Harihara Veeramallu: పార్టీలకు అతీతంగా ప్రీ రిలీజ్ వేడుక
ABN, Publish Date - Jul 18 , 2025 | 01:53 PM
మరో వారం రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఈ నెల 21న జరుగుబోతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులను నిర్మాత ఎ.ఎం. రత్నం ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu) సినిమా ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కాబోతోంది. తెలుగు వర్షన్ ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని 'యు/ఎ 16 +' సర్టిఫికెట్ ను పొందింది. పెద్దంతగా కట్స్ ఏమీ ఇవ్వకుండానే మూడు నాలుగు సవరణలతో సి.బి.ఎఫ్.సి. సభ్యులు 'హరిహర వీరమల్లు'కు క్లీన్ చిట్ ఇచ్చారని సమాచారం. ఈ నేపథ్యంలో ఇతర భాషలకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలూ శరవేగంగా సాగుతున్నాయి. ఇదే సమయంలో ఈ నెల 21న హైదరాబాద్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్మాత ఎ.ఎం. రత్నం (A.M. Rathnam), ఆయన సోదరుడు దయాకరరావు ప్లాన్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రధాన తారాగణం, సాంకేతిక నిపుణులు ఇందులో పాల్గొనబోతున్నారు.
'హరిహర వీరమల్లు' సినిమాకు సంబంధించి ప్రధానంగా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం ఏమంటే... పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొదటి సినిమా ఇది. అలానే ఆయన కెరీర్ లో తొలి పాన్ ఇండియా మూవీ. ఇది మూడు నాలుగేళ్ళ పాటు చిత్రీకరణ జరుపుకుంది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) మొదలు పెట్టిన ఈ సినిమాను రత్నం తనయుడు జ్యోతికృష్ణ (Jyothikrishna) టేకప్ చేసి పూర్తి చేశాడు. ఇది 17వ శతాబ్దానికి చెందిన వీరమల్లు అనే కల్పిత పాత్ర చుట్టూ తిరిగే కథ అని మేకర్స్ చెబుతున్నారు. ఉన్నవారిని కొల్లగొట్టి, లేనివారికి పంచే రాబిన్ హుడ్ తరహాలో వీరమల్లు పాత్ర ఉంటుందని అంటున్నారు. అయితే ఇవాళ పవన్ కళ్యాణ్ హిందుత్వ ఎజెండాను భుజానకెత్తుకుని గట్టిగా ప్రచారం చేస్తున్నారు. ఆ కారణంగా ఆయన ఆలోచనలకు అద్దం పడుతూ, హిందూ ధర్మాన్ని పరిరక్షించే యోధుడి పాత్రగా దీనిని తీర్చి దిద్దారని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ ఇవాళ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతేకాదు జనసేన పార్టీ అధినేత కూడా. అయితే ఈ సినిమాకు రాజకీయ రంగు పులమకుండా జాగ్రత్త పడే ప్రయత్నం నిర్మాత ఎ.ఎం. రత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 21న హైదరాబాద్ లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ హాజరు కావాల్సిందిగా కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ మంత్రి ఈశ్వర్ ఖంద్రేను ఎ.ఎం. రత్నం స్వయంగా కలిసి ఆహ్వానించడం ఆ అందులో భాగంగా జరిగిందే అంటున్నారు. అయితే ఈ కలయికలో మరో అంతర్యం కూడా ఉంది. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం మల్టీప్లెక్స్ థియేటర్లతో పాటు సింగిల్ స్క్రీన్స్ టిక్కెట్ రేట్స్ రూ. 200లకు మించకూడదనే నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా ప్రకటించింది. అది కనక అమలులోకి వస్తే 'హరిహర వీరమల్లు' కలెక్షన్స్ మీద భారీ ప్రభావం పడే ఆస్కారం ఉంది. కర్ణాటక ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని అటు తమిళనాడు, ఇటు తెలంగాణ ప్రభుత్వాలు కూడా తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. దాంతో ముందుగానే అక్కడి అటవి, పర్యావరణ శాఖామంత్రి ఈశ్వర్ ను ఖంద్రేను రత్నం కలిసి ఉంటారని అనుకుంటున్నారు.
నిర్మాత ఎ.ఎం. రత్నం కోరికను మన్నించి కర్ణాటక కాంగ్రెస్ పార్టీ మంత్రి ఈశ్వర్ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరైతే... పనిలో పనిగా ఇటు తెలంగాణలోని కాంగ్రెస్ మంత్రులు, అటు ఏపీలో టీడీపీ మంత్రులు పాల్గొనవచ్చు. బీజేపీతో పవన్ కళ్యాణ్ కు ఉన్న అనుబంధంతో ఆ పార్టీ నేతలు కూడా పిలిస్తే ఈ వేడుకకు హాజరవుతారు. ఆ రకంగా పార్టీలకు అతీతంగా హిందూ ఎజెండాతో ఈ ప్రీరిలీజ్ వేడుక జరిగే ఆస్కారం కనిపిస్తోంది. మొత్తం మీద భారీ వ్యయంతో, ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 'హరిహర వీరమల్లు'ను విజయపథంలోకి తీసుకెళ్ళడానికి నిర్మాత ఎ.ఎం. రత్నం గట్టి కసరత్తే చేస్తున్నారు.
Also Read: Anupama Parameswaran: స్టార్ హీరోయిన్స్ కే తప్పలేదు.. నువ్వెంత అనుపమ
Also Read: House Full 5: మీ సహానాన్ని పరీక్షించే సినిమా.. ఓటీటీకి వచ్చేసింది