Asian Sunil: మరో రెండేళ్ళలో హైదరాబాద్ లో బిగ్గెస్ ఐమాక్స్

ABN , Publish Date - Jun 09 , 2025 | 02:19 PM

హైదరాబాద్ లో దేశంలోనే రెండో అతి పెద్ద ఐమాక్స్ అవతరించబోతోంది. మరో రెండేళ్ళలో దానిని ప్రారంభిస్తామని ఏసియన్ సునీల్ చెబుతున్నారు.

సింగిల్ స్క్రీన్స్ ను మూసివేయాల్సి వస్తోందని కొందరు ఎగ్జిబిటర్స్ ఆవేదన వక్తం చేస్తున్న సమయంలోనే అంగరంగ వైభవంగా, సకల సదుపాయాలతో భారీ స్థాయిలో మల్టిప్లెక్స్ థియేటర్ల నిర్మాణం జరుగుతోంది. థియేటర్లకు జనాలు రావడం లేదని ఓ పక్క కొందరు మొత్తుకుంటున్న టైమ్ లోనే స్టార్ హీరోలు (Star Heroes) సైతం ఎగ్జిబిటర్స్ గా మారిపోయి మల్టీ ప్లెక్స్ థియేటర్ల నిర్మాణంలో భాగస్వాములు అవుతున్నారు. అలా థియేటర్లలోకి స్టార్స్ ను తీసుకొస్తున్నవారిలో ఏసియన్ సునీల్ నారంగ్ (Asian Sunil Narang) ఒకరు. ఇప్పటికే ఆయన మహేశ్ బాబు (Mahesh Babu), విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), అల్లు అర్జున్ (Allu Arjun) తదితర నటులతో కలిసి సినిమా థియేటర్లు నిర్మించారు. అలానే రాబోయే రోజుల్లో హైదరాబాద్ లోని సినీ వీక్షకులకు సరికొత్త అనుభూతిని కల్గించేందుకు భారీ ఎత్తున ఓ ఐమాక్స్ (IMAX) థియేటర్ ను నిర్మిస్తున్నారు.


ఇప్పటికే తెలంగాణలోని పలు నగరాల్లో ఏసియన్ సునీల్ కు మల్టీప్లెక్ట్స్ థియేటర్లు ఉన్నాయి. దీనితో పాటు ఇప్పుడు హకీమ్ పేట్ ఎయిర్ బేస్ దగ్గర లో ఐమాక్స్ థియేటర్ ను నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన తమ చిత్రం 'కుబేర' ప్రమోషన్స్ సమయంలో తెలిపారు. ఈ ఐమాక్స్ థియేటర్ స్క్రీన్ 70 అడుగులు ఉంటుందని ఆయన చెప్పారు. ఇది భారతదేశంలోనే రెండో అతి పెద్ద ఐమాక్స్ థియేటర్ అని అన్నారు. ప్రస్తుతం ముంబై వడాలాలోని ఐమాక్స్ అతి పెద్దది. దీని తర్వాత స్థానంలో ఏసియన్ సునీల్ నిర్మిస్తున్న థియేటర్ రాబోతోంది. ఇది పీసీఎక్స్ సైజ్ కంటే కూడా పెద్దగా ఉండబోతోంది. అలానే ఢిల్లీలోని ప్రియా పీవీఆర్ తరహాలో ప్రీమియం సింగిల్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ ను ఈ ఐమాక్స్ థియేటర్ ద్వారా పొందొచ్చు. ఈ గ్రాండ్ ఆడిటోరియంలోకి గ్రౌండ్ లెవల్ ఎంట్రీ ఉండబోతోంది. దీనికి తోడు ఈ భారీ ఐమాక్స్ స్క్రీన్ తో పాటు గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఐదు యురోపియన్ స్టైల్ మినీ థియేటర్లను నిర్మిస్తున్నారు. ఈ చిన్న థియేటర్లతో పాటు బొటెక్, డైనింగ్ రెస్టారెంట్స్, డిజైనర్ స్టోర్స్ వంటివి ఉంటాయి. ప్రస్తుతం చెన్నయ్ లోని పలాజ్జో సినిమాస్ ఈ తరహాలో ఉన్నాయి. ఈ థియేటర్ల సముదాయ నిర్మాణం పూర్తి కావడానికి మరో రెండేళ్ళు పడుతుంది. ఇందులోని ఐమాక్స్ ను గ్రాండ్ వేలో 2027లో ఓపెనింగ్ చేయబోతున్నట్టు సునీల్ నారంగ్ తెలిపారు. హైదరాబాద్, దాని బయట ఉన్న సినీ ప్రేమికులకు ఈ ఐమాక్స్ ఓ గొప్ప అనుభూతిని కలిగిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Nayanthara-Vignesh Shivan: 3వ వ‌సంతంలోకి.. నయన్, విఘ్నేశ్ జంట‌! ఘ‌నంగా సెల‌బ్రేష‌న్స్

Also Read: Sunil: విజయ్ మిల్టన్ దర్శకత్వంలో.. సునీల్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Jun 09 , 2025 | 02:42 PM