Hit - The 3rd Case: విజయోత్సవం... వివాదం...
ABN, Publish Date - May 10 , 2025 | 03:17 PM
నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం 'హిట్ -3'. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ శుక్రవారం జరిగాయి. అయితే ఈ కార్యక్రమంలో నాని చేసిన వ్యాఖ్యలను నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.
నేచురల్ స్టార్ నాని (Nani) నటించిన మోస్ట్ వయొలెంట్ మూవీ 'హిట్ -3' (Hit -3)కి డివైడ్ టాక్ వచ్చినా... కమర్షియల్ గా ఆ సినిమా పాసైపోయింది. దాంతో మేకర్స్ సెలబ్రేషన్స్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ వేదికపై నుండి హీరో కమ్ ప్రొడ్యూసర్ నాని ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేశారు. శత్రువులు మనకు క్రియేట్ చేసిన ప్రాబ్లమ్ కు మన సైన్యం చాలా హుందాగా బదులిచ్చిందని కితాబిచ్చారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ ఆ తర్వాత నాని చెప్పిన మాటలకు ఇప్పుడు అతన్ని ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు. వాళ్ళు చేసిన ఓ పనివల్ల ఇండియాలో ఒక చోట సక్సెస్ సెలబ్రేషన్స్ క్యాన్సిల్ అయ్యిందనే శాటిస్ ఫ్యాక్షన్ కలగనివ్వకూడదనే తమ సక్సెస్ మీట్ ను ముందు అనుకున్నట్టే నిర్వహించామని నాని పాకిస్తాన్ ను ఉద్దేశించి చెప్పారు. ఓ పక్క భారత్ పై పాకిస్తాన్ అతి దారుణంగా దాడి చేసి సామాన్య పౌరులను హతమార్చుతోంది. సరిహద్దు జిల్లాలోని జనావాసాలపై దాడులు జరుపుతోంది. ఇలాంటి తీవ్రమైన పరిస్థితుల నడుమ కొన్ని సినిమాల విడుదలను నిర్మాతలు వాయిదా వేస్తున్నారు. కమల్ హాసన్ లాంటి వారు తమ సినిమా ఆడియో వేడుకలను వాయిదా వేశారు. ఐపీఎల్ వంటి ప్రతిష్ఠాత్మక క్రికెట్ మ్యాచ్ సైతం రద్దు అయిపోయింది. ఈ నేపథ్యంలో నాని 'హిట్ -3' సెలబ్రేషన్స్ గురించి పాక్ మీద చేసిన వ్యాఖ్యలు చాలా అతిగా ఉన్నాయని కొందరు కామెంట్ చేస్తున్నారు. సక్సెస్ సెలబ్రేషన్స్ ను వాయిదా వేయవద్దని నాని భావించడంలో తప్పులేదని, కానీ దానికి పాక్ శాటిస్ ఫ్యాక్షన్ చెందడం ఇష్టం లేక ఇలా చేశానని మాట్లాడటం కాస్తంత అతిగా ఉందని నెటిజన్స్ విమర్శిస్తున్నారు. 'హిట్ -3' విజయాన్ని, విజయోత్సవాన్ని ఎవరూ తక్కువ చేయడం లేదని, కానీ తమ కార్యక్రమాన్ని వాయిదా వేయకపోగా ఇలా ఎక్స్ ట్రాలు మాట్లాడటం ఏమిటని అంటున్నారు.
Also Read: Janhvi Kapoor: మనది దూకుడు కాదు.. దశాబ్దాల బాధకు సమాధానం
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి