IBOMMA Ravi: ఎలాంటి పైరసీకి.. పాల్పడలే! చట్ట ప్రకారం.. ఏమైనా చేసుకోండి!
ABN, Publish Date - Nov 25 , 2025 | 06:25 AM
పైరసీ కేసులో అరెస్టయిన ఐ బొమ్మ రవి (IBOMMA Ravi).. ఐదు రోజుల కస్టడీ సోమవారంతో ముగిసింది.
పైరసీ కేసులో అరెస్టయిన ఐ బొమ్మ రవి (IBOMMA Ravi).. ఐదు రోజుల కస్టడీ సోమవారంతో ముగిసింది. విచారణలో రవి రిజిస్ట్రేషన్ చేసుకున్న డొమైన్స్ గురించి, వాటి నిర్వహణ గురించి పోలీసులు కీలక సమాచారం రాబట్టినట్లు తెలిసింది. ఐబొమ్మ వెనక తానొక్కడినే ఉన్నానని.. చట్టప్రకారం తనను ఏమైనా చేసుకోండంటూ ఇమ్మడి రవి సమాధానమిచ్చినట్లు సమాచారం. అయితే తాను ఎలాంటి పైరసీకి పాల్పడలేదంటూ.. పైరసీకి సంబంధించి నోరు విప్పలేదని తెలిసింది. బెట్టింగ్ యాప్స్ ద్వారానే రూ.కోట్లలో డబ్బులు వచ్చాయని.. వాటితో జల్సా చేశానని చెప్పినట్లు సమాచారం.
ఐ బొమ్మ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం చెల్లింపులన్నీ క్రిప్టో కరెన్సీ ద్వారా జరిగినట్లు గుర్తించిన పోలీసులు.. రవి సుమారు రూ.80-100 కోట్లు కొల్లగొట్టినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. ఈ మేరకు 35 బ్యాంకు ఖాతాల్లో పలు కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం. 1ఎక్స్‌బెట్ సహా 15 బెట్టింగ్ యాప్‌ల వరకు రవి ప్రచారం చేసినట్లు.. ఒక్క 1ఎక్స్‌బెట్ ద్వారానే ఎక్కువ మొత్తంలో డబ్బు వచ్చినట్లు పోలీసులు ఓ అంచనాకు వచ్చినట్లు తెలిసింది. అయితే రవి తన స్నేహితుడు నిఖిల్, చెల్లెలుకు మాత్రమే డబ్బులు బదిలీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. మిగిలిన లావాదేవీలన్నీ ఇతరుల ఖాతాలకు సంబంధించినట్లుగా తేలింది.
ఇప్పటివరకు రూ.30 కోట్ల మొత్తానికి ఆధారాలు లభించగా.. మిగిలిన అన్ని బ్యాంకుల నుంచి ఆధారాలు వస్తే రూ.100 కోట్ల వరకు తేలే అవకాశమున్నట్లు పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. యాడ్ ఏజెన్సీలతో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సంప్రదింపులు, సినిమాల కొనుగోలు సంబంధించిన వివరాలన్ని టెలీగ్రామ్ యాప్ ద్వారా నిర్వహించినట్లు ఆధారాలు సేకరించారు. రవి నుంచి ఇప్పటివరకు సేకరించిన సమాచారంపై సీపీ సజ్జనార్ మంగళవారం మీడియా సమావేశం వెల్లడించే అవకాశముంది.
చంచల్‌గూడ జైలుకు తరలింపు..
రవి ఐదు రోజుల కస్టడీ ముగియడంతో.. సాయంత్రం 5:30కు తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇటు రవి తరఫు న్యాయవాది శ్రీనాథ్ మాట్లాడుతూ.. తన క్లయింట్‌పై మొత్తం 5 కేసులు నమోదయ్యాయని, కేవలం ఒక్క కేసులో మాత్రమే న్యాయస్థానం కస్టడీకి అనుమతించిందన్నారు. ఇప్పుడు కస్టడీ ముగియడంతో రవికి బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశామని వెల్లడించారు. మంగళవారం ఆ పిటిషన్‌పై కోర్టు విచారణ జరపనుందన్నారు. రవికి కచ్చితంగా కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందని అన్నారు.