Kota Srinivasarao: సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం
ABN , Publish Date - Jul 13 , 2025 | 08:48 AM
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతికి ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు.
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasarao) మృతికి ఏపీ సీఎం చంద్రబాబు (APCM Chandrababu Naidu)) సంతాపం వ్యక్తం చేశారు. వైవిధ్యభరితమైన పాత్రలతో యావత్ ప్రేక్షక లోకాన్ని అలరించి, వారి అభిమానాన్ని దక్కించుకున్న ఆయన మరణించడం బాధాకరం అన్నారు. సుమారు నాలుగు దశాబ్దాల పాటు సినీ, నాటక రంగాలకు ఆయన చేసిన కళా సేవ, పోషించిన పాత్రలు చిరస్మరణీయమని తెలిపారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కోట పోషించిన ఎన్నో మధురమైన పాత్రలు తెలుగు ప్రేక్షకుల మదిలోఎప్పటికి నిలిచి పోతాయని, ఆయన మృతి తెలుగు సినీ ప్రరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు. కోట కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
సినీ రంగానికి తీరని లోటు: రేవంత్‌రెడ్డి
కోట శ్రీనివాసరావు మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. కోట విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని, ఆయన మృతి సినీ రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు. కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటనకు చిరునామాగా నిలిచిన శ్రీ కోట శ్రీనివాసరావు గారు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తెలుగు తెరపై ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్నమైన పాత్రలు పోషించారు. తెలుగు భాష... యాసలపై ఆయనకు మంచి పట్టు ఉంది. ఓ పిసినారిగా, ఓ క్రూరమైన విలన్ గా, ఓ మధ్య తరగతి తండ్రిగా, ఓ అల్లరి తాతయ్యగా… ఏ పాత్రలోనైనా ఒదిగిపోయారు. 1999-2004 మధ్య శాసన సభ్యుడిగా సేవలందించారు.
డైలాగ్ డెలివరీ, హావభావాలతో కట్టిపడేశారు: పవన్ కళ్యాణ్
కోట శ్రీనివాసరావు గారితో మా కుటుంబానికి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. అన్నయ్య చిరంజీవి గారు నటించిన 'ప్రాణం ఖరీదు'తోనే శ్రీ కోట గారు చిత్ర సీమకు పరిచయం అయ్యారు. నా మొదటి చిత్రం 'అక్కడ అమ్మాయి ఇక్క అబ్బాయి'లో ఆయన ముఖ్యమైన పాత్రలో ప్రేక్షకులను అలరించారు. ఆ తరవాత 'గోకులంలో సీత', 'గుడుంబా శంకర్', 'అత్తరింటికి దారేది', 'గబ్బర్ సింగ్' తదితర చిత్రాల్లో కలసి నటించాము. శ్రీ కోట శ్రీనివాసరావు గారు డైలాగ్ చెప్పే విధానం, హావభావాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. శ్రీ కోట శ్రీనివాసరావు గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.
నటరాజ పుత్రులు: బ్రహ్మానందం
‘కోట శ్రీనివాసరావు లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నా. వందల సినిమాల్లో కలిసి నటించాం..నేను, కోట, బాబు మోహన్ కలిసి రోజుకు18 గంటలు నటించాం. కోట మరణం తీరని లోటు. నటన ఉన్నంత కాలం ఆయన ఉంటారు. కోట శ్రీనివాసరావు నటరాజపుత్రులు. ఏ విషయాన్నైనా నిర్మొహమాటంగా మాట్లాడే వ్యక్తి. దాదాపు 4 దశాబ్దాల పాటు మేము కలిసి పనిచేశాం’ అన్నారు
‘కోట’ కూలిపోయింది: తనికెళ్ల భరణి
కోట శ్రీనివాసరావు పార్థివదేహానికి.. నటుడు తనికెళ్ల భరణి నివాళి అర్పించారు. కోటతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ' నాటకాలు అంటే కోట శ్రీనివాసరావుకు ఎనలేని ఆసక్తి. అదే సినీ రంగ ప్రవేశానికి పునాది వేసింది. ఆయనతో వ్యక్తిగతంగా దశాబ్దాలకు పైగా పరిచయం ఉంది. సామాన్య మధ్యతరగతి లో పుట్టి అంచలంచెలుగా సినీ శిఖరంగా ఎదిగిన ఆయన ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం. పోషించిన ప్రతి పాత్ర సంపూర్ణ నటుడిగా ఆయనకు గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు సినీ పరిశ్రమ ‘కోట’ కూలిపోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్న: అన్నారు.
తీపి జ్ఞాపకాలు: రవి తేజ
‘కోట శ్రీనివాసరావు గారిని చూస్తూ, ఆరాధిస్తూ.. ఆయన్నుంచి నేర్చుకుంటూ పెరిగాను. ఆయన నా కుటుంబంలో వ్యక్తిలాంటి వారు. ఆయనతో కలిసి పని చేసిన క్షణాలు.. నాకు తీపి జ్ఞాపకాలు. కోట శ్రీనివాసరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’ అన్నారు.
బాధ మిగిల్చి వెళ్లిపోయారు: సాయి దుర్గ తేజ్
'విలక్షణ నటుడు, శ్రీ కోట శ్రీనివాసరావు గారి మరణం తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే కాదు ఇండియన్ సినిమాకు తీరని లోటు. ఎన్నో సినిమాలలో ఆయన నటన అద్భుతం. స్క్రీన్ మీద కొన్నిసార్లు భయపెట్టి.. ఇంకొన్నిసార్లు చిరాకు తెప్పించి.. మరికొన్నిసార్లు కడుపులు చెక్కలయ్యేలా నవ్వించి.. చివరికి ఇలా మనకు బాధ మిగిల్చి వెళ్లిపోయారు కోట. ఆయన గురించి చెప్పేంత అనుభవం నాకు లేదు కానీ.. అలాంటి నటుడు మళ్లీ తెలుగు ఇండస్ట్రీకి దొరకరు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను' అన్నారు.
ఎప్పటికీ సజీవంగానే ఉంటారు - విష్ణు మంచు
‘మాటల్లో చెప్పలేనటు వంటి ఓ గొప్ప నటుడు, లెజెండ్. శ్రీ కోట శ్రీనివాస్ గారు చనిపోయారనే వార్త తెలిసి నా గుండె బరువెక్కింది. అద్భుతమైన నటుడు, అసమాన ప్రతిభ, ఆయన ఉనికి ఆయన ఉన్న ప్రతి ఫ్రేమ్‌లోనూ ఓ వెలుగు నింపింది. అది సీరియస్ పాత్ర అయినా, విలన్ అయినా, కామెడీ అయినా- ప్రతి పాత్రలోనూ ఆయన ప్రాణం పోశారు. అలాంటి అరుదైన ప్రతిభ కొద్దిమందికే దక్కుతుంది. ఆయనతో చాలా సినిమాల్లో పనిచేసే అదృష్టం నాకు కలిగింది. ఆయన నటనే సినిమా పట్ల నాకు ఆరాధన భావనను పెంచింది.. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. మనం ఆయనను శారీరకంగా కోల్పోయి ఉండవచ్చు, కానీ ఆయన కళ, ఆయన నవ్వు, ఆయన ఆత్మ ఆయన అలంకరించిన ప్రతి సన్నివేశంలో సజీవంగా ఉంటాయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలి.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతాం. మీరు ఎప్పుడూ మా గుండెల్లో నిలిచిపోయి ఉంటారు’ అని విష్ణు మంచు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Kota Srinivasarao: కోట శ్రీనివాసరావు జీవితంలో విశిష్ట ఘట్టం
Kota Srinivasa Rao: సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత