Rahul Ramakrishna: ఇక దూరంగా ఉంటా.. నా పని నేను చేసుకుంటా
ABN, Publish Date - Oct 05 , 2025 | 06:58 AM
డంబెల్ డోర్ వచ్చి ఈ పరిస్థితులను చక్కదిద్దాలి’ అంటూ నటుడు రాహుల్ రామకృష్ణ ఎక్స్ వేదికగా చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించాయి.
‘మనం చాలా భయంకరమైన పరిస్థితుల్లో బతుకుతున్నాం. డంబెల్ డోర్ వచ్చి ఈ పరిస్థితులను చక్కదిద్దాలి’ అంటూ నటుడు రాహుల్ రామకృష్ణ ఎక్స్ వేదికగా చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించాయి. బీఆర్‌ఎస్ నాయకుడు కేటీఆర్‌ను ట్యాగ్ చేయడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అంతటితో ఆగకుండా ‘హైదరాబాద్ మునిగిపోయింది. హామీలన్నీ విఫలమయ్యాయి.
వీటన్నింటినీ చక్కదిద్దడానికి ప్రజలు మిమ్మల్ని తిరిగి పిలుస్తున్నారు’ అని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ట్యాగ్ చేస్తూ రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని నటుడు ఇలా మరో పోస్ట్ పెట్టడం చర్చనీయాంశమైంది.
తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో రాహుల్ రామకృష్ణ దిగి వచ్చి వెంటనే తన ఎక్స్ ఖాతాను తొలగించారు. అయినా సోషల్ మీడియాలో వివాదం సద్దుమణగక పోవడంతో శనివారం మళ్లీ ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ఇకపై ట్విట్టర్ యాక్టివిజానికి దూరంగా ఉంటానని, పూర్తిగా సినిమాలపైనే దృష్టిపెడతానని స్పష్టం చేశారు.