Takshakudu: తక్షకుడిగా.. ఆనంద్ దేవరకొండ! ఇంత షాకిచ్చాడేంటి
ABN, Publish Date - Oct 13 , 2025 | 12:17 PM
ఆనంద్ దేవరకొండ హీరోగా నాగవంశీ సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే.
ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) హీరోగా నాగవంశీ (Naga Vamsi) సితార ఎంటర్‌టైన్‌మెంట్ (Sithara Entertainments) బ్యానర్‌లో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ఎదుటకు రానుంది. మొదట ఈ చిత్రం కోసం హీరోయిన్‌గా బేబీ ఫేం వైష్ణవి చైతన్యను ఫైనల్ చేసిన మేకర్స్ ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకుని బాలీవుడ్ లా పతా లేడీస్ ఫేమ్ నితాన్షీ గోయల్ (Nitanshi Goel)ను కథానాయికగా టాలీవుడ్‌కు పరిచయం చేస్తున్నారు.
గతంలో ఆనంద్‌తో మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే ఫక్తు ఫ్యామిలీ డ్రామా సినిమాతో తెలుగు కుటుంబాలను ఆకట్టుకున్న వినోద్ అనంతోజు (Vinod Anantoju) దర్శకత్వం వహిస్తున్నాడు. అంతేగాక మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja)కూతురు మోక్షద (Mokshadha Bhupatiraju) ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఈ సినిమాతో ఫిల్మ్ ప్రొడక్షన్‌లోకి అడుగుపెడుతుండడం విశేషం. అయితే ఇప్పటివరకు సినిమా విషయాలు, టైటిల్‌కు సంబంధించిన ఎటువంటి విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు.
అయితే.. తాజాగా నెట్‌ఫ్లిక్స్ (Netflix) తన ఒప్పందాలు చేసుకున్న (ఓటీటీ హక్కులు పొందిన) పోస్ట్ రిలీజ్ సినిమాలు, సిరీస్ వివిరాలు అధికారికంగా ప్రకటించారు. ఈనేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ ఫిలింగా ప్రకటిస్తూ తక్షకుడు (Takshakudu) పేరుతో ఈ సినిమా పోస్టర్ రిలీజ్ చేశారు. వేటగాడి చరిత్రలో జింక పిల్లలే నేరస్తులు అనే క్యాప్షన్ ఇచ్చారు. అత్యాశతో మొదలై ప్రతీకారం కోసం చూసే వ్యక్తి కథగా సినిమా ఉంటుందని ట్లు ప్రకటించారు. పోస్టర్‌లో ఆనంద్ లుక్ సైతం గన్ పట్టుకుని ఇంటెన్స్ లుక్ స్టన్నింగ్‌గా ఉంది.
ఇదిలాఉంటే.. త్వరలో తక్షకుడు (Takshakudu) సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్‌కు తీసుకు వస్తున్నట్లు తెలపడంతో మరి ఈ సినిమాను థియేటర్లకు తీసుకురాకుండా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేస్తారా ఏంటనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కొద్ది రోజులు అయితే గానీ ఈ సినిమా గురించి పూర్తి విషయాలు బయటకు రావు. అప్పటివరకు ఎదురు చూడాల్సిందే.