం సినిమాకు జీవం పోసింది. మోహన్ బాబు పోషించిన ‘సుడిగాలి’ అనే కామెడీ విలన్ పాత్ర ఈరోజుకీ గుర్తుండి పోతుంది. చిరంజీవితో పాటు రాధ, సోనమ్, వాణీ విశ్వనాథ్ నాయికలుగా నటించారు. ఆ కాలంలో రూ. 4 కోట్లతో నిర్మితమైన ఈ చిత్రం, రూ. 6 కోట్లకుపైగా వసూళ్లు సాధించి విజయవంతమైంది. 22 కేంద్రాల్లో 100 రోజులు దాటి ఆడింది. హిందీలో ‘మై హూ ఖిలాడియోంకా ఖిలాడి’గా, ఇంగ్లీష్‌లో ‘హంటర్స్ ఆఫ్ ది ఇండియన్ ట్రెజర్’గా డబ్ చేయబడి, చిరంజీవి చిత్రాల్లో ఇంగ్లీష్ లో డబ్బింగ్ అయిన ఏకైక సినిమాగా రికార్డు సృష్టించింది. అలాంటి మూవీ రీ-రిలీజ్ కు రెడీ అవుతుండటంతో మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.
Read Also: Peddi: 'చికిరి' ప్రోమో అదిరింది.. ఇక ఇంటర్నెట్ షేకే! ఎక్కడ చూసినా.. చరణ్ స్టెప్పులే కనిపిస్తాయి
Read Also: NTR: అయ్యా.. అయ్యా.. ఊరమాస్ లుక్ అయ్యా..