Ibomma: బెట్టింగ్ కేసు పట్టించింది.. ;ఐ బొమ్మ; నిర్వాహకుడు రవి అరెస్ట్
ABN, Publish Date - Nov 16 , 2025 | 04:40 PM
ఐ బొమ్మ (Ibomma) నిర్వాహకుడు ఇమ్మడి రవి (Immadi Ravi)ని శనివారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు (Hyd Cyber Crime Police) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఐ బొమ్మ (Ibomma) నిర్వాహకుడు ఇమ్మడి రవి (Immadi Ravi)ని శనివారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు (Hyd Cyber Crime Police) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే రవిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పైరసీ కింగ్ పిన్‌గా ఇమ్మడి రవి మారారని.. గతంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసి.. ఆ తర్వాత నుంచి పైరసీని తన మార్గంగా ఎంచుకున్నారని వివరించారు. ముంబై యూనివర్సిటీలో ఆయన ఎంబీఏ చదివారని తెలిపారు. 1Xbet బెట్టింగ్ యాప్ నిర్వాహకులు, ఐబొమ్మ మధ్య భారీగా లావాదేవీలు జరిగినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంతో భారీగా డబ్బులు తీసుకున్నారని వివరించారు. బెట్టింగ్ కేసు దర్యాప్తు జరుపుతుండగా ఐ బొమ్మ లింక్ దొరికిందని వెల్లడించారు. నెదర్లాండ్, కరేబియన్ దీవులకు వెళ్లే ముందు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీ నెలకొల్పారని.. వెబ్‌డిజైన్ సర్వీస్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పి.. ఆ తర్వాత సాఫ్ట్‌వేర్ కంపెనీని ఆయన స్థాపించారని వివరించారు.
ER infotech అనే సాఫ్ట్‌వేర్ కంపెనీకు రవి సీఈవోగా ఉన్నారని.. శనివారం ట్రేస్ చేసి కూకట్‌పల్లి రెయిన్ బో విస్టాలో అరెస్ట్ చేశామని తెలిపారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచామని... విచారణ అనంతరం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్‌ని న్యాయస్థానం విధించిందని స్పష్టం చేశారు. రేపు(సోమవారం) నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ వేయనున్నామని వివరించారు. అయితే, ఇమ్మడి రవిని వారం రోజుల పాటు తమ కస్టడికి సీసీఎస్ పోలీసులు కోరే అవకాశాలు ఉన్నాయి.