Rewind 2025: ఈ ఏడాది ఫేడవుట్ అయిన హీరోయిన్స్

ABN , Publish Date - Dec 27 , 2025 | 07:28 PM

ఇండస్ట్రీ.. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ రోజుకో హీరోయిన్ పరిచయమవుతుంది. లక్కున్నంత కాలం అందలాలే... హిట్సుంటే ఛాన్సులు - లేదంటే క్యాన్సిల్స్.

Rewind 2025

Rewind 2025: ఇండస్ట్రీ.. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ రోజుకో హీరోయిన్ పరిచయమవుతుంది. లక్కున్నంత కాలం అందలాలే... హిట్సుంటే ఛాన్సులు - లేదంటే క్యాన్సిల్స్... అదే గ్లామర్ ఫీల్డ్ ఫార్ములా... హిట్స్ ను అందుకోలేక.. ఛాన్స్ లు పట్టలేక ఈ యేడాది ఫేడవుట్ అయిన హీరోయిన్స్ ఎవరో చూద్దాం...

అనుష్క అలా... సమంత ఇలా...

anushka.jpg

అందం, అభినయం కలబోసిన నటి అనుష్క శెట్టి. టాప్ వన్ హీరోయిన్స్ లిస్ట్ లో మొదటి వరుసలో ఉండే స్వీటీ.. 'సైజ్ జీరో' సినిమా తరువాత బరువు పెరగడం వలనో.. లేక అనారోగ్య సమస్యల కారణంగానో తెలియదు కానీ, సోషల్ మీడియాలో కూడా కనిపించడం మానేసింది. కనీసం ఏడాదికి ఒక్క సినిమాతో అయినా వస్తుంది అనుకుంటే రెండేళ్లకు ఒక సినిమాతో కనిపిస్తోంది. దీంతో ప్రేక్షకులు స్వీటీ ఉంది అనే విషయాన్ని మరచిపోతున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలిగిన సమంతను కూడా అదే కోవలో లెక్కేస్తున్నారు.. వరుస ఫ్లాపుల తరువాత అనారోగ్యంతో ఒక ఏడాది సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. అంతే.. ఇప్పటివరకు ఆమె సిల్వర్ స్క్రీన్ మీద కనిపించలేదు. మధ్యలో నిర్మాతగా 'శుభం'లో ఒక చిన్న రోల్ చేసింది. అది కూడా ఆశించిన విజయాన్ని దక్కించుకోలేదు. అలా సామ్ తెలుగు ఇండస్ట్రీకి దూరమైపోయింది.

ఐటెమ్స్ కే పరిమితమైన తమన్నా

tamanna.jpg

ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ అంటే అనుష్క, సమంత, తమన్నా అంటూ చెప్పేవారు. ఇప్పుడు ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్స్ అంటే వీరి పేర్లు గుర్తు చేసుకుంటున్నారు.. . కొత్త తరం హీరోయిన్లకు వీరు దారి ఇస్తున్నారో.. లేక ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్స్ అని ఛాన్స్ వీరికి రావడం లేదో తెలియదు కానీ, టాలీవుడ్ లో ఈ హీరోయిన్స్ ఎవరూ కనిపించడం లేదు. మిల్కీ బ్యూటీ తమన్నా ఎప్పుడో టాలీవుడ్ ని వదిలి బాలీవుడ్ కి చెక్కేసింది. అక్కడ అందాల అరబోత చేస్తూ సినిమాలు, వెబ్ సిరీస్ లు చేసి ఏదో స్టార్ అనిపించుకోవాలని ట్రై చేసింది. చివరకు ఐటెమ్ సాంగ్స్ చేస్తూ కాలం గడిపేస్తుంది.

పెళ్ళయిన భామలు...

kajal.jpg

కాజల్.. ఈ పేరుకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సాధారణంగా హీరోయిన్లకు పెళ్లి తరువాత అందం తగ్గుతుంది అంటారు. కానీ, తల్లి అయినా కూడా తరగని అందం కాజల్ అగర్వాల్ సొంతం. టాలీవుడ్ లో సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా హీరోలందరితో నటించిన కాజల్ ను ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ ఏడాది కేవలం 'కన్నప్ప' సినిమాలో పార్వతిదేవిగా కనిపించింది. 'కెరటం' సినిమాతో రకుల ప్రీత్ సింగ్ టాలీవుడ్ కి పరిచయమైంది. అప్పటి నుంచి టాలీవుడ్ టాప్ హీరోయిన్ లిస్ట్ లో కొనసాగుతూనే వచ్చింది. పెళ్ళయిన తరువాత కనుమరుగైంది. ప్రస్తుతం హిందీలో అడపాదడపా సినిమాలు చేస్తూ.. సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ కనిపిస్తోంది. తెలుగు ప్రేక్షకులు పూర్తిగా రకుల్ ని మర్చిపోయారు.

ఆ ఇద్దరి అడ్రెస్ ఎక్కడ...!?

pooja.jpg

ఇండస్ట్రీలో టాలెంట్ ఎంత ఉన్నా.. కొంచెం అయినా లక్ అనేది ఉండాలి. అది ఉంటేనే సక్సెస్ అవ్వగలరు. అందుకు బెస్ట్ ఉదాహరణ పూజా హెగ్డే. రాధే శ్యామ్ సినిమాకు ముందు వరకు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన పూజా.. ప్రస్తుతం వరుస పరాజయాలతో సాగుతోంది... ఒకటి కాదు రెండు కాదు.. అరడజన్ సినిమాల కన్నా ఎక్కువ ప్లాప్ లను మూటకట్టుకుంది. కృష్ణగాడి వీరప్రేమ గాధ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మెహరీన్ ఫిర్జాదా. మెహరీన్ అప్పుడప్పుడు హిట్స్ అందుకుంటూ కొనసాగింది. ఎఫ్2 సినిమాలో హనీ పాత్రతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఎఫ్ 2 లో బొద్దుగా ముద్దుగా ఉన్న మెహరీన్.. ఎఫ్ 3 లో బక్కచిక్కి హాట్ గా కనిపించి మెప్పించింది. ఎంగేజ్మెంట్ ను క్యాన్సిల్ చేసుకున్న మెహరిన్ నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోస్ ని షేర్ చేస్తూ అభిమానులకు మాత్రం దగ్గరగానే ఉంటోంది.

సౌండ్ చేయని శ్రుతి హాసన్

haasan.jpg

శ్రుతి హాసన్ తెలుగులో 'సలార్' తరువాత ఈ భామ ఎక్కడా కనిపించలేదు. కానీ, తమిళ 'కూలీ' సినిమాలో మెరిసింది. అది తెలుగులో కూడా రిలీజ్ అయినా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఈ ఏడాది కొద్దో గొప్పో అభిమానులు శ్రుతిని గుర్తించారు అంటే అది 'వారణాసి' ఈవెంట్ లోనే. రాజమౌళి - మహేశ్ బాబు కాంబోలో వస్తున్న ఈ సినిమాలో "సంచారీ..." సాంగ్ ని పాడి అలరించింది.

విజయం కోసం వేచి చూస్తున్న రాశీ ఖన్నా

raashii.jpg

ఒకప్పుడు ముద్దుగా, బొద్దుగా ఉండే రాశీ ఖన్నా.. ఇప్పుడు బక్కచిక్కి మరింత హాట్ గా తయారయ్యింది. ఆమె కెరీర్ లో హిట్లను వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు. తెలుగు నుంచి తమిళ్.. అక్కడ నుంచి హిందీ ఇలా ట్రావెల్ చేస్తూనే వెళ్తుంది. కానీ, విజయాలను మాత్రం దక్కించుకోలేకపోతుంది. ప్రస్తుతం అమ్మడి ఆశలన్నీ 'ఉస్తాద్ భగత్ సింగ్' పైనే పెట్టుకుంది. ఇది కూడా పోతే రాశీ ఇక టాలీవుడ్ లో ఆశలు వదిలేసినట్టే. అలాగే గ్లామర్ తో మురిపించిన నభా నటేశ్, కృతి శెట్టి సైతం ఈ యేడాది ఏ లాంటి ఛాన్సులు పట్టలేకపోయారు.

తెలుగందం అంజలి ఎక్కడ.. ?

anjali.jpg

అచ్చ తెలుగందం అంజలి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది 'గేమ్ ఛేంజర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో అంజలి ఆశలు అడియాశలయ్యాయి. ఈ సినిమా తరువాత అంజలి మొత్తానికే కనిపించడం మానేసింది. తెలుగులో ఈ చిన్నది ఫేడ్ అవుట్ అయ్యిందని చెప్పొచ్చు. తమిళ్ లో మాత్రం వరుస అవకాశాలు అందుకుంటోంది. ఇక్కడ పేర్కొన్న భామల్లో ఎవరెవరు 2026లో ఛాన్సులు పట్టేస్తారో చూద్దాం...

Updated Date - Dec 27 , 2025 | 07:28 PM