సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Progressive Panel Press Meet: గుడ్డు పెట్టే కోడికి, బురదలో దిగే వారికే సమస్యలు తెలుస్తాయి

ABN, Publish Date - Dec 27 , 2025 | 08:01 PM

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత కీలకమైన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (Telugu Film Chamber Of Commerce )ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి.

Progressive Panel Press Meet

Progressive Panel Press Meet: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత కీలకమైన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (Telugu Film Chamber Of Commerce )ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. 2025-2027 ఏడాదిలకు కొత్త పాలకవర్గాన్ని ఎన్నుకునేందుకు సర్వం సిద్ధమైంది. ఆదివారం(డిసెంబర్ 28)నాడు ఈ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అయితే, ఈ సారి ఎన్నికలు ప్రోగ్రెసివ్ ప్యానల్ (Progressive Panel ), మన ప్యానెల్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. పరిశ్రమలోని నాలుగు విభాగాల(నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు, స్టూడియోలు) అభ్యర్థులు తమ అదృష్టాన్ని రేపు పరీక్షించుకోనున్నారు.

ఎన్నికల నేపథ్యంలో ప్రోగ్రెసివ్ ప్యానెల్ సభ్యులు ఒక ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో సీనియర్ నిర్మాతలు కె.ఎస్. రామారావు, అశోక్ కుమార్, రవికిషోర్, మైత్రీ రవి, కృష్ణ ప్రసాద్, దామోదర్ ప్రసాద్, ఎస్.కే. ఎన్ తదితరులు పాల్గొన్నారు. సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల సమస్యలు, వర్కర్ల వేతనాల వివాదాలు, థియేటర్ల వ్యవస్థలో మార్పులపై ప్యానెల్ సభ్యులు చర్చించారు.

ప్రెస్ మీట్‌లో సీనియర్ నిర్మాత కె.ఎస్. రామారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుతం ఛాంబర్‌లో చిత్ర పరిశ్రమకు ఉపయోగపడే ప్రోగ్రెసివ్ కార్యక్రమాలు జరగకపోగా, కొందరు వడ్డీ వ్యాపారం చేసుకుంటున్నారు. ఫిల్మ్ ఛాంబర్ బిల్డింగ్ మన చిత్ర పరిశ్రమ ప్రయోజనాల కోసమే నిర్మించబడింది. అలాగే ఫిల్మ్ నగర్ సొసైటీ కూడా పరిశ్రమ వ్యక్తుల కోసమే స్థలాలు ఇచ్చింది. ప్రోగ్రెసివ్ ప్యానెల్ ఉద్దేశంలో నిర్మాతలందరూ ఒక్కటే. ఇక్కడ మంచి సినిమా, చెడ్డ సినిమా మాత్రమే ఉంటాయి తప్ప.. పెద్ద సినిమా, చిన్న సినిమా అనే భేదాలు లేవు. గిల్డ్ వల్ల పరిశ్రమకు ఎలాంటి నష్టం లేదు, దానిపై కేవలం అపవాదులు వేస్తున్నారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే ఈ ప్రోగ్రెసివ్ ప్యానెల్‌ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. మన ప్యానెల్‌కు ఓటు వేసి ఇండస్ట్రీ ప్రగతికి సహకరించండి’ అని ఆయన పిలుపునిచ్చారు.

మరో నిర్మాత అశోక్ కుమార్ మాట్లాడుతూ.. ‘ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల నిర్వహణ కోసం ఎంతో పోరాటం చేశాం. కొందరు వ్యక్తులు కావాలనే ఈ ఎన్నికలు ఆలస్యం కావడానికి కారణమయ్యారు. నేను వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పటికీ, ఎన్నికల కోసం ఐదు నెలల పాటు పోరాడాల్సి వచ్చింది. మనకంటే పెద్దలు ఈ ఛాంబర్ కోసం ఎంతో కృషి చేశారు. గతంలో దామోదర్ ప్రసాద్ గారి నాన్నగారికి ప్రభుత్వం భూమి ఇచ్చినా, ఆయన దానిని తీసుకోలేదు. ఇప్పుడు కొందరు ఛాంబర్ లీజ్ గురించి మాట్లాడుతూ.. మనకు సంబంధం లేదని ప్రచారం చేస్తున్నారు. మన పరిశ్రమ కోసం మనం కష్టపడి ఏర్పాటు చేసుకున్న బిల్డింగ్ అది. ప్రస్తుతం ఇండస్ట్రీ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. పరిశ్రమను మళ్లీ గాడిలో పెట్టాలంటే ఖచ్చితంగా 'ప్రోగ్రెసివ్ ప్యానెల్' అధికారంలోకి రావాలి. నిరంతరం సినిమాలు చేసే వారే ఛాంబర్‌లో ఉండాలి. నాలుగు సెక్టార్లకు (నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు, స్టూడియోలు) మేలు చేసే మంచి సలహాలు, ఆలోచనలు మనకు అవసరం. వీటిని దృష్టిలో పెట్టుకుని మన ప్యానెల్‌ను భారీ మెజారిటీతో ఎన్నుకోవాలి’ అని ఆయన పిలుపునిచ్చారు.

మరో సీనియర్ నిర్మాత స్రవంతి రవికిషోర్ మాట్లాడుతూ.. ‘గిల్డ్‌పై కొందరు అనవసర ఆరోపణలు చేస్తున్నారు. నిర్మాతల అవసరాలను ఎప్పటికప్పుడు తీర్చడానికి, ప్రస్తుతం యాక్టివ్‌గా సినిమాలు తీస్తున్న రన్నింగ్ నిర్మాతలమే గిల్డ్‌ను ఏర్పాటు చేశాం. ఇది ఎవరి స్వలాభం కోసం చేసినది కాదు. నిర్మాతలందరి ప్రయోజనాల కోసం, అలాగే ఎగ్జిబిటర్ల కోసం క్యూబ్, యూఎఫ్‌ఓవంటి సంస్థలతో మేమే చర్చలు జరిపి సర్దుబాట్లు చేసుకున్నాము. కానీ, వేరే ప్యానెల్ వారికి ఈ ఛాంబర్‌ను అమ్మేయాలనే ఆలోచన ఉంది. గతంలో మెడిక్లెయిమ్ పై 18 శాతం జీఎస్టీ ఉండేది. ఆ డబ్బు వృధా కాకూడదని, నిజంగా అర్హులైన వారికే ఆ సాయం అందాలని మేము ఆలోచించాం. కానీ అక్కడున్న ఒక వ్యక్తి తనకు కావాల్సిన వారికి, చివరికి కోటీశ్వరులైన వారికే ఇచ్చి నిధులను మిస్ యూజ్ చేశారు’ అని రవికిషోర్ పేర్కొన్నారు.

మైత్రి రవి మాట్లాడుతూ..‘ప్రతి ఏటా మా మైత్రీ మూవీ మేకర్స్ తరఫున, దిల్ రాజు గారి తరఫున సుమారు 70 నుంచి 80 చిన్న సినిమాలను విడుదల చేస్తున్నాం. పరిశ్రమలో బాగా ఆడి విజయం సాధించిన చిత్రమే అసలైన పెద్ద సినిమా.. దానికి బడ్జెట్‌తో సంబంధం లేదు. ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్‌ను ఏకగ్రీవంగా గెలిపించాలని కోరుతున్నాను. ప్రస్తుతం ప్రభుత్వాలు కూడా మనకు పూర్తి మద్దతుగా ఉన్నాయి. సినిమాలు తీయలేకపోతున్న నిర్మాతలకు కూడా మేము అండగా ఉంటాం. మాకు పదవులు ముఖ్యం కాదు.. చిత్ర పరిశ్రమ అభివృద్ధి మాత్రమే మా ప్రధాన లక్ష్యం’ అని మైత్రీ రవి అన్నారు.

నిర్మాత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఇక్కడ బడా నిర్మాతలు దేన్నో తరలించేస్తున్నారు అని ప్రచారం చేయడం పూర్తిగా తప్పు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం సినిమాలు చేసిన వారు, ఇప్పుడు వచ్చి నిర్మాతలకు సపోర్ట్ చేస్తామనడం విడ్డూరంగా ఉంది. గతంలో మీ స్వార్థం కోసమే ఛాంబర్ పదవులను వాడుకున్నారు. నేను బాలకృష్ణ గారి దయతో నాలుగు సినిమాలు తీశాను. ఒకవేళ నా సినిమా ఫ్లాప్ అయినా, నేను ఇండస్ట్రీలోనే ఉంటాను. సినిమాలు తీయని ఒక వ్యక్తి మాట్లాడిన మాటలు నన్ను ఎంతగానో బాధించాయి. నిరంతరం సినిమాలు తీసే మాకే ఇండస్ట్రీ కష్టాలేమిటో తెలుస్తాయి. కాబట్టి, ప్రతి ఒక్కరూ వాస్తవాలను గమనించి, ఈ ఎన్నికల్లో ఓటు వేయాలని కోరుతున్నాను.’ అని అన్నారు.

ప్రెస్ మీట్‌లో నిర్మాత ఎస్.కె.ఎన్ మాట్లాడుతూ.. ‘నిరంతరం సినిమాలు తీసే వారిని పక్కనపెట్టి, నిన్నటి నుండి చాలా మంది అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ మాట్లాడుతున్నారు. పరిశ్రమలో సుమారు 2 వేల మంది నిర్మాతలు ఉన్నారు. ఒక వ్యక్తి ఎప్పుడు సినిమా తీసినా ఆయన ఎప్పటికీ నిర్మాతగానే గుర్తింపు పొందుతారు. కానీ, గత ఐదేళ్లుగా ఒక్క సినిమా కూడా తీయని వారు.. సినిమాను అలా తీయాలి, ఇలా తీయాలి అని మాకు సలహాలు ఇవ్వడం విడ్డూరం. గుడ్డు పెట్టే కోడికి, బురదలో దిగే వారికే అసలు సమస్యలు ఏమిటో తెలుస్తాయి. మాది ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నడుస్తున్న 'అప్‌డేటెడ్ ప్యానెల్'. పరిశ్రమ రియాలిటీ తెలిసిన మా ప్రోగ్రెసివ్ ప్యానెల్‌ను గెలిపించండి’ అని ఆయన అన్నారు.

Updated Date - Dec 27 , 2025 | 08:01 PM