Hari Hara Veera Mallu: డిప్యూటీ సీఎం సినిమా అయినా అందరితో సమానమే
ABN, Publish Date - Jul 19 , 2025 | 03:45 PM
పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమలు’ చిత్రం విడుదల నేపథ్యంలో టికెట్ రేట్లు పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన ‘హరిహర వీరమలు’ (Hari Hara Veera Mallu) చిత్రం విడుదల నేపథ్యంలో టికెట్ రేట్లు పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం (Ticket Rate Hike) తీసుకుంది. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం టికెట్ ధరలు 14 రోజు పాటు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ నిర్మాతం ఏ.ఎం.రత్నం ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా ఆ విజ్ఞప్తిని తిరస్కరించి పది రోజులకు మాత్రమే టికెట్ ధరను పెంచుకునేలా అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీలో డిప్యూటీ సీఎంగా పవన్‌కల్యాణ్ ఉన్నప్పటికీ ప్రత్యేక ధరలను, ఎక్కువ రోజులకు అనుమతి ఇవ్వకుండా అన్ని సినిమాలతో తన సినిమా కూడా సమానం అని సంకేతాన్ని ఇచ్చినట్లు అయింది. ఈసారి టికెట్ ధర పెంపుపై నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయమే స్వయంగా వెలువరించింది.
ఆంధ్రప్రదేశ్ లోని అన్ని థియేటర్ల యాజమాన్యాలకు 23.07.2025 రాత్రి 9.00 గంటలకు ప్రీమియర్ షో కోసం ప్రతి టికెట్‌పై రూ.600/- ప్లస్ GST టిక్కెట్ రేట్లను పెంచడానికి అనుమతి ఇచ్చింది. ఆ తరువాత ప్రతి టికెట్‌పై దిగువ తరగతికి 100/- (GSTతో), ఉన్నత తరగతికి రూ.150/- (GSTతో), మల్టీప్లెక్స్‌కు రూ.200/- (GSTతో) సినిమా విడుదల తేదీ నుంచి 02.08.2025 వరకు పది రోజుల పాటు టిక్కెట్టు పెంపుకు అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు & లైసెన్సింగ్ అథారిటీలు (సినిమాలు) మరియు పోలీసు కమిషనర్లు ఈ విషయంలో అవసరమైన చర్య తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని మెగా సూర్య మూవీస్ పతాకంపై ఏ.ఎం రత్నం నిర్మించారు. ఇందులో చారిత్రాత్మ కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ పోరాట యోధుడిగా కనిపిస్తారు. తొలుత క్రిష్ ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించగా, తర్వాత జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. నిధీ అగర్వాల్ కథానాయిక. అనుపమ్‌ఖేర్, సత్యరాజ్, తనికెళ్ల భరణి, బాబీ డియోల్, నోరా ఫతేహి, నర్గీస్ ఫక్రీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. పవన్ కల్యాణ్ నటించిన తొలి పాన్ ఇండియా సినిమా ఇది. ట్రైలర్లు, పాటలు అలరించడంతో సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ నెల 21న శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది.