Vijay Devarakonda: కింగ్ డమ్ హీరో కితాబు...
ABN, Publish Date - Jul 19 , 2025 | 12:32 PM
సెటైర్స్ ను హీరో విజయ్ దేవరకొండ భలే ఎంజాయ్ చేస్తాడు. ఈ నెలాఖరులో రాబోతున్న 'కింగ్ డమ్' మూవీకి సంబంధించిన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వీడియో తెగ నచ్చేయడంతో విజయ్ దేవరకొండ దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ప్రముఖ కథానాయకుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) డెంగ్యూ జ్వరంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడని ఇరవై నాలుగు గంటలుగా సోషల్ మీడియా కోడై కూస్తోంది. అయితే ఆ విషయంపై అవుననో, కాదనో సమాధానం చెప్పకుండా... విజయ్ దేవరకొండ తనదైన స్టైల్ లో స్పందించాడు. అయితే ఇది అతని ఆరోగ్యానికి సంబంధించిన అప్ డేట్ కాదు... 'కింగ్ డమ్' (Kingdom) మూవీ ఈ నెల 31న విడుదల కాబోతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆన్ లైన్ ఎడిటర్ ఒకరు పోస్ట్ చేసిన వీడియో గురించి.
'కింగ్ డమ్' టీజర్ తో పాటు మరికొన్ని పాపులర్ మూవీస్ నుండి విజువల్స్ ను సేకరించి, 'కింగ్ డమ్' కథ ఇదే కావచ్చునంటూ సరదాగా ఓ వీడియోను సోషల్ మీడియాలో ఒకరు పోస్ట్ చేశారు. బహుశా హాస్పిటల్ బెడ్ మీద విజయ్ దేవరకొండ రిలాక్స్ అవుతూ, దానిని చూశాడేమో... తెగ నచ్చేయడంతో వెంటనే తన వాల్ మీద ఆ వీడియో లింక్ ను పోస్ట్ చేసేశాడు. అంతేకాదు... 'అసలు మీరు ఏం తింటారు రా బాబూ... మీరు వేరే లెక్క' అంటూ నవ్వుతున్న ఎమోజీనీ, లవ్ సింబల్ ను పోస్ట్ చేసేశాడు. ఈ వీడియోను చూసి నెటిజన్స్ కూడా తెగ ఎంజాయ్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండలోని ఎరగెన్సీని వివిధ సినిమాల్లోని వీడియో క్లిప్పింగ్స్ తో ఇందులో పర్ ఫెక్ట్ గా ఎడిట్ చేసి పోస్ట్ చేశారు. అలానే 'ఆ కుర్చీని మడతపెట్టి...' సాంగ్ నూ సరదాగా వాడేసుకున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే... చివరిలో 'కింగ్ డమ్' మీద కూడా ఓ సెటైర్ వేసేశాడు. ఇప్పటికే ఈ సినిమా ఏ డేట్స్ లో రావాల్సి ఉండి... రాలేదో కూడా పేర్కొన్నాడు. అంతా ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్న 'కింగ్ డమ్' ఖచ్చితంగా ఈ నెల 31న విడుదల కావాలని, అఖండ విజయాన్ని అందుకోవాలని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.