Genelias reflections: ప్రేక్షకుల స్పందన కోసం ఎదురుచూస్తున్నా
ABN, Publish Date - Jul 16 , 2025 | 02:57 AM
‘నా కెరీర్ ఆరంభం నుంచి ఎప్పటికప్పుడు కొత్త తరహా పాత్రలే చేస్తూ వచ్చాను. ‘జూనియర్’ చిత్రంలోనూ నా పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ తరహా పాత్రను నేను ఇప్పటివరకూ చేయలేదు...
‘నా కెరీర్ ఆరంభం నుంచి ఎప్పటికప్పుడు కొత్త తరహా పాత్రలే చేస్తూ వచ్చాను. ‘జూనియర్’ చిత్రంలోనూ నా పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ తరహా పాత్రను నేను ఇప్పటివరకూ చేయలేదు. అందుకే ప్రేక్షకుల స్పందన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని నటి జెనీలియా అన్నారు.
గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటిరెడ్డి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘జూనియర్’. రాధాకృష్ణ దర్శకత్వంలో రజనీ కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ శుక్రవారం ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించిన జెనీలియా మీడియాతో ముచ్చటించారు.
దర్శకుడు కథను, నా పాత్రను గురించి వవరించిన తీరు నాకు బాగా నచ్చింది. తప్పకుండా ఇలాంటి సినిమా చేయాలి అనిపించింది. కథలో నా పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. భావోద్వేగాలను పలికించే తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
నేను ఇప్పటివరకూ చాలామంది కొత్తవారితో కలసి నటించాను. కిరీటిలో కొత్తగా ప్రయత్నించాలనే తపన ఎక్కువ. తను మంచి డాన్సర్. సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డారు. దేవి శ్రీప్రసాద్, సెంథిల్‌కుమార్‌తో పనిచేయడం పాత రోజుల్ని గుర్తు చేసింది. శ్రీలీలతో కలసి నటించడం బావుంది.
జీవితం అన్నాక అన్నీ ఉండాలి. అందుకే కెరీర్ మంచి స్థాయిలో ఉన్నప్పుడే సినిమాలకు బ్రేక్ ఇచ్చి పెళ్లి చేసుకున్నాను. చిన్న పాత్రయినా ప్రేక్షకులకు గుర్తుండిపోవాలని కోరుకుంటాను. ఈ మధ్యన సినిమాలు చేయకపోయినా ‘బొమ్మరిల్లు’ హాసిని, ‘హ్యాపీ’లో మధుమతి పాత్రలతోనే ప్రేక్షకులకు ఇప్పటికీ నన్ను గుర్తుంచుకోవడం సంతోషం కలిగిస్తోంది.