Hyderabad: డ్రగ్స్ తీసుకునే వారిని.. ఇండస్ట్రీ నుంచి బహిష్కరిస్తాం
ABN, Publish Date - Jun 26 , 2025 | 09:37 PM
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినం సందర్భంగా గురువారం శిల్పకళా వేదికలో ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
డ్రగ్స్ రహిత తెలంగాణే ప్రజాప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి (CM RevanthReddy) అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినం సందర్భంగా గురువారం శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. యువత గంజాయి, డ్రగ్స్‌కు బానిసలైతే దేశం మనుగడకే ప్రమాదమని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఉద్యమాలకు అడ్డగా నిలిచిన తెలంగాణ.. డ్రగ్స్ కు అడ్డగా మారుతుంటే చూస్తు ఊరుకోబోమన్నారు. గంజాయి డ్రగ్స్ విక్రయిస్తే వెన్ను విరుస్తామని ఇప్పటికే స్పష్టం చేశామని.. ఇందుకోసం ఈగల్ వ్యవస్థను కొత్తగా ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఇకపై నార్కొటిక్ బ్యూరోను.. ఈగల్‌గా పిలుస్తాం.. ఎక్కడ గంజాయి కనిపించినా ఈ ఈగల్ పట్టుకుంటుందని తెలిపారు. స్కూళ్లు, కళాశాలల వద్ధ డ్రగ్స్ దొరికితే యజమాన్యాలపై కూడా కేసులు పెట్టాలని, డ్రగ్స్ వంటి అసాంఘిక అంశాలపై విద్యాసంస్థలు అవేర్ నెస్ సమావేశాలు నిర్వహించాలని ఆదేశిస్తున్నామన్నారు.
తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలనకు ఉద్యమ స్ఫూర్తితో అందరు ముందుకు రావాలన్నారు.148 కోట్ల జనాభాలో 68 శాతం 40ఏళ్ల లోపు వారే ఉన్నారని..అయినా కూడా ఒలంపిక్స్ లో ఒక్క స్వర్ణ పతాకం కోసం ఎదురుచూపులు తప్పడం లేదన్నారు. తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలనకు, వన్ ట్రిలియన్ సాధనకు తెలంగాణ రైజింగ్ తో ముందుకెలుతున్నామన్నారు. తెలంగాణ యువతను డ్రగ్స్ కు దూరంగా కేరీర్ వైపు మళ్లించేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ రైజింగ్ తో ప్రపంచ దేశాలతో పోటీ పడబోతున్నామన్నారు, విద్యార్థుల, యువతలో క్రీడానైపుణ్యం పెంచేందుకు యంగ్ ఇండియా స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చామన్నారు. తెలంగాణను దేశానికి స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దాలన్నదే మా ఆశయమన్నారు. ఈ సందర్భంగా ఈగల్ లోగోను సీఎం ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన హీరోలు రామ్‌చరణ్, ఆయన తండ్రి చిరంజీవి, నాలాగే నల్లమల నుంచి వచ్చిన విజయ్ దేవరకొండ వంటి వారిని స్పూర్తిగా తీసుకుని యువత తమతమ రంగాల్లో క్రమశిక్షణతో రాణించేందుకు కృషి చేయాలని సూచించారు. హీరోలు సినిమా పాత్రలనే కాదు.. నిజజీవితాలను స్ఫూర్తిగా తీసుకోవాలని, ఎన్ని కష్టాలు ఎదురైనా మెగాస్టార్ చిరంజీవి డ్రగ్స్ జోలికి వెళ్లలేదని చెప్పారు. హీరోలు రామ్‌చరణ్, విజయ్ దేవరకొండ ఇంత పెద్ద సాయికి ఎదిగారంటే వాళ్లు డ్రగ్స్ జోలికి వెళ్లకుండా ఉండటమే కారణమని ఉద్ఘాటించారు. నాతో పాటు.. హీరో విజయ దేవరకొండ కూడా నల్లమల అడవి నుంచే వచ్చారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు ఇండస్ట్రీలో డ్రగ్స్ తీసుకునే వారిని ఇండస్ట్రీ నుంచి బహిష్కరిస్తామన్నారు. ఇప్పటికే మలయాళ ఇండస్ట్రీలో బహిష్కరిస్తున్నారని.. త్వరలో టాలీవుడ్‌లో కూడా ఈ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.