Kasarla Shyam: కాసర్ల శ్యామ్.. నేషనల్ అవార్డు సీక్రెట్ అదే
ABN, Publish Date - Aug 17 , 2025 | 08:13 AM
గ్రామీణ జీవనాన్ని, అక్కడి జీవన సౌందర్యాన్ని ‘ఊరు పల్లెటూరు’ అంటూ అందంగా అక్షరీకరించారు గేయ రచయిత కాసర్ల శ్యామ్.
గ్రామీణ జీవనాన్ని, అక్కడి జీవన సౌందర్యాన్ని ‘ఊరు పల్లెటూరు’ (Uru palleturu) అంటూ అందంగా అక్షరీకరించారు గేయ రచయిత కాసర్ల శ్యామ్. ‘బలగం’లోని (Balagam)ఈ పాటే ఆయనకు ‘ఉత్తమ గీత రచయిత’గా జాతీయ పురస్కారాన్ని అందించింది. ఈ సందర్భంగా ‘మీ ఫేవరెట్ 5’ (Kasarla syam Favorite 5)ఏమిటని అడిగితే... ఆయన వాటి నేపథ్యాన్ని ఇలా పంచుకున్నారు.
అమ్మ ప్రేమ కోణంలో...
‘బలగం’ సినిమాలో ‘పొట్టిపిల్ల..’ పాట కోసం దర్శకుడు వేణు నన్ను సంప్రదించారు. జానపద కళలపై నాకున్న అవగాహనతో ఆయనకి కొన్ని సలహాలిచ్చాను. నన్ను నమ్మి సినిమాలోని అన్ని పాటలను నాకు అప్పగించారు. వాటిలో ‘ఊరు పల్లెటూరు.. దీని తీరే అమ్మతీరు’ పాట విషయానికొస్తే... ‘పల్లె గురించి ఇంతకుముందు చెప్పిన పోలికలేవీ నాకొద్దు. ఎవరూ చెప్పని సరికొత్త కోణంలో కావాలి. అది జానపదంలా ఉండొద్దు’ అని దర్శకుడు సూచించారు. పల్లెను అమ్మ ప్రేమ కోణంలోంచి చెప్పాలనే ఆలోచన తట్టింది. పల్లెను, పల్లె పరిసరాలను పరిచయం చేస్తూ.. అక్కడి స్వచ్ఛతను, ఆ మట్టిపరిమళాన్ని, బంధాలు, అనుబంధాలను వివరిస్తూ రాశాను.
నీలపురి గాజులు ... బ్రేక్ ఇచ్చింది...
అప్పట్లో నాకొక వీధినాటక బృందం ఉండేది. దర్శకుడు కృష్ణవంశీ ‘మహాత్మ’ సినిమాలో ‘ఇందిరమ్మ ఇంటిపేరు..’ అనే పాట కోసం మా బృందాన్ని సంప్రదించారు. ఆ పాట చిత్రీకరణప్పుడు సరదాగా నేను రాసిన ‘నీలపురి గాజుల..’ పాట పాడి వినిపించా. అది ఆయనకు నచ్చి అదే సినిమాలో వాడదామన్నారు. అందులో హీరోయిన్ పాత్ర పేరు మొదట కస్తూరి. అయితే ‘నీలపురి గాజుల’ పాటలో కృష్ణవేణి అని వస్తుంది కాబట్టి ఆ పేరే ఖరారు చేశారు. హీరోయిన్ పేరును డబ్బింగ్‌లో కృష్ణవేణిగా కవర్ చేశారు. ఆ పాట నాకు గేయ రచయితగా గుర్తింపు తీసుకొచ్చింది.
‘రాములో...’ ఊపేసింది ( Kasarla syam Favorite 5)
‘లై’ ఆడియో వేడుకకు త్రివిక్రమ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సరిగ్గా ‘బొమ్మోలే ఉందిరా..’ పాట రిలీజ్ చేసినప్పుడే ఆయన ఆడిటోరియంలోకి అడుగుపెట్టారు. ‘పాట అదిరిపోయింది. ఎవరు రాశారు’ అని ఆరా తీశారు. వెంటనే నితిన్ నన్ను పరిచయం చేశారు. కట్‌చేస్తే.. అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురములో’ కోసం తెలంగాణ యాసలో ఒక పాట కావాలన్నారు. నేను గుర్తొచ్చి.. తమన్‌కి చెప్పి నన్ను పిలిపించారు త్రివిక్రమ్. ‘సింపుల్ పార్టీ సాంగ్. సినిమాకి సంబంధం లేకుండా పాట ద్వారా ఒక చిన్న కథ చెబుదాం. ముందు ‘బంటుగానికి 22’ అని ఒక డైలాగ్‌తో స్టార్ట్ చేద్దాం’ అని ఇన్‌పుట్స్ ఇచ్చారు. డైలాగ్‌లా కాకుండా దాన్నే టేకాఫ్ లైన్‌గా మార్చుకుని, రెండు రోజుల్లో ఆ పాట పూర్తి చేశా.
డీజే టిల్లు... విన్నప్పుడే హిట్...
లాక్‌డౌన్ సమయంలో రామ్ మిరియాల నాకు ఫోన్ చేసి ‘నేనొక సినిమా చేస్తున్న. దానికి ఒక ప్రమోషనల్ సాంగ్ రాసివ్వమ’ని అడిగారు. అప్పటికే ‘నరుడి బ్రతుకు నటన’ (‘డీజే టిల్లు’కు ముందు టైటిల్) అనే పేరుతో గ్లింప్స్ కూడా వదిలారు. యూట్యూబ్‌లో చూసి.. హీరో స్టయిల్, వస్త్రధారణని పట్టుకుని.. ‘చమ్కీ షర్టు.. గుంగురు జుట్టు’ అంటూ తన వేషధారణ మీద నా స్టైల్‌లో కాస్త గమ్మత్తుగా పాట రాశా. అది విని త్రివిక్రమ్ దర్శకుడితో ‘దీనిని ప్రమోషనల్ సాంగ్‌గా కాకుండా, టైటిల్ ట్రాక్‌గా వాడితే బెటర్’ అన్నారట. దాంతో ‘డీజే టిల్లు’ పాట దుమ్మురేపింది. కచ్చితంగా జనాలకి బాగా ఎక్కుతుందని పాట రాస్తున్నప్పుడే ఫిక్సయ్యా.
ఒక సినిమా కోసం రాస్తే.. మరోదానిలో..
‘బొమ్మోలే ఉందిరా పోరి..’ పాట మణిశర్మ మ్యూజిక్ డైరెక్షన్‌లో వేరే సినిమా కోసం రాశా. కానీ వాడలేదు. దాంతో ఆ పాటను ఆయన తన వద్ద్దే పెట్టుకున్నారు. ‘లై’ సినిమా షూటింగ్‌లో డైరెక్టర్ హను రాఘవపూడి ఆ పాట వినడం, తెగ నచ్చేయడంతో... కొద్దిపాటి మార్పులతో తిరిగి రాయమన్నారు. దాంతో హైదరాబాద్ వెర్షన్‌లో ఉన్న పాటని ‘ఏడికెళ్లి ఊడిపడ్డది మిస్సు.. దీని నవ్వుతోనే ఎలిగిపోయే యూఎస్సు’ అని కథకు తగ్గట్టు యూఎస్ చుట్టూ అల్లాను. పాటలో ఒక చోట ‘నన్నుగాని ఒప్పుకుంటే గోరి.. నా స్కిన్ ఒలిచి కుట్టిస్తా శారీ..’ అని రాశా. రికార్డింగ్ రోజు అది విని ‘ఈ లైన్ అద్భుతంగా ఉంది. దీన్ని మ్యాచ్ చేస్తూ మళ్లీ చరణాలను తిప్పి రాయండి’ అన్నారు దర్శకుడు. అప్పటికప్పుడు చరణాలు మార్చి రాశాను.