Pawan Kalyan: వీరమల్లు వెనుక ముగ్గురు దర్శకులు!
ABN , Publish Date - May 06 , 2025 | 02:51 PM
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'హరిహర వీరమల్లు'కు మంగళ వారంతో గుమ్మడికాయ కొట్టబోతున్నారట. అయితే ఈ కీలక సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం షూటింగ్ లో పవన్ పక్కనే ఉన్నారని సమాచారం.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు ఎప్పుడూ దన్నుగా ఉండే మనిషి దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas). తాను ఎంత బిజీగా ఉన్నా... పవన్ నుండి పిలుపువస్తే చాలు... సాయానికి సిద్ధంగా ఉంటాడు త్రివిక్రమ్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'హరిహర వీరమల్లు' మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో త్రివిక్రమ్ సపోర్ట్ గా నిలిచినట్టు వార్తలు వస్తున్నాయి. 'హరిహర వీరమల్లు' (Harihara Veeramallu) ను ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం (A.M. Ratnam) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. క్రిష్ (Krish) దర్శకత్వంలో ఈ సినిమా దాదాపు పూర్తయ్యింది. అయితే రెండు భాగాలుగా దీన్ని విడుదల చేయాలని మార్చిన తర్వాత క్రిష్ 'ఘాటీ' ప్రాజెక్ట్ కు వెళ్ళిపోయాడు. ఐదేళ్ళ క్రితం మొదలైన ఈ సినిమా నుండి క్రిష్ తప్పుకున్న తర్వాత ఎ.ఎం. రత్నం తనయుడు జ్యోతికృష్ణ (Jyothi Krishna) దీన్ని కంప్లీట్ చేసే బాధ్యతను భుజానకెత్తుకున్నాడు. బ్యాలెన్స్ వర్క్ ను పూర్తి చేశాడు. అయితే పవన్ కళ్యాణ్ తో తీయాల్సిన కీలకమైన ఒక సన్నివేశం మాత్రం మిగిలిపోయింది. దీనికోసం దాదాపు రెండు మూడు నెలలుగా దర్శకనిర్మాతలు వేచిఉన్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ డేట్స్ కేటాయించడంతో ఆ వర్క్ ను హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరించారు. మంగళవారానికి పవన్ కళ్యాణ్ పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తయిపోతుంది. ఐదేళ్ళ క్రితం ఎక్కడైతే 'హరిహర వీరమల్లు' షూటింగ్ మొదలైందో, అక్కడే గుమ్మడికాయ కొట్టబోతున్నారు. అయితే... ఈ కీలక సన్నివేశాల చిత్రీకరణ సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా పాల్గొన్నారని, ఓ రకంగా ఆయన దర్శకత్వ పర్యవేక్షణ చేశారని టీమ్ మెంబర్స్ చెబుతున్నారు. సహజంగా పవన్ కల్యాణ్ నటించే సినిమాలలో త్రివిక్రమ్ ప్రత్యక్షంగా పాలుపంచుకోక పోయినా ఏదో రకంగా తన వంతు సాయం చేస్తుంటారు. మాటలు రాయడమో, స్క్రీన్ ప్లే సమకూర్చడమే చేస్తారు. సో... అలా 'హరిహర వీరమల్లు'కు క్రిష్, జ్యోతికృష్ణతో పాటు త్రివిక్రమ్ సైతం తన వంతు కంట్రిబ్యూషన్ ఇచ్చినట్టు అయ్యింది.
అన్ని అనుకున్నట్టు జరిగితే మే 30న 'హరిహర వీరమల్లు' విడుదలైనా ఆశ్చర్యం లేదని తెలుస్తోంది. అదే జరిగితే... విజయ్ దేవరకొండతో నాగవంశీ, త్రివిక్రమ్ నిర్మిస్తున్న 'కింగ్ డమ్' విడుదల వాయిదా పడుతుంది. లేదా ఎ.ఎం. రత్నం టీమ్ కాస్తంత నిదానంగానే వద్దామని అనుకుంటే... జూన్ రెండోవారంలో 'హరిహర వీరమల్లు'ను రిలీజ్ చేస్తారు. సినిమా విడుదల వరకూ ఈ చిత్ర బృందానికి త్రివిక్రమ్ సలహాలూ సూచనలు అందుతాయని, కొత్త టీజర్, ట్రైలర్స్, పబ్లిసిటీ వ్యవహారాలను త్రివిక్రమ్ పర్యవేక్షిస్తారని అంటున్నారు. ఏదేమైనా... త్రివిక్రమ్ కంట్రిబ్యూషన్ తో 'హరిహర వీరమల్లు' పై అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ ఉందని అభిమానులు భావిస్తున్నారు.
Also Read: Varun - Lavanya: జీవితంలో అత్యంత అందమైన పాత్ర.. కమింగ్ సూన్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి